
ఇంటర్స్టూడెంట్లలో
ఆత్మస్థైర్యం నింపడమే లక్ష్యం
ఆత్మహత్యలకు
పాల్పడకుండా కౌన్సెలింగ్
30న కాలేజీల ప్రతినిధులతో అధికారుల సమావేశం
ఒక్కో కాలేజీ నుంచి ఒకరికి ట్రైనింగ్
హైదరాబాద్, వెలుగు: ఇంటర్ స్టూడెంట్లలో ఆత్మస్థైర్యం నింపి, బలవన్మరణాలకు పాల్పడకుండా చూసేందుకు ప్రైవేటు కాలేజీల్లోనూ కౌన్సెలర్లను ఏర్పాటు చేసేలా సర్కారు చర్యలు మొదలుపెట్టింది. ఈ విషయంపై ఇటీవలే సర్కారీ కాలేజీల్లో స్టూడెంట్స్ కోసం కౌన్సెలర్లను నియమించిన విషయం తెలిసిందే. ప్రైవేటు కాలేజీల్లోనూ ఇలా నియమించుకునేలా చూడాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 30న హైదరాబాద్‌లో కాలేజీ ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తోంది. గతేడాది ఇంటర్ రిజల్ట్స్ తర్వాత స్టూడెంట్లు ఆత్మహత్యలకు పాల్పడటంతో అప్పటి గవర్నర్ ఇచ్చిన ఆదేశాల మేరకు బోర్డు కౌన్సెలర్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది.
ఆరు లక్షల స్టూడెంట్లు వాటిలోనే..
రాష్ట్రంలో మొత్తం 2,558 జూనియర్ కాలేజీలుండగా.. వీటిలో 1,583 ప్రైవేటు, 404 సర్కారీ, 41 ఎయిడెడ్కాలేజీలు ఉన్నాయి. వివిధ శాఖలు, విభాగాల పరిధిలో మరో 530 కాలేజీలున్నాయి. మొత్తంగా 10 లక్షల మంది వరకు ఇంటర్ స్టూడెంట్లు ఉంటే.. అందులో 6 లక్షల మందికిపైగా ప్రైవేటు కాలేజీల్లోనే చదువుతున్నారు. గతేడాది ఇంటర్‌బోర్డు చేసిన తప్పిదాలతో మార్కుల విషయంలో తీవ్ర గందరగోళం నెలకొని.. సుమారు30 మంది వరకు స్టూడెంట్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న నాటి గవర్నర్ నరసింహన్.. స్టూడెంట్లలో ఒత్తిడిని నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆ ఆదేశాల మేరకు ఇటీవలే 404 సర్కారీ జూనియర్ కాలేజీల్లో లెక్చరర్లను కౌన్సెలర్లుగా నియమించింది. ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల్లో స్టూడెంట్లపై మరింత ఒత్తిడి ఉండటం, గతంలో ఆత్మహత్యకు పాల్పడ్డ స్టూడెంట్లలో ఎక్కువ మంది ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల వాళ్లు కావడంతో.. వాటిలోనూ కౌన్సెలర్లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సబిత అధికారులను ఆదేశించారు.
ఒక్కో కాలేజీ నుంచి ఒక్కరికి..
మంత్రి ఆదేశాల నేపథ్యంలోనే ఇంటర్‌బోర్డు ఈనెల 30న హైదరాబాద్‌లోని ఆర్టీసీ కల్యాణ మండపంలో ప్రైవేటు కాలేజీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసింది. ఒక్కో కాలేజీ నుంచి ఒక్కో ప్రతినిధిని పంపించాలని మేనేజ్మెంట్లకు ఇంటర్‌బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ ఆదేశాలు జారీ చేశారు. కాలేజీల ప్రతినిధులకు శిక్షణ ఇచ్చి వారి ద్వారా స్టూడెంట్స్‌కు కౌన్సెలింగ్ ఇప్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని ప్రైవేటు జూనియర్ కాలేజీ మేనేజ్మెంట్ల రాష్ట్ర అధ్యక్షుడు గౌరీ సతీశ్స్వాగతించారు.