ముంబై: ఎన్సీపీ అధినేత, మహాయుతిలో భాగస్వామిగా ఉన్న డిప్యూటీ సీఎం అజిత్ పవార్ బారామతి విమాన ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఎన్సీపీకి పెద్ద దిక్కు ఎవరు కాబోతున్నారనేది హాట్ టాపిక్ గా మారింది. శరద్ పవార్ తో విభేదాల తర్వాత, ఎన్సీపీలో చీలిక వచ్చింది. మెజారిటీ వర్గం ఎమ్మెల్యేలు, నేతలు అజిత్ పవార్ తో ఉన్నారు. వీరంతా ఎన్డీయేలో భాగస్వాములయ్యారు.ఇప్పుడు అజిత్ పవార్ మరణం తర్వాత ఎన్సీపీ అధినేతగా ఆయన భార్య సునేత్ర పవార్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
రాజ్యసభ ఎంపీగా ఉన్న ఆమె వైపు అందరి చూపు మళ్లింది. సునేత్ర పవార్ ఎన్సీపీలో, మహారాష్ట్ర రాజకీయాల్లో పెద్ద నేతగా మారే అవకాశం ఉంది. మరాఠ్వాడా ప్రాంతంలోని ధారశివకు చెందిన ఆమె, రాజకీయంగా పలుకుబడి ఉన్నకుటుంబం నుంచి వచ్చారు. మాజీ మంత్రి, లోక్ సభ ఎంపీ అయిన పద్మ సింగ్ పాటిల్ సోదరి. 1985లో అజిత్ పవార్ ను వివాహం చేసుకున్న సునేత్ర, 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో బారామతి లోక్ సభ స్థానం నుంచి శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలేపై పోటీ చేశారు. ఈ పోటీలో ఆమె 1.5 లక్షల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు.
