కరీంనగర్ డ్రైనేజీలో శవం.. మొదటి భర్తే హంతకుడు

కరీంనగర్ డ్రైనేజీలో శవం.. మొదటి భర్తే హంతకుడు

కరీంనగర్ కోర్టు సమీపంలోని డ్రైనేజీలో ఈ నెల 23న శవమై కనిపించిన మహిళను ఆమె ప్రియుడే(మొదటిభర్త) హత్య చేశాడని పోలీసులు నిర్ధారించారు. ఈ కేసుకు సంబంధించి సీపీ కమలాసన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. హతురాలు కవిత, నిందితుడు కమలాకర్ మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం ఊత్కూరుకు చెందిన వారిగా సీపీ కమలాసన్ రెడ్డి తెలిపారు. ‘కవిత, కమలాకర్ గతంలో ప్రేమించి పెళ్లి చేసుకొని  మూడు నెలలకే  విడాకులు తీసుకున్నారు. అనంతరం మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్న కవిత.. ముగ్గురు పిల్లలు పుట్టాక తిరిగి కమలాకర్ దగ్గరికి వెళ్లిపోయింది. గత పదేళ్ళ నుంచి వీరిద్దరూ హైదరాబాద్‌లో కలిసి ఉంటున్నారు. కాగా.. ఈ మధ్య కవిత మరో వ్యక్తితో చనువుగా ఉంటుందని కమలాకర్ అనుమానించాడు. ఈ నేపథ్యంలోనే ఆమెను తిరిగి లక్షెట్టిపేటకు తీసుకెళ్తానని చెప్పి.. అద్దె కారులో కరీంనగర్ దాకా వచ్చారు. అక్కడ వారిద్దరూ కారులో నుంచి దిగి కారును వెనుకకు పంపించారు. అనుమానం విషయంలో కోర్టు పక్కన బస్టాప్‌లో ఇద్దరూ గొడవ పడ్డారు. కోపోద్రిక్తుడైన కమలాకర్..  అక్కడే కవిత మెడకు చున్నీతో ఉరి బిగించడంతో ఊపిరాడక చనిపోయింది. ఎవరైనా చూస్తారన్న భయంతో మృతదేహాన్ని డ్రైనేజీ‌లోకి నెట్టి కమలాకర్ అక్కడి నుంచి పారిపోయాడు. నిందితుడు శుక్రవారం కరీంనగర్‌లోని తన అక్క దగ్గరికి రావడంతో.. నిఘా వేసి పట్టుకున్నాం’ అని ఆయన తెలిపారు.