
- రాజీవ్ యువ వికాసం స్కీమ్‌తో
- బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ కార్పొరేషన్లలో సందడి
- మిగతా కార్పొరేషన్లలోనూ
- మహిళలకు, యువతకు పథకాలు
- గతంలో ఎలాంటి స్కీమ్‌లు లేక ఆఫీసుల్లో స్తబ్దత
- ఖాళీగా కూర్చొని వెళ్లిన అధికారులు, ఉద్యోగులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఆరేండ్ల తర్వాత కార్పొరేషన్లు యాక్టివ్ అయ్యాయి. మొన్నటిదాకా బీసీ, ఎంబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్, ఫెడరేషన్ ఆఫీస్‌లు ఎలాంటి స్కీమ్‌లు లేక స్తబ్దుగా ఉండగా.. ఇప్పుడు సర్కారు కొత్త స్కీమ్‌లు ప్రకటించడంతో అధికారులు, సిబ్బంది అలర్ట్ అయ్యారు. ఏండ్లుగా ఖాళీగా కూర్చొని వెళ్లిన అధికారులు ఎట్టకేలకు విధులు మొదలుపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రాజీవ్ యువ వికాసం స్వయం ఉపాధి పథకాన్ని ప్రకటించింది. దాదాపు 5 లక్షల మంది బీసీ, ఎంబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నిరుద్యోగ యువతకు సబ్సీడీ అందించనుంది. రూ.2 లక్షల యూనిట్‌కు 70 శాతం సబ్సిడీ కింద రూ.1.40 లక్షలు.. రూ.4 లక్షల యూనిట్‌కు 60% సబ్సిడీ కింద రూ.2.40 లక్షలు ఇవ్వనుంది. ప్రతి కార్పొరేషన్ ఆయా వర్గాలకు ఈ స్కీమ్‌ను అందించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో అధికారులంతా కొన్నేండ్ల తరువాత విధుల్లో నిమగ్నమయ్యామని అంటున్నారు. ఇప్పటికే స్వయం ఉపాధి పథకాల కోసం ఏయే యూనిట్లు ఉండాలనే దానిపై లిస్ట్ రెడీ చేసి కార్పొరేషన్లలో పని చేస్తున్న అధికారులు ఆన్లైన్లో అప్లికేషన్లు తీసుకుంటున్నారు. వచ్చే నెల 5వ తేదీ వరకు అప్లికేషన్ల గడువు ఉంది. ఆ తర్వాత లబ్ధిదారుల ఎంపికకు అనుసరించాల్సిన విధివిధానాలపై కసరత్తు చేయనున్నారు.
స్కీంలు లేక కార్పొరేషన్లు నిర్వీర్యం
గత ప్రభుత్వ హయాంలో సబ్సీడీ స్కీంలు లేకపోవడంతో కార్పొరేషన్లు నిర్వీర్యమయ్యాయి. 2014 నుంచి 2018 వరకు అడపా దడపా కొంత సబ్సీడీ స్కీంలకు నిధులు విడుదల చేసి సర్కారు చేతులు దులుపుకున్నది. బీసీ కార్పొరేషన్ కు ఐదేండ్లలో రూ.420 కోట్లు మాత్రమే ఇచ్చింది. ఫెడరేషన్లకు అయితే పైసా కూడా ఇవ్వలేదు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సహా ఏ కార్పొరేషన్‌లోనూ సబ్సీడీ స్కీంలను అమలు చేయలేదు. దీంతో కార్పొరేషన్లు అస్తవ్యస్తమయ్యాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని కార్పొరేషన్లు, వాటి పనితీరు, అమలు చేయాల్సిన పథకాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా రివ్యూ చేశారు. ఈ క్రమంలోనే నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి పథకం అమలు చేయాలని.. ఇందుకు కార్పొరేషన్లకు పని కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. గతంలో కార్పొరేషన్లకు చైర్ పర్సన్లు, ఆఫీసర్లు ఉన్నప్పటికీ ప్రతినెలా శాలరీలు తీసుకోవడమే కానీ చేయడానికి ఏ పనీ లేదు. ఇప్పుడు రాజీవ్ యువ వికాసం స్వయం ఉపాధి స్కీం కంటే ముందే ఆయా కార్పొరేషన్లకు చైర్ పర్సన్లను ప్రభుత్వం నియమించింది. ఈ పథకం అమలులో అధికారులందరినీ బిజీ చేసింది.
మిగతా వాటిపైనా సర్కార్ ఫోకస్
మహిళలకు, యువతకు ఇంకా ఏయే కార్పొరేషన్ల నుంచి సహకారం అందించవచ్చనే దానిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. సంక్షేమ కార్పొరేషన్లకు కాకుండా మిగిలిన వాటిల్లో ఏ రకంగా ఉపాధి కల్పించవచ్చనే దానిపై ఇప్పటికే నివేదికలు కోరినట్లు తెలుస్తోంది. నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉపాధి మార్గాన్ని చూపాల్సిన సెట్విన్ కార్పొరేషన్పూర్తిగా ఉనికి కోల్పోయింది. మరిన్ని ట్రయినింగ్ ప్రోగ్రాంలు తెచ్చి సెట్విన్ ను గాడిలో పెట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఫిల్మ్ అండ్ టెలివిజన్, థియేటర్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ తోపాటు ట్రాక్టర్లు, హార్వెస్టర్లు కొనుగోలు చేసి రైతులకు అందించే ఆగ్రోస్ వంటి వాటిల్లోనూ మహిళలు, యువతకు ఉపాధి కల్పించేలా నిర్ణయాలు తీసుకోవాలని చూస్తున్నది. ఆయిల్‌ఫెడ్, హాకా వంటి సంస్థల్లో ప్రత్యేక ఉత్పత్తులు తెచ్చి మహిళలను భాగస్వామ్యం చేయాలని యోచిస్తున్నది.
అప్పుల ఊబిలో కార్పొరేషన్లు
రాష్ట్రంలో 90కి పైగా కార్పొరేషన్లు ఉన్నాయి. ఇందులో ఐదారు మినహా మిగతా కార్పొరేషన్లకు ఎలాంటి ఆదాయం లేదు. ఈ కార్పొరేషన్లు ఎక్కువగా రాజకీయ నేతలకు పదవుల కోసం.. గత ప్రభుత్వానికి అప్పులు సమకూర్చడానికి మాత్రమే ఉపయోగ పడ్డాయి. కార్పొరేషన్ల ద్వారా గత ప్రభుత్వం తీసుకున్న మొత్తం అప్పులు రూ.2,82,084 కోట్లు ఉన్నది. ఇందులో కొంత మొత్తం ఈ సర్కార్ ఇప్పటికే చెల్లించింది. ఇటు కార్పొరేషన్లకు ఆదాయం లేక, ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వక.. ప్రజలకు ఉపయోగపడకపోవడంతో ఉన్న కార్పొరేషన్లలో 90 శాతం కార్పొరేషన్లు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి.