ఫీజుల కోసం కార్పొరేట్ స్కూళ్ల కొత్త దందా

ఫీజుల కోసం కార్పొరేట్ స్కూళ్ల కొత్త దందా
  • స్కూల్ ఫీజులకు లోన్లు ఇప్పిస్తారట
  • ఫీజు వసూళ్లకు కార్పొరేట్ స్కూళ్ల ఎత్తుగడ
  • ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలతో మేనేజ్మెంట్ల ఒప్పందం

ఫీజుల వసూళ్ల కోసం కార్పొరేట్​ స్కూళ్లు కొత్త దందాకు తెరలేపాయి. తల్లిదండ్రులకు ఫైనాన్స్​ కంపెనీల ద్వారా లోన్లు ఇప్పించి మరీ ఫీజులు దండుకుంటున్నాయి. ఇందుకోసం ఫైనాన్స్​ కంపెనీలతో స్కూళ్ల యాజమాన్యాలు ఒప్పందాలు చేసుకుంటున్నాయి.

హైదరాబాద్, వెలుగు: ఇప్పటివరకు ఇండ్లకో, బండ్లకో బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు లోన్లు ఇస్తాయని విన్నాం, చూశాం. కానీ టైమ్‌‌‌‌‌‌‌‌కు తగ్గట్టు ఫైనాన్స్​ కంపెనీలు కొత్త ఎత్తుగడలు వేస్తున్నాయి. స్కూల్ ఫీజులకూ లోన్లు ఇస్తున్నాయి. అది కూడా మేనేజ్మెంట్లే దగ్గరుండి మరీ ఇప్పిస్తున్నాయి. ఇది పేరెంట్స్ కు ఊరట  కల్పించినట్టు కన్పించినా దీనివెనుక ఫీజుల వసూళ్ల టార్గెటే కనిపిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్​లోని కొన్ని స్కూళ్లలో ఈ దందా తెరమీదికి వస్తోంది. 
కరోనా కాలంలోనూ అడ్డగోలు దోపిడీ
రాష్ట్రంలో 10,800 వరకు ప్రైవేటు స్కూళ్లున్నా, వీటిలో కార్పొరేట్ స్కూళ్లు 500 వరకు ఉన్నాయి. మిగిలివి బడ్జెట్ స్థాయి స్కూళ్లు. అయితే బడా కార్పొరేట్ స్కూళ్లలో రూ.2లక్షల నుంచి రూ.5లక్షల వరకు ఫీజు ఉంది. కొన్ని స్కూళ్లలో కొత్త అడ్మిషన్లకు అదనంగా రూ.2 లక్షల నుంచి రూ.3లక్షల వరకూ వసూలు చేస్తున్నారు. ఈ మొత్తం ఒకేసారి కట్టాలంటే పేరెంట్స్​కు ఇబ్బందే. ఈ కరోనా కారణంగా జనాల ఆర్థిక పరిస్థితి అంతంతగానే ఉండటంతో స్కూల్ ఫీజులకు మేనేజ్మెంట్లే దగ్గరుండి లోన్లు ఇప్పిస్తున్నాయి. హైదరాబాద్ బండ్లగూడలోని ఓ కార్పొరేట్ స్కూల్ ఈ మధ్యే పేరెంట్స్​కు మెయిల్ పెట్టింది. తాము ఓ ఫైనాన్స్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నామని, ఆ కంపెనీ నుంచి స్కూల్ ఫీజు కోసం లోన్లు తీసుకోవచ్చని పేర్కొంది. ఎడ్యుకేషన్ ఫీజులపై ఇన్సూరెన్స్ వర్తిస్తుందని చెప్పింది. ఈ ట్రాన్సాక్షన్స్ విషయంలో తాము ఇన్వాల్వ్ కాబోమంది. లోన్ తీసుకున్న వారికి 6 నెలలు, 9 నెలలు, 12 నెలల ఈఎంఐ సౌకర్యంఇస్తున్నారు. 12 ఇన్​స్టాల్మెంట్లకు 3.5శాతం వడ్డీ రేటు, 6 ఇన్​స్టాల్మెంట్లకు 1.5 శాతం ఉంటుందని పేరెంట్స్​కు పంపిన మెయిల్స్​లో పేర్కొన్నది. 
సర్కారు ఆదేశాలు బేఖాతర్
ఫీజు కట్టడంలో ఇబ్బంది పడుతున్న పేరెంట్స్​కు స్కూల్ సిబ్బంది, ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులు నేరుగా  ఫోన్లు చేస్తున్నారు. సిటీలోని కొన్ని స్కూళ్లు ఈ ఏడాది నుంచే ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి. అయితే ప్రభుత్వం నెలనెలా ఫీజులు తీసుకోవాలని ఆదేశాలివ్వగా, మేనేజ్మెంట్లు పట్టించుకోకపోవడంపై పేరెంట్స్ మండిపడుతున్నారు. నెలనెలా ఫీజు కట్టేదానికి వడ్డీ వేసుడేందని ప్రశ్నిస్తున్నారు. ఆ  స్కూళ్లపై చర్యలు తీసుకోవాలంటున్నారు.