అమెరికాలో మొదటి ప్రపంచ యుద్ధాన్ని మించిన మరణాలు

అమెరికాలో మొదటి ప్రపంచ యుద్ధాన్ని మించిన మరణాలు

వాషింగ్టన్: అమెరికాలో కరోనా విధ్వంసాన్ని మిగిల్చుతోంది. వైరస్ బారిన పడి అంతకుముందెన్నడూ లేనన్ని మరణాలు నమోదవుతున్నాయి. యూఎస్ లో గడిచిన 24 గంటల్లో 740 మంది చనిపోయారు. దీంతో మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించిన దాని కంటే ఎక్కువ మంది అమెరికన్ల ప్రాణాల్ని కరోనా మహమ్మారి బలిగొందని హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది. మంగళవారం నాటికి అమెరికాలో మరణాల సంఖ్య 1,16,854 కు చేరుకోగా.. ఇన్​ఫెక్షన్ సోకిన వారి సంఖ్య 21,34,973 కు పెరిగిందని వర్సిటీ రిపోర్టులో వెల్లడించింది.
మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైన దాదాపు మూడేండ్ల తర్వాత అమెరికా యుద్ధంలోకి ఎంటరైంది. 1917 ఏప్రిల్ 6 న యునైటెడ్ స్టేట్స్ జర్మనీపై యుద్ధం ప్రకటించింది.  1918 నవంబర్ 11న యుద్ధ విరమణ ప్రకటించింది. ఈ మధ్య కాలంలో జరిగిన వార్​లో 1,16,516 మంది అమెరికా సైనికులు చనిపోయారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి మరణాలు ఈ సంఖ్యను దాటాయని బుధవారం జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ తన వెబ్​సైట్​లో వెల్లడించింది.

1955 లో ప్రారంభమై 1975 లో ముగిసిన వియత్నాం యుద్ధంలో చనిపోయినవారి సంఖ్య కంటే కూడా..అమెరికాలో వైరస్ బారిన పడి చనిపోయిన వారి సంఖ్య ఇప్పటికే దాటి పోయింది. మొత్తం 25 ఏండ్ల యుద్ధ కాలంలో అమెరికా 58,220 మంది సైనికులను కోల్పోగా.. కేవలం మూడు నెలల వ్యవధిలోనే.. అంటే ఏప్రిల్ చివరి నాటికే వైరస్​వల్ల మరణాల సంఖ్య అంతకు మించిపోయింది.