పరమాన్నం వండి పెట్టిన ఆకుల శ్రీవాణి

పరమాన్నం వండి పెట్టిన ఆకుల శ్రీవాణి

ఎల్​బీనగర్, వెలుగు: కార్పొరేషన్​లో పనులు పూర్తిచేసి సరూర్ నగర్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి సంబురాలు చేసుకున్నారు. డివిజన్ వాసులకు ఇచ్చిన హామీలను నెరవేర్చానని పేర్కొంటూ పరమాన్నం వండి పంచిపెట్టారు. డివిజన్ పరిధి జైస్వాల్ కాలనీలో మంగళవారం సీసీ రోడ్ల నిర్మాణ పనులు పూర్తయిన సందర్భంగా ఆకుల శ్రీవాణి పరమాన్నం వండి ఉత్సవాలు జరుపుకొన్నారు. ఈ కార్యక్రమానికి పారిశుద్ధ్య కార్మికులతో పాటు పలువురిని ఆహ్వానించి వారికి వంటలు వడ్డించారు. ఈ సందర్భంగా ఆకుల శ్రీవాణి మాట్లాడుతూ.. జనాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం నాయకుల బాధ్యత అని అన్నారు. 

స్థానిక మంత్రి సబితారెడ్డి నిధులు మంజూరు చేయకుండా అడ్డుకుంటున్నారని, అయినా పనులను ఆపలేదన్నారు. సకాలంలో నెరవేర్చామని ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి సబితారెడ్డి శంకుస్థాపనలకే పరిమితమయ్యారని విమర్శించారు. ఎన్నికల సమయంలో శంకుస్థాపనలు చేసి పనులను గాలికి వదిలేయడం సరికాదన్నారు. ఎన్నికల్లో బీజేపీని ఆదరించాలని, జనాల కష్టాలు తీరుస్తామని వెల్లడించారు.