జైలుకు వెళ్లిన ఉద్యోగికి ప్రతినెలా ఠంచన్‌‌‌‌గా శాలరీ

జైలుకు వెళ్లిన ఉద్యోగికి ప్రతినెలా ఠంచన్‌‌‌‌గా శాలరీ
  • కొవిడ్ వ్యాక్సిన్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీలో చేతివాటం
  • పాత డీఎంహెచ్‌‌‌‌వోపై ఎంక్వైరీ కమిటీ వేసినా.. బయటికి రాని రిపోర్ట్

వనపర్తి, వెలుగు : వనపర్తి వైద్యారోగ్య శాఖకు అవినీతి రోగం పట్టింది. డీఎంహెచ్‌‌‌‌వో ఆఫీసులో ఇద్దరు జిల్లా అధికారుల మధ్య నెలకొన్న గ్రూప్ తగాదాల కారణంగా అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ శాఖలోని నిధులు వినియోగం, ఇతర యాక్టివిటీస్‌‌‌‌ విషయంలో ఇరువురు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడంతో ప్రజా వైద్యం పక్కదారి పడుతోంది. ఇప్పటికే కొవిడ్ వ్యాక్సిన్‌‌‌‌, ఔట్‌‌‌‌ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. తాజాగా డ్యూటీ చేయని ఉద్యోగులకు జీతం ఇచ్చిన విషయం బయటికి వచ్చింది. రెండేళ్లుగా డ్యూటీకి రాని ఉద్యోగికి జీతం ఇచ్చిన ఇష్యూ కొనసాగుతుండగానే..జైలుకు వెళ్లిన ఉద్యోగికి జీతం ఇవ్వడం వివాదాస్పదంగా మారింది.

సస్పెండ్ చేయాల్సి ఉన్నా.. 
వనపర్తి డీఎంహెచ్‌‌‌‌వో ఆఫీస్‌‌‌‌లో సీనియర్ అసిస్టెంట్‌‌‌‌గా పనిచేస్తున్న ప్రవీణ్ కుమార్ మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లో 2021 జూలై 2న తాగిన మత్తులో కారుతో యాక్సిడెంట్‌‌‌‌ చేసి ఇద్దరి చావుకు కారణమయ్యాడు. ఈ ఘటనపై మహబూబ్ నగర్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్ కు తరలించారు. అనంతరం జూలై 17న ప్రవీణ్‌‌‌‌పై చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయానికి రిజిస్టర్ పోస్ట్ ద్వారా నోటీసులు పంపించారు. అప్పట్లో డీఎంహెచ్‌‌‌‌వోగా ఉన్న చందూనాయక్ దీన్ని లైట్‌‌‌‌ తీసుకున్నారు. వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి రిమాండ్‌‌‌‌కు తరలిస్తే.. అతన్ని విధుల నుంచి తొలగించాల్సి ఉంటుంది. సస్పెండ్ చేయకపోగా 60 రోజుల తర్వాత  జైలు నుంచి తిరిగి వచ్చాక తిరిగి విధుల్లో చేర్చుకున్నారు.  జైలుకు వెళ్లిన సమయంలో కనీసం లీవ్‌‌‌‌లో ఉన్నట్లు కూడా చూపకుండా యథావిధిగా జీతం ఇచ్చారు. 

