అవినీతి అనేది సాధారణ నేరం కాదు : ప్రధాని మోడీ

అవినీతి అనేది సాధారణ నేరం కాదు : ప్రధాని మోడీ

దేశాభివృద్ధికి ప్రధాన శత్రువు అవినీతేనని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో జరిగిన సీబీఐ వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ... సీబీఐ పరిధి పెరిగిందని తెలిపారు. చాలా నగరాల్లో సీబీఐ ఆఫీసులు నెలకొల్పుతున్నామని స్పష్టం చేశారు. సీబీఐ.. సామాన్యులకు ఆశ, బలాన్ని పెంచిందన్నారు. సీబీఐ బ్రాండ్ గా అవతరించిందని, అందుకే నేడు చాలా కేసుల్లో న్యాయం కోసం సీబీఐ విచారణ చేయాలని ప్రజలు నిరసనలు కూడా చేస్తున్నారని గుర్తు చేశారు. 

సీబీఐ వంటి వృత్తిపరమైన, సమర్థవంతమైన సంస్థలు లేకుండా భారతదేశం ముందుకు సాగదని ప్రధాని మోడీ అన్నారు. బ్యాంకు మోసాల నుండి వన్యప్రాణులకు సంబంధించిన మోసాల వరకు సీబీఐ పని పరిధి చాలా రెట్లు పెరిగిందని చెప్పారు. సీబీఐ ప్రధాన బాధ్యత దేశాన్ని అవినీతి రహితంగా మార్చడమేనని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.

అవినీతి అనేది సాధారణ నేరం కాదని ప్రధాని మోడీ చెప్పారు. అవినీతిని కొందరు వారసత్వంగా భావిస్తున్నారని ఆరోపించారు. 2014లో తాము అవినీతిపై యుద్దం ప్రకటించామన్నారు. తమకు గత ప్రభుత్వం నుంచి వచ్చిన అవినీతి సవాల్ గా మారిందని మోడీ తెలిపారు.