నెగెటివ్ వచ్చినా హోం క్వారంటైన్

నెగెటివ్ వచ్చినా హోం క్వారంటైన్

న్యూఢిల్లీ: దేశంలోకి వచ్చేటోళ్లకు కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ పెట్టింది. సౌత్ ఆఫ్రికాలో పుట్టిన కరోనా ఒమిక్రాన్ వేరియంట్ స్పీడ్ గా ఇతర దేశాలకు వ్యాపిస్తుండటంతో ఇంటర్నేషనల్ ప్యాసింజర్లకు ట్రావెల్ గైడ్ లైన్స్ ను మార్చింది. బుధవారం నుంచి మన దేశానికి వచ్చే ఇంటర్నేషనల్ ప్యాసింజర్లు ఇకపై తప్పనిసరిగా గత 14 రోజుల ట్రావెల్ హిస్టరీ వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది. ట్రావెల్ హిస్టరీతో పాటు ఆర్టీపీసీఆర్ టెస్ట్ నెగెటివ్ సర్టిఫికెట్ ను, సెల్ఫ్​డిక్లరేషన్ ఫారమ్ ను కూడా ‘ఎయిర్ సువిధ’ పోర్టల్​లో ముందుగానే అప్​లోడ్ చేయాలని ఆదివారం కేంద్ర హెల్త్ మినిస్ట్రీ స్పష్టంచేసింది. కొత్త గైడ్ లైన్స్ డిసెంబర్ 1 నుంచే అమలులోకి వస్తాయని తెలిపింది. 

ట్రావెల్ గైడ్ లైన్స్ ఇవే.. 
జర్నీకి ముందు 72 గంటలలోపు తీసుకున్న ఆర్టీపీసీఆర్ టెస్ట్ నెగెటివ్ రిపోర్టును అప్​లోడ్ చేయాలని, టెస్ట్ రిపోర్టును ధ్రువీకరిస్తూ డిక్లరేషన్ కూడా ఉండాల ని కేంద్రం పేర్కొంది. టెస్ట్ రిపోర్టులలో అవకతవకలకు పాల్పడితే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కేంద్ర ప్రభుత్వం ‘ఎట్ రిస్క్’ లిస్టులో పెట్టిన 12 దేశాల నుంచి వచ్చే ప్యాసింజర్లకు టెస్టులతో పాటు అదనంగా నిఘా పెడతామని తెలిపారు. ఎయిర్ పోర్టుకు వచ్చిన వెంటనే వాళ్లు టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుందని, రిజల్ట్స్ వచ్చాకే ఎయిర్ పోర్టు నుంచి వెళ్లేందుకు లేదా ఇతర కనెక్టింగ్ ఫ్లైట్లు ఎక్కేందుకు అనుమతి ఉంటుందని పేర్కొంది. ‘‘ఎయిర్ పోర్టులో చేసే టెస్టులో నెగెటివ్ వస్తే.. 7 రోజులు హోం క్వారంటైన్​లో ఉండాలి. 8వ రోజు మరో సారి టెస్టు చేసుకోవాలి. అప్పుడు కూడా నెగెటివ్ వస్తే.. ఆ తర్వాత 7 రోజులు సెల్ఫ్​మానిటర్ చేసుకోవాలి” అని కేంద్రం గైడ్ లైన్స్​లో పేర్కొంది. మిగతా దేశాల నుంచి వచ్చే ప్యాసింజర్లను ఎయిర్ పోర్టు నుంచి వెళ్లేందుకు అనుమతిస్తారు. వాళ్లు కూడా 14 రోజుల పాటు సెల్ఫ్​మానిటర్ చేసుకోవాలి. ఈ ఫ్లైట్లలో వచ్చిన ప్యాసింజర్లలో 5% మందికి ర్యాండమ్​గా టెస్టులు చేస్తారు.  

టెస్టులు, సర్వీలెన్స్ పెంచండి: రాష్ట్రాలకు గైడ్ లైన్స్ 
ఒమిక్రాన్ వేరియంట్ పై అన్ని రాష్ట్రాలు, యూటీలు అలర్ట్ గా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరించింది. విదేశాల నుంచి వచ్చే ప్యాసింజర్లపై ప్రధానంగా ‘ఎట్ రిస్క్’ లిస్టులో ఉన్న దేశాల నుంచి వచ్చేటోళ్లపై బాగా ఫోకస్ పెట్టాలని చెప్పింది. ఈ మేరకు రాష్ట్రాలు, యూటీలకు ఆదివారం తాజాగా గైడ్ లైన్స్ జారీ చేసింది. కంటైన్​మెంట్​కు కఠిన చర్యలు తీసుకోవాలని, సర్వేలెన్స్ పెంచాలని, హాట్ స్పాట్లను నిరంతరం మానిటర్ చేయాలని, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను పెంచుకోవాలని సూచించింది. రిస్క్ కంట్రీస్ ప్యాసింజర్లకు కరోనా పాజిటివ్ వస్తే.. వాళ్ల శాంపిల్స్ ను తప్పనిసరిగా ఇన్సాకాగ్(ఇండియన్ సార్స్ కరోనా వైరస్2 జీనోమిక్స్ కన్సార్షియం) ల్యాబ్ లకు పంపాలని తెలిపింది. అన్ని రాష్ట్రాలూ ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్యను పెంచాలని స్పష్టం చేసింది. వైరస్ పాజిటివిటీ రేటు 5% కంటే తక్కువకు చేరేలా కృషి చేయాలని సూచించింది. కరోనాపై రెగ్యులర్​గా మీడియా సమావేశాలు పెట్టి సరైన సమాచారం ఇస్తేనే.. తప్పుడు సమాచారంతో ఆందోళనకు గురయ్యే ప్రమాదం తప్పుతుందని వివరించింది. 

మరిన్ని దేశాలకు పాకిన ఒమిక్రాన్ 
ఒమిక్రాన్ వేరియంట్ మరిన్ని దేశాలకు వ్యాపిస్తోంది. సౌత్ ఆఫ్రికాలో ఈ నెల 24న బయటపడిన కొన్ని రోజులకే ఈ వేరియంట్ బోట్స్ వానా, బెల్జియం, హాంకాంగ్, ఇజ్రాయెల్​లకు పాకింది. ​తాజాగా ఆస్ట్రేలియాలో రెండు కేసులు, బ్రిటన్​లో రెండు, జర్మనీ, ఇటలీలోనూ ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇది అమెరికాలోకి ఇదివరకే వ్యాపించి ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదని ఆ దేశ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ నిపుణుడు డాక్టర్ ఆంథోనీ ఫౌచీ అన్నారు.