Dulquer Salmaan: 'కాంత'లో 'ది రేజ్ ఆఫ్ కాంత' సాంగ్ రిలీజ్.. ఫ్యాన్స్‌లో అంచనాలు పీక్స్!

Dulquer Salmaan: 'కాంత'లో 'ది రేజ్ ఆఫ్ కాంత' సాంగ్ రిలీజ్.. ఫ్యాన్స్‌లో అంచనాలు పీక్స్!

'సీతారామం', 'లక్కీ భాస్కర్' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళం స్టార్ దుల్కర్ సల్మాన్. ఆయన నటిస్తున్న లేటెస్ట్  పీరియడికల్ యాక్షన్ చిత్రం 'కాంత' (Kaantha).  ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, నటుడు సముద్రఖని ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. లేటెస్ట్ గా ఈ చిత్రానికి సంబంధించిన మూడో సాంగ్ రిలీజ్ చేశారు.

 'ది రేజ్ ఆఫ్ కాంత' సాంగ్ హల్‌చల్!

 'కాంత'  మూవీ నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న సందర్భంగా, చిత్రబృందం ప్రమోషన్స్‌ను ముమ్మరం చేసింది. ఇప్పటికే రెండు పాటలు విడుదల చేయగా.. లేటెస్ట్ గా రిలీజైన 'ది రేజ్ ఆఫ్ కాంత'  సాంగ్ దుల్కర్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. సిద్ధార్థ్ బస్రూర్ ఆలపించిన ఈ పాటలో ఇంగ్లీష్, తమిళం, తెలుగు ర్యాప్ లిరిక్స్ ఉండడం.. తెలుగు ప్రేక్షకులను సైతం విశేషంగా ఆకట్టుకుంటోంది. జాను చంథర్ అందించిన సంగీతం, డ్రమ్ బీట్స్, ప్రాచీన సంగీత వాద్యాల సమ్మేళనం దుల్కర్ తీవ్రమైన పాత్రకు తగినట్టుగా ఉందంటూ అభిమానులు ప్రశంసిస్తున్నారు.

ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌గా.. 

దర్శకుడు సెల్వరాజ్ సెల్వమణి తెరకెక్కిస్తున్న ఈ సినిమా కథా నేపథ్యం అత్యంత ఆసక్తికరంగా ఉంది. ఈ చిత్రం 1950ల నాటి మద్రాస్ సినీ పరిశ్రమ చుట్టూ తిరుగుతుంది. ఆనాడు జరిగిన కొన్ని ఉత్కంఠభరిత సంఘటనల ఆధారంగా ఈ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌ను రూపొందించారని సమాచారం. 1940లలో మద్రాస్‌లో జరిగిన ఒక హత్య కేసులో భాగవతార్ ఇరుక్కున్న అంశాలు ఈ కథలో కీలకమవుతాయని టాక్. దుల్కర్ పాత్ర ఆనాటి ప్రముఖ నటుడు ఎం.కె. త్యాగరాజ భాగవతార్ జీవితం నుంచి ప్రేరణ పొందిందని కూడా తెలుస్తోంది.

 రానా, దుల్కర్ సంయుక్తంగా..

సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలతో రూపొందిన ఈ చిత్రానికి 'మహానటి' ఫేమ్ డాని సాంచెజ్ లోపెజ్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, త. రామలింగం ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, ఈ సినిమాకు దుల్కర్ సల్మాన్ తన సొంత బ్యానర్ వేఫేరర్ ఫిల్మ్స్ తో పాటు, రానా దగ్గుబాటి (Spirit Media), ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ సంయుక్తంగా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇద్దరు పాన్-ఇండియా స్టార్స్ కలిసి నిర్మిస్తున్న ఈ 'కాంత' సినిమా నవంబర్‌లో థియేటర్లలో ఏ స్థాయిలో సంచలనం సృష్టిస్తుందో చూడాలి.