IPL 2026: కేకేఆర్‏లోకి రోహిత్ శర్మ..? ఒక్క ట్వీట్‎తో పుకార్లకు చెక్ పెట్టిన ముంబై

IPL 2026: కేకేఆర్‏లోకి రోహిత్ శర్మ..? ఒక్క ట్వీట్‎తో పుకార్లకు చెక్ పెట్టిన ముంబై

ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఎంఐను వీడనున్నట్లు మరోసారి ప్రచారం జరుగుతుంది. వచ్చే సీజన్‎లో హిట్ మ్యాన్ కోల్‎కతా నుంచి బరిలోకి దిగుతాడని ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీనికి ప్రధాన కారణం అభిషేక్ నాయర్ కోల్‎కతా హెడ్ కోచ్‎గా ఎంపిక కావడమే. అభిషేక్ నాయర్ రోహిత్ శర్మకు సన్నిహితుడు. దీంతో అభిషేక్ రోహిత్‎ను కేకేఆర్‎కు తీసుకెళ్తారని ప్రచారం మొదలైంది.

మరోవైపు కెప్టెన్సీ నుంచి తొలగించారని రోహిత్ కూడా ముంబై ఫ్రాంచైజ్‎పై ఆగ్రహంగా ఉన్నాడని.. ఎంఐను వీడి వేరే ప్రాంచైజ్‎కు వెళ్లాలని హిట్ మ్యాన్ ఆలోచన చేస్తున్నట్లు స్పోర్ట్స్ సర్కిల్స్‎లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో రోహిత్ ముంబైను వీడుతున్నట్లు వస్తోన్న వార్తలపై ఎంఐ యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేసింది.

‘‘సూర్యుడు ఎల్లప్పుడూ మరుసటి రోజు ఉదయిస్తాడు. కానీ నైట్‌లో కాదు’’ అంటూ పరోక్షంగా రోహిత్ శర్మ కోల్‎కతా నైట్ రైడర్స్‎కు వెళ్లడం లేదని ముంబై క్లారిటీ ఇచ్చింది. ముష్కిల్ నహి నముమ్కిన్ హై అంటూ కేకేఆర్ సహ యజమాని షారుఖ్ ఖాన్ ఫేమస్ డైలాగ్‎ను జోడిస్తూ.. రోహిత్ శర్మ ముంబైని విడిచి ఎక్కడికి వెళ్లడం లేదంటూ హిట్ మ్యాన్ ప్రాంచైజ్ మార్పు వార్తలకు చెక్ పెట్టింది. దీంతో ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‎లో నెలకొన్న గందరగోళానికి తెరపడింది. 

ముంబైతో రోహిత్ బంధం:

2011 నుంచి రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ తరుఫున ఆడుతున్నాడు. 2013లో ముంబై కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన హిట్ మ్యాన్ ఎంఐను ఐదుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిపాడు. తద్వారా ఎంఎస్ ధోనితో పాటు ఐదు ఐపీఎల్ ట్రోఫీలు సాధించిన సక్సెస్ ఫుల్ కెప్టెన్‎గా హిట్ మ్యాన్ రికార్డ్ నెలకొల్పాడు. అయితే.. 2024లో రోహిత్ ను కెప్టెన్ గా తొలగించిన ఎంఐ ప్రాంఛైజ్ టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించింది. 

దీంతో రోహిత్ కు, ఎంఐ యాజమాన్యానికి విభేదాలు వచ్చాయని.. హిట్ మ్యాన్ ముంబైను వీడుతాడని ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమి జరగలేదు. రోహిత్ ముంబై తరుఫునే ఆడుతున్నాడు. 2025 సీజన్ కోసం రూ.16.30 కోట్లకు రోహిత్‌ను రిటెన్షన్‌ చేసుకుంది ముంబై. ఐపీఎల్ 2025లో ముంబై ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. కానీ క్వాలిఫైయర్ 2లో పంజాబ్ కింగ్స్ చేతిలో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.