Women's ODI World Cup 2025: జెమీమా వీరోచిత సెంచరీ: సెమీస్‌లో టీమిండియా అద్భుతం..ఆస్ట్రేలియాపై థ్రిల్లింగ్ విక్టరీతో ఫైనల్‌కు

Women's ODI World Cup 2025: జెమీమా వీరోచిత సెంచరీ: సెమీస్‌లో టీమిండియా అద్భుతం..ఆస్ట్రేలియాపై థ్రిల్లింగ్  విక్టరీతో ఫైనల్‌కు

మహిళల వరల్డ్ కప్ లో టీమిండియా అద్భుతం చేసింది. ఆస్ట్రేలియా విధించిన 339 పరుగుల అసాధారణ లక్ష్యాన్ని ఛేజ్ చేసి ఫైనల్ కు దూసుకెళ్లింది. గురువారం (అక్టోబర్ 30) నవీ ముంబై వేదికగా డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో ముగిసిన మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. జెమీమా రోడ్రిగ్స్ (127) వీరోచిత సెంచరీతో చివరి వరకు క్రీజ్ లో ఉండి టీమిండియాకు విజయాన్ని అందించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 89 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 48.3 ఓవర్లలో  338 పరుగులకు ఆలౌటైంది. లక్ష్య ఛేదనలో ఇండియా 48.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 341 పరుగులు చేసి గెలిచింది.

339 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియాకు మంచి ఆరంభం లభించలేదు. సంవత్సరం తర్వాత జట్టులోల్కి వచ్చిన షెఫాలీ 10 పరుగులు మాత్రమే చేసి ఔటైంది. ఈ దశలో ఇండియాను ఆదుకునే బాధ్యత స్మృతి మందాన, రోడ్రిగ్స్ తీసుకున్నారు. వీరిద్దరూ పవర్ ప్లే లో ఆధిపత్యం చూపిస్తూ రెండో వికెట్ కు 46 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 24 పరుగులు చేసి మంచి టచ్ లో కనిపించిన మందాన ఔట్ కావడంతో టీమిండియా 59 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. అయితే ఇక్కడ నుంచే అసలైన ఆట మొదలయింది. జెమీమా, హర్మన్ ప్రీత్ కౌర్ కలిసి ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించారు. 

మొదట ఆచితూచి ఆడిన వీరిద్దరూ ఆ తర్వాత క్రమంగా జోరు పెంచారు. అలవోకగా బౌండరీలు కొడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో వీరిద్దరూ తమ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. కౌర్ భారీ షాట్ కు ప్రయత్నించి సెంచరీ మిస్ అయినా.. జెమీమా సెంచరీ పూర్తి చేసుకుంది. దీప్తి శర్మ ఉన్నంత సేపు వేగంగా ఆడి 17 బంతుల్లోనే 24 పరుగులు చేసి రనౌటయింది. ఆ తర్వాత రిచా ఘోష్ 16 బంతుల్లో 26 పరుగులు చేసి జట్టుపై ఒత్తిడి మొత్తాన్ని తగ్గించింది. ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్ లో జెమీమా చివరి వరకు క్రీజ్ లో ఉండి ఇండియాకు చిరస్మరనీయ విజయాన్ని అందించింది.