గోనె సంచుల స్కాం.. ఆరేండ్లలో రూ. 620 కోట్లు లూటీ

గోనె సంచుల స్కాం.. ఆరేండ్లలో రూ. 620 కోట్లు లూటీ
  • దళారులతో ఆఫీసర్ల కుమ్మక్కు!
  • సొంత సంచులనే ఎక్కువ ధరకు కొంటున్న సంస్థ
  • అక్రమాల గురించి తెలిసినా మౌనంగా ఆఫీసర్లు
  • జిల్లా నుంచి హెడ్డాఫీసు వరకు వాటాలు!

హైదరాబాద్, వెలుగుసివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో గోనె సంచుల కొనుగోలు పేరుతో పెద్దఎత్తున అవినీతి జరుగుతోంది. ఒకటీ రెండు కాదు.. ఆరేండ్లలో రూ.620 కోట్ల కుంభకోణం జరిగింది. ఆఫీసర్లు, దళారులు కుమ్మక్కై కార్పొరేషన్ ఖజానాను కొల్లగొట్టారు. ఇంకా కొల్లగొడుతున్నారు. ఈ అవినీతి దందాలో జిల్లా ఆఫీసర్ల నుంచి హెడ్డాఫీసులో ఉండే పెద్ద సార్ల వరకు ప్రమేయం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దళారులు కొల్లగొట్టిన సొమ్ములో ఆఫీసర్ల హోదాను బట్టి వాటాలు పంచుతున్నారని, దీంతో ఆఫీసర్లు మౌనంగా ఉంటున్నారని, అందుకే అవినీతి బయటికి పొక్కలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ధాన్యం సేకరణ కోసం గోనె సంచుల కొరత ఉందని సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చెప్పిన వెంటనే ప్రభుత్వం కొనుగోలుకు అనుమతి ఇస్తోంది. దీంతో ఈ వ్యవహారం నిరాటంకంగా కొనసాగుతోంది.

అవినీతి జరుగుతోందిలా..

జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి సివిల్ సప్లైస్ సంస్థ ఒక్కో బ్యాగుకు రూ.53 చెల్లించి కొంటుంది. వీటిని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు పంపుతుంది. అటునుంచి మిల్లర్లకు, తర్వాత రేషన్ డీలర్లకు ధాన్యం ఆ గోనె సంచుల్లోనే వెళ్తుంది. ఆ సంచులను  మిల్లర్లు, డీలర్లు.. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కు తిరిగి ఇస్తే ఒక్కో బ్యాగుకు రూ.18 సంస్థ చెల్లిస్తుంది. అయితే మిల్లింగ్ పూర్తయ్యాక రైస్ మిల్లర్లు, బియ్యం పంపిణీ తర్వాత రేషన్ డీలర్లు సివిల్ సప్లైస్ సంస్థ సరఫరా చేసిన సంచులను వెనక్కి ఇవ్వడం లేదు. దళారులు ఒక్కో బ్యాగుకు రూ.4 నుంచి 5 అదనంగా ఇస్తుండటంతో వాళ్లకే అమ్ముతున్నారు. దళారులు అవే బ్యాగులను సివిల్ సప్లైస్‌కు పిలిచే టెండర్లలో రూ.27కు విక్రయిస్తున్నారు. అంటే ర.18కి కొనాల్సిన బ్యాగును దళారుల వద్ద రూ.26 నుంచి 27కు కార్పొరేషన్‌ కొంటోంది.

2014-15 నుంచి మొదలు

ప్రతి సీజన్ లో ధాన్యం సేకరించేందుకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సుమారు 17 కోట్ల నుంచి 18 కోట్ల గోనె సంచుల అవసరం ఉంటుంది. అన్ని కొత్త బ్యాగులను కొనడం వల్ల ఆర్థికంగా భారం అవుతోందన్న కారణంతో ప్రతి సీజన్ లో 46% బ్యాగులు పాతవి వాడుకోవచ్చని ఎఫ్ సీఐ వెసులుబాటు ఇచ్చింది. ఈ వెసులుబాటును అఫీసర్లు, దళారులు అనుకూలంగా మల్చుకుంటున్నారు. తమ వద్దకు వచ్చిన సంచులను రైస్ మీల్లర్లు, రేషన్ డీలర్లు.. సంస్థకు ఇవ్వకుండా దళారులకు అమ్ముకుంటున్నారు. ఇలా ఏటా సంస్థ ఖజానాకు రూ.100 కోట్లకు పైగా గండి పడుతోందని ఓ సీనియర్ ఆఫీసర్ చెప్పారు. 2014–15లో రూ.110 కోట్లు, 2015–16లో 121 కోట్లు, 2016–17లో 125 కోట్లు, 2017–18లో 132 కోట్లు, 2019–20లో 132 కోట్ల నష్టం వాటిల్లినట్టు తెలిసింది. ఆరేండ్లలో గోనె సంచుల కొనుగోళ్ల అక్రమాల వల్ల సివిల్ సప్లైస్ సంస్థకు రూ.620 కోట్లు నష్టం వచ్చినట్లు సమాచారం.

పట్టించుకుంటలే

నిజానికి రైస్ డీలర్లు, మిల్లర్లు గోనె సంచులను తిరిగి పౌర సరఫరాల సంస్థకు వెనక్కి కచ్చితంగా ఇవ్వాలి. కాని సంస్థ పెట్టిన కండీషన్ ఎక్కడా అమలు కావడం లేదు. ఈ ప్రక్రియ సక్రమంగా జరిగేందుకు సంస్థలోని ఆఫీసర్లు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. కాని ఆఫీసర్లు దళారులతో చేతులు కలపడంతో సంచులు  దళారుల చేతిల్లోకి దర్జాగా చేరుతున్నాయి.

అవినీతిలో అందరికీ వాటాలు

గన్నీ సంచుల అమ్మకాల్లో వచ్చిన అవినీతి సొమ్మును దళారులు.. సివిల్ సప్లైస్ సంస్థలోని జిల్లా ఆఫీసర్ల నుంచి హైదరాబాద్ లో ఉండే హెడ్ ఆఫీసర్ల వరకు వాటాలు ప్రతి సీజన్ లో పంచుతుంటారని తెలిసింది. హోదాను బట్టి మామూళ్లు ముట్టజెబుతుంటారని సమాచారం. దీంతో బ్యాగుల కొనుగోళ్ల అక్రమాల గురించి అందరికి తెలిసినా ఎవరూ పట్టించుకోవడంలేదు.