
ముంబయి: ఢిల్లీ - షిర్డీ విమానంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇండిగో విమానంలో ఎయిర్‌హోస్టెస్‌పై ఓ ప్రయాణికుడు మద్యం మత్తులో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. శుక్రవారం ( మే 2) మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విమానం టాయిలెట్ వద్ద ఎయిర్ హోస్టెస్‌ను నిందితుడు అసభ్యకరంగా తాకినట్లు పోలీసులు వెల్లడించారు. షిర్డీ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయిన వెంటనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
మే 2, 2025న ఢిల్లీ నుండి షిర్డీకి వెళ్లే 6E 6404 విమానంలో ఎయిర్ హోస్టస్ పట్ల ఓ ప్రయాణికుడు అసభ్యకరంగా ప్రవర్తించిన తీరుపై ఎయిర్ హోస్టెస్ క్రూ మేనేజర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో విమానం షిర్డీలో ల్యాండ్ కాగానే భద్రతా సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం అతడిని రహతా పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వైద్య పరీక్షలు నిర్వహించగా అతడు మద్యం తాగినట్లు నిర్ధారణ అయిందని తెలిపారు. దీంతో నిందితుడికి రహతా పోలీసులు నోటీసు జారీ చేశారు.
ఈ ఘటపై ఇండిగో యాజమాన్యం ప్రెస్ స్టేట్ మెంట్ విడుదల చేసింది. మే 2 వతేదీన ఢిల్లీ నుంచి షిర్డీ వెళ్లే విమానంలో ఓ ప్రయాణికుడు విమానం క్యాబిన్ సిబ్బంది పట్ల అనుచితంగాప్రవర్తించాడని ... అతనిని వికృతంగా ప్రకటించారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే ఆ వ్యక్తిని పోలీసులకు అప్పగించామని.. ప్రయాణికులకు సురక్షితమైన వాతావరణాన్ని కలుగజేయడానికి తాము కట్టుబడి ఉన్నామని ప్రకటించింది. ఇలాంటి ఘటనల పట్ల ప్రయాణికులకు కలిగే అసౌకర్యానికి చింతిస్తున్నామని పేర్కొంది.