దొరికిన కాడికి దోపిడీ.. వనపర్తి మున్సిపాలిటీలో అవినీతి తారాస్థాయికి

దొరికిన కాడికి దోపిడీ..  వనపర్తి మున్సిపాలిటీలో అవినీతి తారాస్థాయికి
  •     ఆఫీస్​ వాస్తు మార్చేందుకు రూ.50 లక్షల బిల్లు పెట్టడంపై  కౌన్సిలర్ల అభ్యంతరం
  •     అభివృద్ది పనులపై పర్యవేక్షణ కరువు

వనపర్తి, వెలుగు :  వనపర్తి మున్సిపాలిటీలో అవినీతి తారాస్థాయికి  చేరుతోంది. అందినకాడికి దోచుకునేందుకు మున్సిపల్  చైర్మన్  గట్టు యాదవ్  తెగబడ్డాడని సొంత పార్టీ కౌన్సిలర్లే ఆరోపిస్తున్నారు. కొత్త ఆఫీస్ లో వాస్తు దోషం నివారణ కోసం రూ.50 లక్షలు ఖర్చవుతుందని ఇటీవల జరిగిన మున్సిపల్  మీటింగ్​లో ప్రతిపాదించగా, పాలక, ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి.

జిరాక్స్ బిల్లులు చెల్లించేందుకు ఎలాంటి కొటేషన్లు లేకుండానే కౌన్సిలర్లు,  అధికారులు కలిసి శ్రీ వినాయక ఇంటర్ నెట్  అండ్  జిరాక్స్  సెంటర్ కు ప్రతి ఏటా రూ.లక్షలు చెల్లించడం ఆనుమానాలకు తావిస్తోంది. ఓనర్​ నుంచి పర్సంటేజీలు తీసుకుంటూ బోగస్  లెక్కలు చూపిస్తున్న విషయం బయటపడింది. ఈ లెక్కలపై కౌన్సిలర్లు  అభ్యంతరం చెప్పినా బిల్లులు చెల్లించడం గమనార్హం. 

అధికారుల పర్యవేక్షణ కరువు..

మున్సిపాలిటీ పరిధిలోని పనులను వార్డు కౌన్సిలర్లు పగలు, రాత్రి తేడా లేకుండా చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇటీవల పట్టణంలోని గణేశ్​ వాటర్ ప్లాంట్  సమీపంలో సీసీ రోడ్ల నిర్మాణం ఆదివారం అర్ధరాత్రి దాకా జరిగాయి. అధికారులు, సిబ్బంది పర్యవేక్షణ లేకుండా పనులు పూర్తి చేసినా పట్టించుకునేవారు లేకుండా పోయారు. పట్టణంలోని వెంచర్లలో మున్సిపాలిటికీ వదిలిన 10 శాతం స్థలాన్ని కొందరు కబ్జా చేసి అమ్ముకుంటున్నారు. 

నిలదీస్తున్న సొంత పార్టీ కౌన్సిలర్లు..

మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు పెట్టుకుని ఇలా వ్యవహరించడంతో బీఆర్ఎస్  పార్టీలోని కొందరు కౌన్సిలర్లు చైర్మన్ ను నేరుగానే నిలదీస్తున్నారు. మున్సిపాలిటీలో అవినీతి, ఆరోపణలు మంత్రి నిరంజన్ రెడ్డి కి తలనొప్పి గా మారుతోంది. పార్టీలోని కౌన్సిలర్లు రెండు వర్గాలుగా చీలిపోవడం, ఆధిపత్యం కోసం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం పార్టీకి నష్టం చేస్తాయని సీనియర్లు అంటున్నారు. గతంలో ఎస్సీ, ఎస్టీ సబ్  ప్లాన్  నిధులను ఓ రియల్  ఎస్టేట్  వెంచర్  దారి కోసం వాడారనే ఆరోపణలతో గందరగోళం ఏర్పడింది.

పట్టణం బయట సబ్ రిజిస్ట్రార్  ఆఫీస్​ ఏర్పాటు చేసేందుకు ఓ రియల్ సంస్థతో కొందరు కౌన్సిలర్లు కుమ్మక్కై మంత్రిని తప్పుదారి పట్టించారనే టాక్​ ఉంది. చైర్మన్  ఏకపక్ష ధోరణిని నిరసిస్తూ గతంలో సొంత పార్టీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెడతామని హెచ్చరించారు. అప్పట్లో ఆ గొడవ సద్దుమణిగినా, పరిస్థితి ఏమాత్రం మారలేదని ఇటీవల జరిగిన మున్సిపల్  మీటింగ్​లో స్పష్టమైంది.

ఇక పట్టణంలో రోడ్ల విస్తరణ, డ్రైన్లు, సీసీ రోడ్లు, మిషన్  భగీరథ ద్వారా తాగునీటి సప్లై చేయడంలో విఫలమయ్యారనే విమర్శలున్నాయి. జనరల్  ఫండ్ ను పట్టణ ప్రజలకు సౌలతులు కల్పించేందుకు వాడకుండా దారి మళ్లిస్తున్నారని కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు.

విలీన ప్రాంతాలను పట్టించుకుంటలే..

పట్టణ శివారులోని నర్సింగాయపల్లి, వస్య తండా, అగ్రహారం, శ్రీనివాసపురం, శ్రీనివాసపురం తండా, మర్రికుంట, నాగవరం, నాగవరం తండా, రాజనగరం, వడ్డెగేరి ప్రాంతాలను వనపర్తి మున్సిపాలిటీలో విలీనం చేశారు. విలీన గ్రామాలకు ప్రత్యేక నిధులు కేటాయించి సౌలతులు కల్పించాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదని ఆయా వార్డుల కౌన్సిలర్లు జనరల్ బాడీ మీటింగ్ లో అధికారులను నిలదీశారు. తమ వార్డుల్లో ట్యాక్స్ లు మాత్రమే పెంచారని, ఎలాంటి సౌలతులు కల్పించలేదని అంటున్నారు. 

అన్నీ సమస్యలే..

మిషన్  భగీరథ పథకం ద్వారా మంచినీళ్లు రావడం లేదని పట్టణంలోని పలు కాలనీల మహిళలు వాపోతున్నారు. గతంలో మాదిరిగానే రామన్ పాడ్  పథకం నుంచి వస్తున్న నీళ్లు రంగు మారడంతో వ్యాధుల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్ల విస్తరణ పనులు ఇంకా 30 శాతం పెండింగ్ లో ఉన్నాయి. దీంతో దుమ్ముతో పట్టణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.  

ఆరోపణల్లో నిజం లేదు..

వనపర్తి మున్సిపాలిటీలో అవినీతికి తావు లేకుండా పనులు చేస్తున్నాం. కొత్త మున్సిపల్  ఆఫీసులో రూ.50 లక్షలతో పనులు చేపట్టాం. దీనిని కొందరు కావాలని రాద్ధాంతం చేస్తున్నారు. 40 ఏండ్లుగా ఎవరూ చేయనంత డెవలప్​ చేశాం. ఓర్వలేకనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.

– గట్టు యాదవ్, మున్సిపల్  చైర్మన్, వనపర్తి