
- ఇసుక వేలం నుంచి కోడిగుడ్ల అమ్మకాల దాకా వసూళ్ల పర్వం
- దేనికైనా కప్పం కట్టాల్సిందే.. మాట వినకపోతే బహిష్కరణలు
- ‘స్థానిక’ ఎన్నికల్లోనూ ఆడిందే ఆట పాడిందే పాట
- ఏ చిన్న పని జరగాలన్నాకమిటీ సభ్యులు ఓకే చెప్తేనే..!
- కేసులు పెట్టినా, పోలీసులు హెచ్చరించినా డోంట్ కేర్
- ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఇష్టారాజ్యం
- వాళ్ల ఆగడాలకు ఆగమవుతున్న జనం
- వీడీసీలను నిషేధించాలంటూ నిరసనలు, వినతులు
గ్రామాభివృద్ధి కోసం ఏర్పాటైన కమిటీ (వీడీసీ)లు దందాలకు అడ్డాలుగా మారాయి. దమ్కీలకు, వసూళ్లకు మారుపేరుగా మారిపోయాయి. ఊర్లలో కమిటీ సభ్యులు చెప్పిందే వేదం.. వాళ్లు రాసిందే శాసనం అన్నట్టు పరిస్థితి తయారైంది. ఆ దందాను ఎవరైనా ప్రశ్నిస్తే.. దాడులు! ఎదురుతిరిగితే.. సంఘ బహిష్కరణలు పరిపాటిగా మారాయి. ఇసుక, మొరం వేలం నుంచి మొదలుపెడితే.. ఆఖరికి కూల్ డ్రింక్స్, కోడిగుడ్లు అమ్మాలన్నా ఆ కమిటీలకు కప్పం కట్టాల్సిందే! ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోని చాలా ఊర్లలో విలేజ్ డెవలప్మెంట్ కమిటీల రాజ్యం నడుస్తున్నది. గ్రామాభివృద్ధి మాటున కమిటీ సభ్యులు పెత్తనం చెలాయిస్తున్నారు. అరాచకాలు సృష్టిస్తున్నారు. పెద్దలమని చెప్తూ.. అన్నిట్లో తలదూరుస్తున్నారు. కుటుంబ కలహాల్లోనూ కలుగజేసుకొని.. ఇష్టారీతిగా తీర్పులు ఇచ్చేస్తున్నారు.
నిజామాబాద్/ నిర్మల్/ఆదిలాబాద్, వెలుగు: నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లోని అనేక గ్రామాల్లో గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసీ)లు సమాంతర పాలన సాగిస్తున్నాయి. కలిసికట్టుగా గ్రామ దేవతల పండుగ చేసుకోవడానికి, ఊర్లలో అభివృద్ధి పనులు చేసుకోవడానికి 50 ఏండ్ల కింద అన్ని కుల సంఘాల పెద్దలతో ఈ కమిటీలు ఏర్పడ్డాయి. క్రమంగా రూపుమార్చుకొని.. కొందరి చేతుల్లోకి వెళ్లి పెత్తనం చెలాయించడమే లక్ష్యమన్నట్టుగా సాగుతున్నాయి. ప్రస్తుతం సర్పంచ్‌లు కూడా లేకపోవడంతో కమిటీ సభ్యులు ఆడిందే ఆట పాడిందే పాటగా నడుస్తున్నది. సర్పంచ్‌లు ఉన్నప్పుడైతే కొన్ని ఊర్లలో వాళ్లను కూడా వీడీసీలే శాసించేవి.
