విద్యుత్ సరఫరాపై శ్వేతపత్రం విడుదల చేయాలి

విద్యుత్ సరఫరాపై శ్వేతపత్రం విడుదల చేయాలి
  • మండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

కేంద్రం ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేక విధానాలు తీసుకుంటోందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మండలిలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ విద్యుత్ సరఫరాపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత జనవరి నుండి వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం  ఎంత విద్యుత్ ఇస్తుందో శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. ఓవర్ లోడ్ సమస్యలతో ట్రాన్స్ ఫార్మర్ లు దెబ్బతింటున్నాయని.. మీరు ఎన్ని గంటలు వీలైతే అన్ని గంటలు నాణ్యమైన కరెంటు ఇవ్వండి చాు.. కనీసం 9 గంటల కరెంటు అయినా మంచిగా ఇవ్వండి అన్నారు. జగిత్యాల జిల్లాలో తరచూ ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోతున్నాయని.. ఇటీవల 20 ట్రాన్స్ ఫార్మర్ లు కాలిపోయాయని సభలో ప్రస్తావించారు. 
రాష్ట్రంలో ఉచిత విద్యుత్ కు 24 గంటల కరెంట్ ఇవ్వడం సాధ్యం కావడం లేదన్నారు. అలాగే మోటార్లకు మీటర్లు పెట్టే ఆలోచనను కాంగ్రెస్ పార్టీ తరపున వ్యతిరేకిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న  లైన్ మెన్, జూనియర్ లైన్ మెన్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. 

జీవన్ రెడ్డి గారూ ఏపీ ప్రభుత్వంలో ఉన్నామనుకుంటున్నారా..?

విద్యుత్ సమస్యలను కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రస్తావించడంపై అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పందించారు. రాష్ట్రంలో అసలు విద్యుత్ ఓవర్ లోడ్ సమస్యే లేదు.. జీవన్ రెడ్డి గారు ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది అనుకొనే ఆలోచనలో  ఉన్నట్లు ఉన్నారని ఛలోక్తి విసిరారు. రాష్ట్రం లో విద్యుత్ సమస్య లేదని.. విద్యుత్ కోసం 32 వేల కోట్లు ఖర్చు పెట్టామన్నారు.  రాష్ట్రంలో మొత్తం 26 లక్షల కనెక్షన్లు అధికారికంగా ఉన్నాయని, అనధికారికంగా మరో 4 .50 లక్షలు కనెక్షన్లు.. మొత్తం మీద 30 లక్షల పంపు సెట్లు ఉన్నాయని సభకు వివరించారు. ఓవర్ లోడ్ తో ఎక్కడైనా ట్రాన్స్ ఫార్మర్లు కరాబ్ అయితే మా దృష్టి కి తీసుకు రండి అని పల్లా రాజేశ్వర్ రెడ్డి సూచించారు.