
నాటని మొక్కలకు బిల్లులు
ఉపాధి హామీ పనుల్లో అవినీతి
4,850 మంది ఫీల్డ్ అసిస్టెం ట్లపై ఆరోపణలు
చర్యలు తీసుకునేందుకు పెద్దా ఫీసర్ల వెనుకంజ
చేయని పనులకు పైసల్ వసూల్
ఉపాధి హామీ పనుల్లో అవినీతి ఏటికేడు పెరిగిపోతోంది. గతేడాది లెక్కల్లేకుండానే ఏకంగా 214 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించారు. 2018-19లో రాష్ట్రంలో మొత్తం రూ.2,174.5 కోట్ల విలువైన పనులు చేసినట్లు బిల్లులు డ్రా చేశారు. అయితే ఇప్పటి వరకు రూ.1,960.5 కోట్ల పనులకు సంబంధించిన రికార్డులు మాత్రమే ఫీల్డ్ అసిస్టెంట్లు సోషల్ ఆడిట్ టీమ్‌లకు అందజేశారు. మిగతా 214 కోట్ల పనులు జరిగాయా? లేదా? అనే వివరాలేవి తెలియని పరిస్థితి.
చేయని పనులకు మస్టర్లు రాయడం.. జరిగిన పనికంటే ఎక్కువగా కొలతలు వేయడం.. నాటని మొక్కలకు బిల్లులు చెల్లించడం.. ఇలాంటి అక్రమాలు అనేకం సోషల్ అడిట్‌లో వెలుగు చూస్తున్నాయి. 2018–19 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని 8,729 గ్రామ పంచాయతీల్లో సోషల్ ఆడిట్ టీమ్‌లు తనిఖీలు చేస్తే.. సగానికిపైగా అంటే 4,850 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. వీరిపై శాఖాపరమైన చర్యలకు ఆడిట్ టీమ్‌లు సిఫార్సు చేశాయి.సోషల్ ఆడిట్ టీమ్‌లు ఇంటింటా తిరిగి సేకరించిన వివరాలు, గ్రామ, మండల ప్రజా వేదికల్లో సమర్పించిన నివేదికల ఆధారంగా రూ.12.46 కోట్ల మేర లెక్కల్లో తేడాలు ఉన్నట్లు తేలింది. ఆఖరికి రూ.4.67 కోట్ల అవినీతి జరిగినట్లు నిర్ధారించారు. ఇందులో ఇప్పటి వరకు రూ.2.97 కోట్లు రికవరీ చేయగా, రూ.1.70 కోట్లను రికవరీ చేయాల్సి ఉంది.
సోషల్ ఆడిట్ టీమ్‌లు 4,850 మంది ఫీల్డ్ అసిస్టెంట్లపై శాఖాపరమైన చర్యలకు సిఫార్సు చేశాయి. అన్ని ఆధారాలూ సమర్పించినా, రూ.214 కోట్ల విలువైన పనులకు రికార్డులు సమర్పించకపోయినా సస్పెండ్ చేసింది 37 మంది ఫీల్డ్ అసిస్టెంట్లనే. 1,345 మంది టెక్నికల్ అసిస్టెంట్ల అవినీతికి సంబంధించిన ఆధారాలను సోషల్ ఆడిట్ బృందాలు సమర్పిస్తే సస్పెండ్ చేసింది ఏడుగురినే. 243 మంది ఇంజినీరింగ్ కన్సల్టెంట్ల మీద ఆరోపణలు వస్తే ఒకరిని, 470 మంది కంప్యూటర్ ఆపరేటర్ల మీద చర్యలకు సిఫార్సు చేస్తే ఒకరిని, 151 మందిపై రిపోర్ట్ ఇస్తే ఇద్దరిని మాత్రమే సర్వీస్ నుంచి తొలగించారు. ఉపాధి పనులపై ది సొసైటీ ఫర్ సోషల్ ఆడిట్, అకౌంటబులిటీ అండ్ ట్రాన్సపరెన్సీ(ఎస్‌ఎస్‌ఏఏటీ) ఆధ్వర్యంలో ప్రత్యేక టీమ్‌లు ఏటా సోషల్ ఆడిట్లు చేస్తున్నాయి. సుమారు 500 మంది ఇందులో పాల్గొంటున్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించి తనిఖీలు చేస్తూ.. అవినీతిని వెలుగులోకి తెస్తున్నా.. సంబంధిత సిబ్బంది, అధికారులపై చర్యలు తీసుకోవడానికి పెద్దాఫీసర్లు మీనమేషాలు లెక్కిస్తున్నారు. దీంతో సోషల్ ఆడిట్ అనే కాన్సెప్ట్‌కు అర్థం లేకుండా పోతోందనే ఆవేదన వ్యక్తమవుతోంది.