
- మెడికల్, నాన్ మెడికల్ విభాగాలకు వేర్వేరుగా హెచ్ఓడీలు
- మెడికల్ డైరెక్టర్ దగ్గర్నుంచి సెక్యూరిటీ వరకూ డ్యూటీ చార్ట్
- ఏఐజీ, యశోద హాస్పిటల్స్ నిర్వహణపై సర్కారు స్టడీ
హైదరాబాద్, వెలుగు: టిమ్స్ హాస్పిటల్స్ ద్వారా రాష్ట్రంలో పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. హైదరాబాద్ లోని సనత్ నగర్, అల్వాల్, కొత్తపేటలో కొత్తగా నిర్మిస్తున్న తెలంగాణ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) హాస్పిటల్స్ లో అత్యున్నత ప్రమాణాలతో అడ్మినిస్ట్రేషన్, మెయింటెనెన్స్ వ్యవస్థలను తీర్చిదిద్దేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఇందులో భాగంగా గచ్చిబౌలిలోని ఏఐజీ, హైటెక్ సిటీలోని యశోద వంటి వెయ్యి బెడ్ల కెపాసిటీ ఉన్న కార్పొరేట్ హాస్పిటల్స్ పనితీరును స్టడీ చేశారు. ఈ స్టడీ ఆధారంగా టిమ్స్ కోసం ఒక పటిష్టమైన అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ సిద్ధం చేస్తున్నారు. కాగా.. సనత్‌నగర్ టిమ్స్ హాస్పిటల్ లో డిసెంబర్ నాటికి సేవలు అందుబాటులోకి తేవాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. టిమ్స్ తరహాలోనే వెయ్యి బెడ్ల సామర్థ్యంతో ఉన్న ఏఐజీ, యశోద ఆసుపత్రులలోని అడ్మినిస్ట్రేషన్, మెయింటెనెన్స్ విధానాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ హాస్పిటల్స్ లో మెడికల్, నర్సింగ్, సపోర్టింగ్ స్టాఫ్, ఔట్ సోర్సింగ్ స్టాఫ్, వారి విధులు, సాలరీలు వంటి వివరాలు సేకరించారు. ఏఐజీలో ఐటీ, బయోమెడికల్ వంటి కీలక డిపార్ట్ మెంట్లను కూడా ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నిర్వహిస్తుండగా... యశోదలో వీటిని సొంతంగా (ఇన్-హౌస్) చూసుకుంటున్నారు. ఏఐజీలో 20 నాన్ -మెడికల్ డిపార్ట్ మెంట్లు ఉండగా, యశోదలో 25 వరకు ఉన్నాయి. ఈ రెండు నమూనాలను బేరీజు వేస్తూ ఏఐజీ తరహాలో ఎక్కువ సిబ్బందితో విస్తృత సేవలు అందించాలా? లేక యశోద నమూనాలో తక్కువ సిబ్బందితో కీలక డిపార్ట్ మెంట్లపై పూర్తి కంట్రోలింగ్ తో ముందుకు వెళ్లాలా? అనే దానిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.
ప్రతి ఫ్లోర్‌కు ఒక ఆర్ఎంఓ/మేనేజర్
ఏఐజీ, యశోద కార్పొరేట్ హాస్పిటల్స్ పై అధ్యయనం తర్వాత టిమ్స్ లో అడ్మినిస్ట్రేషన్ ను మెడికల్, నాన్-మెడికల్ డిపార్టుమెంట్లుగా విభజిస్తామని అధికారులు చెబుతున్నారు. మెడికల్ సేవలకు మెడికల్ డైరెక్టర్ (ఎండీ), నాన్- మెడికల్ సేవలకు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో) నేతృత్వం వహిస్తారు. ఓపీ, ఐపీ బిల్లింగ్, ఫ్రంట్ ఆఫీస్, హెచ్‌ఆర్, ఫార్మసీ, ఇంజినీరింగ్, బయోమెడికల్, ఐటీ, క్వాలిటీ, ల్యాబ్, పేషెంట్ కేర్, సానిటేషన్, సెక్యూరిటీ, ఫైర్ సేఫ్టీ, లాండ్రీ వంటి డిపార్ట్ మెంట్లను విభజించి ప్రతి దానికి ఒక ఇన్‌చార్జిని నియమించి పర్యవేక్షణ అప్పగించనున్నారు.
వీరిద్దరూ హాస్పిటల్స్ బోర్డుకు రిపోర్ట్ చేస్తారు. సూపర్ వైజింగ్ ను మరింత పటిష్టం చేసేందుకు ప్రతి ఫ్లోర్ కు ఒక రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ లేదా మేనేజర్ ను నియమించే విషయంపై ఆలోచిస్తున్నారు. మెడికల్ డైరెక్టర్ స్థాయి నుంచి సెక్యూరిటీ గార్డు వరకు ప్రతిఒక్కరికీ నిర్దిష్ట విధులతో డ్యూటీ చార్ట్ ను రూపొందిస్తున్నారు. దీంతో పారదర్శకత, జవాబుదారీతనం పెరిగి రోగులకు మెరుగైన, కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుతాయని ప్రభుత్వం నమ్ముతున్నది.