మాట వినలేదని ‘వెలి’
నిజామాబాద్ జిల్లా బాల్కొండ సెగ్మెంట్ పరిధిలోని ఎర్గట్ల మండలం తాళ్లరాంపూర్‌లో గీత కార్మికులు 2023–24 లో వీడీసీకి రూ. 1.38 లక్షలు చెల్లించి కల్లు అమ్ముకున్నారు. 2024– 25కు కూడా కొంత అమౌంట్ కట్టి బిజినెస్ కొనసాగించాలని గౌడ కులస్తులు భావించగా.. వీడీసీ ఒప్పుకోలేదు. మొత్తం ఈత చెట్లను తమకే అప్పగించి తమ కింద పనిచేయాలని హుకుం జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని ఒప్పుకోకపోవడంతో 53 గీత కార్మిక కుటుంబాలను అక్టోబర్ 15న బహిష్కరించింది. ఈ బహిష్కరణ ఇంకా అమలవుతూనే ఉంది. వారికి ఎవరూ ఎలాంటి సాయం చేయొద్దని.. కిరాణాషాపులు, హోటళ్లలోకి రానివ్వొద్దని ఆదేశించింది. చివరికి శ్రీరామ నవమి నాడు గుడికి వెళ్లిన గౌడ మహిళలను కుంకుమార్చన చేయకుండా వెళ్లగొట్టేలా చేసింది.
ఈ అవమానానికి నిరసనగా మహిళలు తమ పిల్లలతో పాటు నిజామాబాద్‌లో ర్యాలీ నిర్వహించారు. దీంతో పోలీసులు వీడీసీ సభ్యులు రాజ్‌కుమార్, దేవన్న, విష్ణుశర్మపై కేసు నమోదు చేశారు. ఏర్గట్ల పోలీసులు వారిని 28న అదుపులోకి తీసుకొని స్టేషన్ బెయిల్‌పై రిలీజ్ చేశారు. కేసులు నమోదు చేసినప్పటికీ వీడీసీ సభ్యుల్లో మార్పురాకపోగా.. మరింత రెచ్చిపోయారు. సోషల్ బాయ్‌కాట్ శిక్ష ఎదుర్కొంటున్న గీత కార్మికులు వద్ద కల్లు కొనుగోలు చేసి తాగినందుకు ముగ్గురి నుంచి రూ. 5 వేల చొప్పున జరిమానా వసూలు చేశారు. ఓ వ్యక్తి నుంచి రూ.20 వేల పెనాల్టీ రాబట్టారు. వీడీసీ ఆర్డర్స్ పాటించకుంటే తాము సంఘ బహిష్కరణ ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతో వాళ్లు జరిమానాలు చెల్లించారు.
తాళ్లరాంపూర్ పక్కనున్న దోమచంద్, గుమ్మిర్యాల విలేజ్ల నుంచి కూడా ఎలాంటి సేవలు అందుకోకుండా మానసికంగా వేధిస్తున్నారు. గీసిన కల్లు కొనడానికి ఎవరినీ రానీయకుండా నిఘా ఏర్పాటు చేశారు. ఇదే జిల్లా అంకాపూర్ విలేజ్‌లో అన్నదమ్ముల మధ్య ప్రాపర్టీ తగాదాలో వారం కింద వీడీసీ జోక్యం చేసుకోవడం వివాదాస్పదమైంది. ముప్కాల్ మండలం కొత్తపల్లి విలేజ్‌లో గీత కార్మికులు ఈతవనం కోసం ఏండ్ల తరబడి ఉపయోగిస్తున్న ల్యాండ్‌ను పశువులు కోసం వాడుతామని మూడేండ్ల కింద వీడీసీ పెద్దలు ప్రతిపాదించడాన్ని గీత కార్మికులు అడ్డుకున్నారు. గీత కార్మికులకు గ్రామంలోని మిగతా బీసీ కులస్తులు అండగా నిలిచారు.దీంతో గీత కార్మికులతోపాటు వారికి అండగా నిలిచినవాళ్లతో అగ్ర కులస్తులు మాట్లాడటం మానేశారు. మూడేండ్ల నుంచి ఇదే మాటల్లేవ్. కులవృత్తుల సేవల కోసం మహారాష్ట్ర నుంచి కొన్ని కుటుంబాలను వలస తెచ్చుకున్నారు.
