వైశ్యులకు కార్పొరేషన్ పెట్టాలె .. ‘వైశ్య గర్జన’ సభలో వక్తల డిమాండ్

వైశ్యులకు కార్పొరేషన్ పెట్టాలె .. ‘వైశ్య గర్జన’ సభలో వక్తల డిమాండ్

ఎల్బీ నగర్, వెలుగు: వైశ్యులంతా తమ హక్కుల కోసం పార్టీలకు అతీతంగా పోరాడాలని వైశ్య వికాస వేదిక చైర్మన్ కాచం సత్యనారాయణ గుప్తా పిలుపునిచ్చారు. వైశ్యుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్, కమిషన్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివారం సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించిన ‘‘వైశ్య గర్జన’’ సభలో ఆయన మాట్లాడారు. ఉప్పల్ భగాయత్ లో ప్రభుత్వం కేటాయించిన 5 ఎకరాల భూమిపై కమిటీ వేసి అధికారిని నియమించాలన్నారు. 

గతంలో ఆర్యవైశ్యుల నుంచి 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, ఇప్పుడు రాజకీయంగా ఎక్కడున్నారో ఆలోచించుకోవాలని చెప్పారు. సమగ్ర కుటుంబ సర్వేలో నమోదైన అగ్రవర్ణాల లెక్కలను ప్రకటించాలని, జనాభా ప్రకారం రాజకీయాల్లో వాటా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. వైశ్యుల డిమాండ్లను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని, ప్రభుత్వం తరఫున వారికి అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమానికి ఆర్యవైశ్యులు ఎంతో మంది అండగా నిలిచారని అన్నారు. ఎల్బీ నగర్ నియోజకవర్గం పరిధిలో డివిజన్లు పెరుగుతాయని, వైశ్యులకు కొన్ని కార్పొరేటర్ టికెట్లు కేటాయిస్తామన్నారు. 

వైశ్యుల డిమాండ్లు ఇవే.. 

వైశ్యులకు కార్పొరేషన్, కమిషన్ ఏర్పాటు చెయ్యాలని, పేద వైశ్యులకు డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించాలని వైశ్య వికాస వేదిక ప్రభుత్వాన్ని కోరింది. ఈడబ్ల్యూఎస్ లో వర్గీకరణ చేయాలని, వైశ్య విద్యార్థులకూ విదేశీ విద్యా సహాయ నిధిని ఏర్పాటు చెయ్యాలని, వైశ్య బంధును ప్రారంభించాలని డిమాండ్ చేసింది. కార్యక్రమంలో ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు ప్రేమ్ గాంధీ, వైశ్య వికాస వేదిక ప్రధాన కార్యదర్శి నంగునూరు రమేష్, కోశాధికారి కండె రామ్ నరేష్, గౌరవ సలహాదారులు బుక్క ఈశ్వరయ్య, కోదుమూరి దయాకర్ రావు, కార్పొరేటర్ రంగా నరసింహ గుప్తా, కాల్వ సుజాత తదితరులు పాల్గొన్నారు.