గ్రూప్‌‌‌‌ పంచాయితీ
వనపర్తి జిల్లా ఆవిర్భావం తర్వాత డిప్యూటీ డీఎంహెచ్‌‌‌‌వోగా ఉన్న శ్రీనివాసులుకు డీఎంహెచ్‌‌‌‌వోగా బాధ్యతలు అప్పజెప్పారు. ఈ సమయంలో ఔట్ సోర్సింగ్ నియామకాల విషయంలో ఆరోపణలు రావడంతో ఆయన స్థానంలో గద్వాల డీఎంహెచ్‌‌‌‌వో గా పనిచేస్తున్న చందునాయక్‌‌‌‌కు అదనంగా వనపరి జిల్లా బాధ్యతలు అప్పగించారు.  శ్రీనివాసులును డీఎంహెచ్‌‌‌‌గా నారాయణపేటకు బదిలీ చేసినా ఆయన అక్కడికి వెళ్లకుండా ఇక్కడే డిప్యూటీ డీఎంహెచ్‌‌‌‌వోగా కొనసాగుతున్నారు. అయితే  చందునాయక్ జూనియర్ కావడంతో ఇద్దరికి గ్రూప్‌‌‌‌ తగాదాలు మొదలయ్యాయి.ఈ క్రమంలోనే  శ్రీనివాసులు హయాంలో సీజేరియన్ ఆపరేషన్లకు ప్రభుత్వం ఇచ్చిన నిధులను దుర్వినియోగం అయ్యాయని చందూనాయక్‌‌‌‌ విచారణ కమిటీని నియమించారు.  కానీ, కమిటీ రిపోర్ట్‌‌‌‌ను ఇప్పటి వరకు బయటపెట్టలేదు.  

చందూనాయక్‌‌‌‌పై ఆరోపణలు
వనపర్తికి ప్రస్తుతం రవిశంకర్‌‌‌‌‌‌‌‌ డీఎంహెచ్‌‌‌‌వోగా ఉన్నారు.  నాలుగు నెలల క్రితం వరకు పనిచేసిన చందూనాయక్‌‌‌‌ హయాంలోనే  డ్యూటీ చేయని సిబ్బందికి శాలరీస్ ఇచ్చిన విషయం బయటికి వచ్చింది. పాన్ గల్ పీహెచ్‌‌‌‌సీ సీనియర్ అసిస్టెంట్ అనారోగ్యంతో 21 నెలల పాటు కార్యాలయానికి రాలేదు. కానీ, లీవ్‌‌‌‌గా చూపకుండానే ఆన్‌‌‌‌డ్యూటీలో ఉన్నట్లు బిల్స్‌‌‌‌ పెట్టుకొని శాలరీ తీసుకున్నాడు. ఇందులో 50 శాతం ఇవ్వాలని డీఎంహెచ్‌‌‌‌వో ఒప్పందం చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.  దీనిపై  డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌కు చెందిన కొందరు పైఆఫీసర్లకు ఫిర్యాదు చేయడంతో విచారణ కొనసాగుతోంది. అంతేకాదు 24 ఏఎన్ఎం, 20 స్టాప్ నర్స్ ఉద్యోగాలు కూడా పైరవీలు చేసుకున్న వారికే ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. కేవలం వనపర్తి జిల్లా వారే అప్లై చేసుకోవాలని చెప్పినా.. ఉమ్మడి జిల్లా వారిని భర్తీ చేయడం ఇందుకు బలం చేకూరుస్తోంది. కొవిడ్ సమయంలోనూ స్టేట్‌‌‌‌లో ఫస్ట్ ప్లేస్ కోసం బోగస్ టెస్టులు చేయడం, వ్యాక్సిన్‌‌‌‌ వేయకున్నా వేసినట్లు ఎంట్రీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. 

అప్పట్లో నేను లేను
వనపర్తి డీఎంహెచ్ వో కార్యాలయంలో పనిచేస్తున్న ప్రవీణ్ జీతం తీసుకుంటున్నది వాస్తవమే. కాని అప్పట్లో ఏం జరిగిందో నాకు తెలియదు. ఆయనపై కేసు నమోదు అయినట్లు, రిమాండ్ కు వెళ్లినట్లు నాకు సమాచారం లేదు. వెంటనే దీనిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటం. సదరు ఉద్యోగిపై కేసు నమోదు అయితే మాత్రం సస్పెన్షన్ వేటు తప్పదు. 
- డాక్టర్ రవిశంకర్, డీఎంహెచ్ వో