ఎస్సారెస్పీ మట్టి అమ్మకాల వేలంలోనూ..!
ఎస్సారెస్పీ ప్రాజెక్టులోని మట్టిని పొలాల్లోకి రైతులు ఫ్రీగా తీసుకోవడానికి ఆఫీసర్లు పర్మిషన్ ఇచ్చారు. వర్షాకాలం వచ్చేలోపు ఎంత మట్టి తోడితే జలాశయంలో అంత లెవెల్ వాటర్ స్టోరేజీ కెపాసిటీ పెరుగుతుంది. అయితే 20 రోజుల కింద షురువైన మట్టి తవ్వకాలను వీడీసీలు ఓపెన్ యాక్షన్‌తో ఆమోదించాయి. డొంకేశ్వర్‌లో రూ.4.40 లక్షలు, అన్నారం విలేజ్‌లో రూ.6.35 లక్షలు, సిర్పూర్లో రూ.8.35 లక్షల వేలం పాటతో ఓకే చేశారు. ఓపెన్ యాక్షన్ దక్కించుకున్న వ్యక్తులు టిప్పర్ మట్టిని రూ.5 వేల నుంచి 10 దాకా అమ్మి దందా చేస్తున్నారు.
పోలీసులు హెచ్చరించినా మారుతలే
నిర్మల్ జిల్లాలో రెచ్చిపోతున్న వీడీసీలను కొద్ది రోజుల కింద జిల్లా ఉన్నతాధికారులు హెచ్చరించారు. ఆధిపత్యాన్ని సహించేది లేదని చెప్పారు. అయినా.. వీడీసీల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల మామడ, నర్సాపూర్, దిలావర్ పూర్, సారంగాపూర్, సోన్ తదితర మండలాల్లో వీడీసీల తీర్పులు, తీర్మానాలు వివాదాస్పదమయ్యాయి. వారి వల్ల సామాజిక బహిష్కరణకు గురైన బాధితులు ఆందోళనలకు దిగారు.
పోలీస్ స్టేషన్లలో కూడా ఫిర్యాదులు చేశారు. నిర్మల్ పట్టణానికి ఆనుకొని కొనసాగుతున్న ఓ కల్లు డిపో వ్యవహారం కలెక్టర్ వరకు చేరింది. ఎలాంటి అనుమతులు గాని, లైసెన్స్ రెన్యువల్ గాని లేకుండా ఇక్కడ కొనసాగుతున్న కల్లు డిపో పై ఇటీవలే పలువురు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ కు ఫిర్యాదు చేశారు.
డిపో నిర్వాహకులకు ఎలాంటి అనుమతులు లేకున్నా ఇక్కడి వీడీసీ సభ్యులు డబ్బులు తీసుకొని అక్రమ దందాను ప్రోత్సహిస్తున్నారని కలెక్టర్ కు పలువురు గౌడ కులస్తులు ఫిర్యాదు అందజేశారు. ఇక, జిల్లాల్లోని పలు గ్రామాల్లోనూ ఇలాంటి రాజ్యమే నడుస్తున్నది. బెల్టు షాపులు, ఇసుక, మొరం వేలం వరకు వీడీసీల కనుసన్నల్లోనే సాగుతున్నది.
మటన్, చికెన్ .. ఆఖరికి కూల్‌డ్రింక్స్, కోడిగుడ్లు అమ్మాలన్నా వీడీసీలకు కప్పం కట్టాల్సిన పరిస్థితి. బీసీ, ఎస్సీ, ఎస్టీల కుటుంబ పంచాయితీల్లోనూ జోక్యం చేసుకుంటూ ఏకపక్షంగా వీడీసీలు తీర్పులిస్తున్నాయి. తమ మాట వినకుంటే సంఘ బహిష్కరణ చేస్తున్నాయి. వాళ్లకెవరన్నా సహకరిస్తే జరిమానాలు విధిస్తున్నాయి.
