బీఆర్‎ఎస్‎కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లే.. ఆ రెండు పార్టీల మధ్య రహస్య ఒప్పందం: మంత్రి వివేక్

బీఆర్‎ఎస్‎కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లే.. ఆ రెండు పార్టీల మధ్య రహస్య ఒప్పందం: మంత్రి వివేక్

హైదరాబాద్: బీఆర్‎ఎస్‎కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనని.. ఈ మేరకు ఆ రెండు పార్టీల మధ్య చీకటి ఒప్పందం ఉందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఈ ఒప్పందంలో భాగంగానే బీజేపీ తెలంగాణలో 8 ఎంపీలు స్థానాలు గెలిచిందన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలంగా ఉన్న దగ్గర బీఆర్ఎస్ కనీసం అభ్యర్థిని కూడా నిలబెట్టలేదని అన్నారు. ఇప్పుడేమో బీఆర్ఎస్ గెలుపు కోసం జూబ్లీహిల్స్‎లో బీజేపీ బలహీనమైన అభ్యర్థిని పోటీకి దించిందన్నారు.

ఇది ఆ రెండు పార్టీల మధ్య రహస్య ఒప్పందమని ఆరోపించారు. ముస్లిం సమాజం మాకు మద్దతు తెలిపి జూబ్లీహిల్స్‎లో గెలిపించారని రాహుల్ గాంధీకి చెప్పే అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా గురువారం (అక్టోబర్ 30) షేక్‎పేట్ డివిజన్‎లోని సబ్ జా కాలనీ, టోలిచౌకిలో ముస్లిం మైనారిటీ నాయకులతో మంత్రి వివేక్ వెంకటస్వామి, పరిగి ఎమ్యెల్యే రామ్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ.. షేక్ పేట్ డివిజన్‎లో డ్రైనేజీ పైప్ లైన్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. జూబ్లీహిల్స్‎లో బీఆర్ఎస్ పదేళ్లలో ఏమి అభివృద్ధి చేయలేదని.. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు అన్నీ కాంగ్రెస్ హయాంలోనే జరుగుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ముస్లిం లీడర్లు ఉన్నత స్థాయిలో ఉంటారన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‎ను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞ్తప్తి చేశారు.