హైదరాబాద్: కుళ్లిపోయిన చికెన్ వ్యర్థాలను అక్రమంగా చేపల వ్యాపారులకు విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. ఏపీలోని.. ఒంగోలు, భీమవరం ప్రాంతాలకు అక్రమంగా చికెన్ వ్యర్థాలను తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అత్తాపూర్ నుంచి వెళ్తున్న లారీలను గుర్తించి పోలీసులకు ఒక స్వచ్ఛంద సంస్థ సభ్యులు సమాచారం ఇచ్చారు. రాష్ట్ర సరిహద్దులు దాటించి సొమ్ము చేసుకుంటున్న ముఠాలపై పోలీసులు నిఘా పెట్టారు. GHMC రెండరింగ్ ప్లాంట్కి తరలించాల్సిన వ్యర్థాలను అక్రమంగా ఏపీకి ఈ ముఠా తరలిస్తున్నట్లు పోలీసుల తనిఖీల్లో వెల్లడైంది.
చికెన్ వ్యర్థాలతో పెంచిన చేపలు తింటే అనారోగ్యం బారిన పడతారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. క్యాట్ ఫిష్ తింటే క్యాన్సర్ బారిన పడుతుండడంతో వాటిని గతంలోనే నిషేధించారు. చికెన్ వేస్టేజీ, కుళ్లిన కోడిగుడ్లను చికెన్ సెంటర్ల నుంచి సాయంత్రం ఒక వెహికల్ ద్వారా సేకరించి అర్ధ రాత్రికి రాష్ట్ర సరిహద్దులు దాటించి.. చేపల చెరువులకు తరలిస్తున్నారు. చేపల చెరువు నిర్వాహకులు వాటిని ఉడికించి చేపలకు ఆహారంగా వేస్తున్నారు.
ఒకప్పుడు వృథాగా పారేసే చికెన్ వేస్టేజీకి ఇప్పుడు మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంది. చికెన్ వ్యర్థాలు, కుళ్లిపోయిన కోడిగుడ్లు చేపలకు ఆహారంగా వేస్తుండడంతో వీటికి ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఒక్కో కేజీ వేస్టేజీని రూ.8కి కొనుగోలు చేసి చేపల చెరువుల నిర్వాహకులకు రూ.15కు అమ్ముతున్నారు. ముందుగానే చికెన్ సెంటర్ల ఓనర్లకు అడ్వాన్సులు చెల్లించి ప్రతి రోజు వేస్టేజీని తీసుకెళ్తున్నారు.