ఈ నెల 2న ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని పెండల్వాడ, సాంగ్వి గ్రామాల వీడీసీలు ఇసుక ట్రాక్టర్ల దగ్గర వసూళ్లకు పాల్పడ్డారు. దుర్బాషలాడి బెదిరించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెండు గ్రామాల వీడీసీ సభ్యులపై జైనథ్ సీఐ సాయినాథ్ కేసులు నమోదు చేశారు.
గత నెల 11న ఇదే జిల్లా బోథ్ మండలంలోని ధన్నోర గ్రామం వీడీసీపై పోలీసులు కేసు నమోదు చేశారు. బెల్టు షాపులపై పోలీసులు దాడులు నిర్వహించగా.. అందులో ప్రమేయం ఉన్న వీడీసీ సభ్యులపై చర్యలు తీసుకున్నారు. ఈ దాడుల్లో రూ. 1.34 లక్షల విలువ చేసే మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల ఇచ్చోడలోనూ వీడీసీలపై కేసులు నమోదయ్యాయి.
ఎన్నికల్లోనూ వాళ్లదే పెత్తనం!
కొన్ని గ్రామాల్లో ఎన్నికలను కూడా వీడీసీలే శాసిస్తున్నాయి. వార్డు మెంబర్స్ మొదలు సర్పంచ్ వరకు ఎవరిని ఎన్నుకోవాలన్నా.. వీడీసీల నిర్ణయంపైనే ఆధారపడి ఉంటున్నది. తాము చెప్పిన వ్యక్తికే ఓటు వేయాలని, లేకపోతే మంచిగుండదంటూ వీడీసీలు గ్రామస్తులను బెదిరిస్తున్నాయి. ఇట్ల వారి కనుసన్నల్లో విజయం సాధించిన సర్పంచ్‌లు.. వారు చెప్పినట్లే పనిచేస్తున్నారు. ప్రస్తుతం సర్పంచ్ పోస్టులు కూడా ఖాళీ కావడంతో వీడీసీలు మరింత రెచ్చిపోతున్నారు. త్వరలో లోకల్‌బాడీ ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో ఆ ఎన్నికల కోసం కూడా దందాలు మొదలు పెట్టారు. తాము చెప్పినవాళ్లనే ఎన్నుకోవాలని గ్రామాల్లో తిరుగుతున్నారు.
వీడీసీలకు వ్యతిరేకంగా జేఏసీ
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, బాల్కొండ సెగ్మెంట్లలోని 221 విలేజీల్లో వీడీసీల డామినేషన్ విపరీతంగా ఉంది. ఆర్మూర్ టౌన్ మున్సిపాలిటీగా మారాక విలేజ్డెవలప్మెంట్ కమిటీ పేరు ‘సర్వ సమాజ్ కమిటీ’గా పేరు మార్చుకుంది. వీడీసీ/సర్వసమాజ్ కమిటీల ఆగడాలతో విసిగి బేజారైన బీసీ కులాలన్నీ జేఏసీగా ఏర్పడ్డాయి. ఏప్రిల్ 29న ఆర్మూర్‌లో జేఏసీ సభ్యులు భారీ ర్యాలీ నిర్వహించి.. ఆర్డీవో రాజాగౌడ్‌కు వినతి పత్రం ఇచ్చారు. వీడీసీలను నిషేధించాలని కోరారు.
వీడీసీల చర్యలు చట్టవ్యతిరేకం
గ్రామాల్లో వీడీసీలు చేస్తున్న చర్యలు చట్ట వ్యతిరేకంగా ఉన్నాయి. చాలా గ్రామాల్లో వీడీసీల పేరుతో అక్రమంగా వసూళ్లు చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఇందులో భాగంగానే ఇటీవల కమిటీల సభ్యులపై కేసులు పెట్టినం. ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తూ గ్రామాల్లో దందాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని -ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.