LSG vs PBKS: టాప్-2 లో శ్రేయాస్ సేన: లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్స్‌కు చేరువలో పంజాబ్

LSG vs PBKS: టాప్-2 లో శ్రేయాస్ సేన: లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్స్‌కు చేరువలో పంజాబ్

ఐపీఎల్ 2025 లో పంజాబ్ కింగ్స్ తమ జోరు కొనసాగిస్తోంది. ఆదివారం (మే 4) ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జయింట్స్ పై 37 పరుగుల భారీ విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ లో ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (48 బంతుల్లో 91:6 ఫోర్లు, 7 సిక్సర్లు) చెలరేగి ఆడడంతో పాటు బౌలింగ్ లో అర్షదీప్ సింగ్ మ్యాజిక్ చేశాడు. ఈ విజయంతో 15 పాయింట్లను తమ ఖాతాలో వేసుకున్న పంజాబ్ ప్లే ఆఫ్స్ కు చేరువైంది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో లక్నో సూపర్ జయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 199 పరుగులకు పరిమితమైంది.

237 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జయింట్స్ కు ఘోరమైన ఆరంభం లభించింది. మూడో ఓవర్లో అర్షదీప్ సింగ్ లక్నోకి కోలుకోలేని షాక్ ఇచ్చాడు. రెండో బంతికి మార్ష్ (0) ను ఔట్ చేయడంతో పాటు ఐదో బంతికి మార్కరం (13) ను బౌల్డ్ చేశాడు. కాసేపటికే ఆర్షదీప్.. ఒక చక్కటి బంతితో పూరన్ (6) ను ఎల్బీడబ్ల్యూ రూపంలో వెనక్కి పంపాడు. దీంతో లక్నో 27 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. పంజాబ్ బౌలర్లు విజృంభించడంతో లక్నో పవర్ ప్లే లో కేవలం 38 పరుగులు మాత్రమే చేయగలిగింది. 

ఉన్నంత సేపు క్రీజ్ లో ఇబ్బంది పడిన పంత్(18) 8 ఓవర్లో భారీ షాట్ కు ప్రయత్నించి ఔటయ్యాడు. 10 ఓవర్లో మిల్లర్(10) కూడా పెవిలియన్ కు చేరడంతో పంజాబ్ 73 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఓటమిని ఖరారు చేసుకుంది. ఈ దశలో ఘోర ఓటమి తప్పదనుకుంటున్న సమయంలో ఆయుష్ బదోనీ, అద్బుల్ సమద్ (45) వీరోచితంగా పోరాడారు. కొట్టాల్సిన రన్ రేట్ పెరిగిపోతున్నా తడబడకుండా బౌండరీల వర్షం కురిపించారు. ఇద్దరూ ఆరో వికెట్ కు 41 బంతుల్లోనే 81 పరుగులు జోడించి పంజాబ్ విజయాన్ని ఆలస్యం చేశారు. చివర్లో బదోనీ (40 బంతుల్లో 74: 5 ఫోర్లు, 5సిక్సర్లు) వీరోచితంగా పోరాడినా లక్నోకి విజయాన్ని అందించలేకపోయాడు. 

పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఓమర్జాయ్ రెండు మార్కో జాన్సెన్, చాహల్ ఒక వికెట్ తీసుకున్నారు.  
అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 236 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్(48 బంతుల్లో 91:6 ఫోర్లు, 7 సిక్సర్లు) చెలరేగి ఆడడంతో పాటు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(45), శశాంక్ సింగ్ (33) మెరుపులు మెరిపించారు. ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (91) టాప్ స్కోరర్ గా నిలిచాడు. లక్నో బౌలర్లలో ఆకాష్ మహారాజ్ సింగ్, దిగ్వేశ్ తలో రెండు వికెట్లు పడగొట్టాడు. ప్రిన్స్ యాదవ్ కు ఒక వికెట్ తీసుకున్నాడు.                            

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ ఆరంభములో వికెట్ కోల్పోయింది. ఆకాష్ మహారాజ్ తొలి ఓవర్ లోనే ప్రియాంశ ఆర్యను ఔట్ చేశాడు. మూడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన జోష్ ఇంగ్లిస్.. మయాంక్ యాదవ్ యాదవ్ వేసిన రెండో ఓవర్లో హ్యాట్రిక్ సిక్సర్లు కొట్టి దూకుడు చూపించాడు. ఉన్నంత వరకు మెరుపులు మెరిపించి ఇంగ్లిస్ 30 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ తో కలిసి సిమ్రాన్ సింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఇద్దరూ ధాటిగా ఆడడంతో 6 ఓవర్లలో పంజాబ్ 2 వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది.

పవర్ ప్లే తర్వాత వీరి జోరు కొనసాగింది. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోర్ కార్డును ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో సిమ్రాన్ సింగ్ 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. మూడో వికెట్ కు 78 పరుగులు జోడించిన తర్వాత 45 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అయ్యర్ ఔటయ్యాడు. ఒక ఎండ్ లో వికెట్లు పడుతున్నా మరో ఎండ్ లో సిమ్రాన్ సింగ్ తన హిట్టింగ్ తో హోరెత్తించాడు. ధాటిగా ఆడే క్రమంలో 91 పరుగుల వద్ద ఔటయ్యి సెంచరీ మిస్ చేసుకున్నాడు. చివర్లో శశాంక్ సింగ్(33), మార్కస్ స్టోయినిస్(15) భారీ హిట్టింగ్ తో పంజాబ్ స్కోర్ ను 230 పరుగులు దాటించారు.