Yuvraj Singh: మా అమ్మ, నాన్నను నేనే విడిపోవాలనే సలహా ఇచ్చాను: యువరాజ్ సింగ్

Yuvraj Singh: మా అమ్మ, నాన్నను నేనే విడిపోవాలనే సలహా ఇచ్చాను: యువరాజ్ సింగ్

భారతీయ క్రికెట్‌ చరిత్రలో యువరాజ్ సింగ్(Yuvraj Singh) ఓ సంచలనం. ఆయన జీవితం ఓ పోరాటం.ఒకే ఒక్క ఓవర్‌లో ఆరు సిక్స్‌లు కొట్టి ప్రత్యర్థులకు చుక్కలు చూపించిన క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌.13 ఏళ్ల వయసులోనే పంజాబ్ అండర్ 16 క్రికెట్ జట్టకు ఆడిన యువరాజ్ సింగ్ ఇప్పటికీ ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. వరల్డ్‌కప్ అనంతరం ప్రాణాంతక క్యాన్సర్‌ బారిన పడిన యువీ..అమెరికాలో చికిత్స తీసుకుని బయటపడ్డాడు. తనదైన శక్తిని కూడగట్టుకుని క్యాన్సర్‌తో పోరాడి ఆయన ఎంతోమందిలో మనోధైర్యాన్ని నింపారు. తన జీవితంలో జరిగిన బాధాకర సంఘటనను యువరాజ్ తాజాగా షేర్ చేసుకున్నాడు.  

తన తండ్రి యోగరాజ్ సింగ్, తల్లి షబ్నమ్ సింగ్‌లకు విడాకుల ఆలోచనను సూచించింది తానేనని ఒక ఇంటర్వ్యూలో యువరాజ్ సింగ్ స్వయంగా తెలిపాడు. యువరాజ్ సింగ్ మాట్లాడుతూ.. "నా తల్లి నన్ను పెంచడానికి చేసిన త్యాగాలు ఒక తల్లి మాత్రమే చేయగలదని నేను భావిస్తున్నాను. అలాంటి తల్లిని కలిగి ఉన్నందుకు నేను చాలా కృతజ్ఞుడిని. నాకు 14 లేదా 15 సంవత్సరాల వయసున్నప్పుడు, మా ఇంటిలో అమ్మ, నాన్న తరచూ గొడవపడుతూ ఉండేవారు. ఇంటి వాతావరణంలో జీవించడం చాల కష్టంగా మారింది. నేను క్రికెట్ ఆడుతున్నప్పుడు వారి తగాదాలు నన్ను ఇబ్బందిపెట్టాయి. ఆ సమయంలో నేను వారిద్దరినీ విడిపోవాలనే ఐడియా ఇచ్చాను. ఏదేమైనా వారిద్దరూ చివరికి విడిపోవాలనే నిర్ణయానికి వచ్చారు:" అని యువరాజ్ తెలిపాడు.   

యువరాజ్ 17 సంవత్సరాల వయసు నుంచి తన తల్లి షబ్నమ్ సింగ్‌ వద్దనే పెరిగాడు. అయితే తన తండ్రి యోగరాజ్ తిరిగి వివాహం చేసుకున్నాడు. అతనికి ఇద్దరు పిల్లలు పుట్టారు. యువరాజ్ సింగ్ 2016లో నటి హాజెల్ కీచ్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వారికి ఇప్పుడు మూడేళ్ల కుమారుడు ఓరియన్, రెండేళ్ల కుమార్తె ఆరా ఉన్నారు. 19 ఏళ్ల పాటు భారత క్రికెట్‌కు సేవలందించిన యువీ..40 టెస్ట్, 304 వన్డే, 58 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 2012లో చివరిగా టెస్టు మ్యాచ్‌ ఆడిన యువరాజ్..2017లో ఆఖరి వన్డే, టీ20 ఆడాడు. 2011 వరల్డ్‌కప్ భారత్ గెలవడంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఆల్ రౌండ్ ప్రదర్శనతో భారతీయుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి పోయాడు.