అవినీతి, దోపిడీ, నిరుద్యోగమే..కర్నాటకలో రియల్ టెర్రరిజం

అవినీతి, దోపిడీ, నిరుద్యోగమే..కర్నాటకలో రియల్ టెర్రరిజం
  • అవినీతి, దోపిడీ, నిరుద్యోగమే..కర్నాటకలో రియల్ టెర్రరిజం
  • బీజేపీ పాలనపై ప్రియాంకా గాంధీ ఫైర్


మంగళూరు:  అవినీతి, దోపిడీ, ధరల పెరుగుదల, నిరుద్యోగం అనేవి కర్నాటకలో రియల్ ‘టెర్రరిజం’ అని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ విమర్శించారు. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు పరిష్కరించడంలో బీజేపీ విఫలమైందన్నారు. దక్షిణ కన్నడ జిల్లా మూడ్​బిద్రిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రియాంక గాంధీ మాట్లాడారు. ‘‘ఎన్నికలు వచ్చాయంటే మోడీతో సహా బీజేపీ లీడర్లంతా నేషనల్ సెక్యూరిటీ, టెర్రరిజం గురించి మాట్లాడుతారు. కర్నాటకలో ప్రచారం కోసం వచ్చి ఇక్కడి ప్రజల గురించి అస్సలు మాట్లాడరు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, 40శాతం కమీషన్ అనేవే బీజేపీ గవర్నమెంట్​లోని అసలైన టెర్రరిజం. మూడేండ్ల పాలనలో ఏం అభివృద్ధి చేసిందో చూసి ఓటేయాలి” అని ఓటర్లను  ప్రియాంక గాంధీ కోరారు.

రైతు ఆత్మహత్యలు పట్టవు


దేశం, ధర్మం, భద్రత, టెర్రరిజం మాత్రమే బీజేపీకి అవసరమని, వేలాదిమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పట్టదని ప్రియాంక విమర్శించారు. వెయ్యి మందికి పైగా నిరుద్యోగులు సూసైడ్​ చేసుకున్నారని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం రూ.6లక్షల కోట్లు దోచుకుందని ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత రాష్ట్రంలో చాలా పరిశ్రమలు మూత పడ్డాయని గుర్తు చేశారు. జీఎస్​టీ కారణంగా చాలా కంపెనీలు ఆర్థికంగా నష్టపోయాయన్నారు. వేలాది మంది యువకులు ఉద్యోగాల్లేక రోడ్డునపడ్డారని విమర్శించారు.


డెయిరీ వ్యవస్థను నాశనం చేసే కుట్ర

దేశంలోని ఎన్నో పోర్టులు, ఎయిర్ పోర్టులను బడా బడా వ్యాపారులకు అమ్మేశారని మోడీపై ప్రియాంక మండిపడ్డారు. న్యూ మంగళూరు పోర్టును కూడా అమ్మేశారని అన్నారు. ఆ వ్యాపా రులంతా బీజేపీకి దోస్తులని విమర్శించారు. లోకల్​గా ఉన్నవాళ్లకు ఉద్యోగాలు దక్కకుండా చేశారన్నారు. ఇప్పుడు డెయిరీ వ్యవస్థపై బీజేపీ కన్నుపడిందని విమర్శించారు. కర్నాటక మిల్క్​ ఫెడరేషన్​కు చెందిన నందిని మిల్క్ బ్రాండ్​తో అమూల్​ను మెర్జ్​ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే మేనిఫెస్టోలోని హామీలన్నీ అమలు చేస్తామన్నారు.