- మీడియేటర్లుగా డాక్యుమెంట్ రైటర్లు
- పత్రాలు సక్రమంగా ఉన్నా కొర్రీలు
- ముడుపులు ఇస్తేనే పనులు
- ఏసీబీ సోదాలు చేసినా మారని అధికారుల తీరు
నిజామాబాద్, వెలుగు : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అవినీతి హద్దుమీరుతోంది. ప్రభుత్వం ఇచ్చే వేతనాలు బాగానే ఉన్నా అత్యాశతో లంచాలు తీసుకుంటున్నారు. డాక్యుమెంట్ రైటర్లను మీడియేటర్లుగా పెట్టుకుని చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అధికారుల అండదండలతో డాక్యుమెంట్ రైటర్లు చేస్తున్న వసూళ్ల దందా మూడు పువ్వులు.. ఆరు కాయలు అన్నట్లుగా సాగుతోంది.
. డాక్యుమెంట్లు సక్రమంగా ఉన్నా.. ఇవి లేవు.. అవి లేవు.. అంటూ కొర్రీలు పెడుతున్నారు. చేసేదేమీ లేక ముడుపులు ముట్టజెప్పితేనే రిజిస్ట్రేషన్ పనులు ముందుకు సాగుతున్నాయని అమ్మకం, కొనుగోలుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్లను శాసించే స్థాయిలో డాక్యుమెంట్ రైటర్లు ఉన్నారంటే మామూళ్లు ఏ విధంగా అందుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ నెల 15న నిజామాబాద్ అర్బన్రిజిస్ట్రేషన్ ఆఫీస్‌తోపాటు పలు ఆఫీసుల్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అయినా లంచాలు తీసుకోవడంలో అధికారుల తీరు మారకపోవడం విశేషం.
ఏసీబీ దాడుల్లో వెలుగు చూసిన నిజాలు..
సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఏసీబీ దాడులు నిర్వహించగా ఆశ్చర్యపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఉమ్మడి జిల్లాలో ముఖ్య పాత్ర పోషిస్తున్న 11 మంది డాక్యుమెంట్రైటర్లను అదుపులోకి తీసుకుని ఎంక్వైరీ చేసి అక్రమ వసూళ్ల దందాపై పలు వివరాలు రాబట్టారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని ఆఫీసుల్లో కలిపి రోజుకు సుమారు రూ.12 లక్షల లంచాలు వసూలు చేస్తున్నట్లు అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆస్తి విలువలో 7 శాతం రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకోవాల్సి ఉండగా అదనంగా దాదాపు రూ.3 వేల వరకు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఉదాహరణకు ఇంటి స్థలం రిజిస్ట్రేషన్‌కు దాని విలువ మేరకు 7 శాతం ఫీజుతోపాటు అదనంగా రూ.1500, ఇల్లు రిజిస్ట్రేషన్‌కు ఫీజుతోపాటు అదనంగా రూ.2500 వందలు తీసుకుంటున్నారు. దీనికితోడు డాక్యుమెంట్రైటర్లు ఒక్క డాక్యుమెంట్ తయారు చేస్తే రూ.2 వేలు వసూలు చేస్తున్నారు. దీంతో కొనుగోలుదారులు ఖర్చు తడిపి మోపడవుతోంది. నెల రోజుల కింద సారంగాపూర్‌లోని సర్వే నంబర్ 83లోని 22 గుంటల ప్రొహిబిషన్ ల్యాండ్ రిజిస్ట్రేషన్, నిజామాబాద్ రోటరీ క్లబ్ ఏరియాలోని 12 గుంటల కమర్షియల్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ వెనుక రైటర్ల ప్రమేయం ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. హైమదీ బజార్లో కిరాయికి ఇచ్చిన జిల్లా కాంగ్రెస్ మడిగెను మరొకరికి రిజిస్ట్రేషన్ చేసినట్లు తేలింది. ఈ కేటుగాళ్లు యథేచ్ఛగా వసూళ్ల దందా చేస్తూ అమ్మకం, కొనుగోలుదారుల నుంచి అందినకాడికి దండుకుంటున్నారు. డాక్యుమెట్ రైటర్లు, వారి అసిస్టెంట్లు రూ.లక్షన్నర విలువ చేసే ఐఫోన్లు వాడుతుండడం చూసి ఏసీబీ అధికారులు అశ్చర్యపోయారు.
ఉమ్మడి జిల్లాలో 11 రిజిస్ట్రేషన్ ఆఫీసులు...
ఉమ్మడి జిల్లాలో 11 రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఉన్నాయి. నిజామాబాద్ అర్బన్‌లో 2, నిజామాబాద్ రూరల్, బోధన్, భీంగల్, ఆర్మూర్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బిచ్కుంద, బాన్సువాడ, దోమకొండలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. నిజామాబాద్ అర్బన్, రూరల్ ఆఫీసుల్లో నిత్యం వందకుపైగా రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా, మిగతాచోట్ల సుమారు30కిపైగా రిజిస్ట్రేషన్లు అవుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ఉమ్మడి జిల్లాలో 11 రిజిస్ట్రేషన్ ఆఫీసులు...
ఉమ్మడి జిల్లాలో 11 రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఉన్నాయి. నిజామాబాద్ అర్బన్‌లో 2, నిజామాబాద్ రూరల్, బోధన్, భీంగల్, ఆర్మూర్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బిచ్కుంద, బాన్సువాడ, దోమకొండలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. నిజామాబాద్ అర్బన్, రూరల్ ఆఫీసుల్లో నిత్యం వందకుపైగా రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా, మిగతాచోట్ల సుమారు30కిపైగా రిజిస్ట్రేషన్లు అవుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
సోదాలు కొనసాగిస్తాం..
ఉమ్మడి జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో సోదాలు కొనసాగిస్తాం. దాడుల్లో సేకరించిన వివరాలపై నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందజేస్తాం. ఏ రిజిస్ట్రేషన్ ఆఫీసులోనైనా అవినీతికి పాల్పడితే ప్రజలు సమాచారం ఇవ్వాలి. వివరాలు తెలిపిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం. శేఖర్‌గౌడ్, ఏసీబీ డీఎస్పీ
