సంగారెడ్డి చైర్​పర్సన్​పై తిరుగుబాటు..విచారణ జరిపించాలని డిమాండ్​

సంగారెడ్డి చైర్​పర్సన్​పై తిరుగుబాటు..విచారణ జరిపించాలని డిమాండ్​
  • అవినీతికి పాల్పడుతున్నారని సొంత పార్టీ కౌన్సిలర్ల ఆరోపణలు
  • విచారణ జరిపించాలని డిమాండ్​
  • కన్నీరు పెట్టుకున్న చైర్​పర్సన్​ 

కంది, వెలుగు : సంగారెడ్డి మున్సిపాలిటీలో మంగళవారం నిర్వహించిన జనరల్​బాడీ మీటింగ్​లో​ రూలింగ్ పార్టీ కౌన్సిలర్లు చైర్​పర్సన్​పై తిరుగుబాటు చేశారు. చైర్​పర్సన్​తన బంధువులు మున్సిపల్​లో సిబ్బంది కాకపోయినా, పనులు చేయకున్నా నెల నెలా వారికి జీతాలిస్తున్నారని ఆరోపించారు. శిల్ప వెంచర్​లోని ఓ పార్క్​ 
స్థలాన్ని కబ్జా చేసి తన బంధువుల పేరుపై రిజిస్ట్రేషన్​ చేయించి అమ్ముకుంటున్నారని, ఈ రెండింటిపైనా విచారణ జరిపించాలని డిమాండ్​ చేశారు.  మొత్తం 24 మంది అధికార పార్టీ కౌన్సిలర్లలో 14  మంది చైర్‌‌పర్సన్‌ను వ్యతిరేకిస్తుండగా.. మంగళవారం మీటింగ్​కు ముందు మున్సిపల్​ఆవరణలో 13 మంది  ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. కౌన్సిలర్‌‌ పద్మావతి అనారోగ్యం కారణంగా రాలేకపోయారు. మరో 9 మంది సైలెన్స్​గా ఉండిపోయారు. ఇందులో సాబెర్‌‌ అనే కౌన్సిలర్ మాత్రం చైర్‌‌పర్సన్‌కు సపోర్ట్‌ చేశాడు. 

కన్నీళ్లు పెట్టుకున్న చైర్​పర్సన్​

కౌన్సిలర్ల ఆరోపణలపై స్పందించిన చైర్​పర్సన్​ విజయలక్ష్మి భూమి రిజిస్ట్రేషన్​ చేసుకోవడం తప్పెలా అవుతుందని, ఏదైనా ఉంటే పోలీస్​స్టేషన్​లో తేల్చుకుందామన్నారు.  అయినా వినకుండా కౌన్సిలర్లు ఆరోపణలు చేస్తుండడంతో ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు  ఈ క్రమంలో కౌన్సిలర్‌‌ సాబేర్ కలుగజేసుకొని చైర్​పర్సన్​పై ఆరోపణలు ఆపాలని కోరగా.. మిగతా కౌన్సిలర్లు మండిపడ్డారు. మాట్లాడకుండా కూర్చోవాలని సూచించగా..  కౌన్సిల్‌లోనే ఉన్న అయన తమ్ముడు కాంగ్రెస్​ పార్టీ కౌన్సిలర్​ షఫీ వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ  కుర్చీతో దాడి చేయడానికి ప్రయత్నించాడు. అక్కడే ఉన్న మిగతా కౌన్సిలర్లు ఆపారు. తర్వాత సమావేశం కొనసాగింది.  వైస్​ చైర్​పర్సన్​లత, ఆఫీసర్లు పాల్గొన్నారు.