
- ఆ ఆరు వాగుల డ్రైనేజ్ సిస్టమ్ ప్రభావాన్ని తేల్చండి
- మే 29నే కేజీబీవోకు బాధ్యతలు.. ఇప్పటికీ సర్వే చేపట్టని సంస్థ
- నేడు కేంద్ర ప్రభుత్వం కీలక సమావేశం..
- పోలవరం ప్రభావిత రాష్ట్రాలు, పీపీఏ, సీడబ్ల్యూసీ,
- పర్యావరణ, జలశక్తి శాఖలతో ఢిల్లీలో మీటింగ్
హైదరాబాద్, వెలుగు: పోలవరం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్‌తో తెలంగాణలోని 6 వాగులు, చిన్న నదులతో కలిగే ముంపుపై త్వరగా సర్వే చేయాలని కృష్ణా–గోదావరి బేసిన్ఆర్గనైజేషన్ (కేజీబీవో)కు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ) విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేజీబీవోకు పీపీఏ లేఖ రాసింది. ఆ ఆరు వాగులు, చిన్న నదుల క్రాస్ సెక్షన్లపై ముంపు సర్వే చేయించాల్సిందిగా సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) సూచించిందని గుర్తు చేసింది. దీనిపై గత మే 29నే కేజీబీవోకు బాధ్యతలు అప్పగించినా ఇంతవరకు స్పందన లేదని, త్వరగా గ్రౌండ్ సర్వే చేయాలని కోరింది.
కాగా, పోలవరం బ్యాక్ వాటర్ ముంపుపై గురువారం కేంద్రం ప్రత్యేక మీటింగ్‌ను నిర్వహించనుంది. పోలవరం ప్రభావిత రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ, ఒడిశా, చత్తీస్‌గఢ్‌లతో పాటు సీడబ్ల్యూసీ, కేంద్ర పర్యావరణ శాఖ, జలశక్తి శాఖ, పీపీఏ ఈ సమావేశంలో పాల్గొననున్నాయి. ప్రధాని నేతృత్వంలో సాగిన ప్రగతి మీటింగ్‌లోనే దీనిపై చర్చించాల్సి ఉన్నా.. రెండు సార్లు కేంద్రం ఆ అంశాన్ని ఎజెండా నుంచి తొలగించింది. తాజాగా కేబినెట్సెక్రటేరియెట్ఈ సమావేశాన్ని నిర్వహించనుండడం గమనార్హం.
నెలన్నరగా మీనమేషాలు
పోలవరం ముంపుపై సర్వే బాధ్యతలను కేజీబీవోకు అప్పగించి నెలన్నరవుతున్నా ఇప్పటికీ మీనమేషాలు లెక్కిస్తున్నది. అవసరమైన ఏజెన్సీలనూ సంస్థ ఇప్పటివరకు రప్పించలేదు. ఏపీ కూడా సర్వేపై కొర్రీలు పెడుతున్నది. పోలవరం పూర్తిస్థాయి సామర్థ్యమైన 45.72 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తే.. తెలంగాణలో ఎంత మేర ముంపు ఉంటుందో తేల్చాలని ఇదివరకే వివిధ సమావేశాల్లో నిర్ధారించారు. కానీ, ఏపీ మాత్రం అందుకు ససేమిరా అంటున్నది. ప్రస్తుతం ఫేజ్ –1లో 41.15 మీటర్ల ఎత్తుతోనే ప్రాజెక్టును నిర్మిస్తున్నాం కాబట్టి.. ఆ ఎత్తుతో తెలంగాణలో ఏర్పడే ముంపుపై మాత్రమే సర్వే చేయాలని అంటున్నది.
సెకండ్ ఫేజ్‌లో 45.72 మీటర్ల ఎత్తుతో కలిగే ముంపుపై సర్వే చేయొచ్చని చెబుతున్నది. వాస్తవానికి 41.15 మీటర్ల ఎత్తుతోనూ భద్రాచలం టౌన్‌కు ముప్పు ఏర్పడుతుందని అధికారులు చెబుతున్నారు. భద్రాచలం టౌన్లో వర్షాలు, నదీ వరదలను డ్రెయిన్ చేసేందుకు 8 తూములు ఉండగా.. అందులో 3 తూములు.. పోలవరం ప్రాజెక్టు ఎత్తుతో చూస్తే 150 అడుగుల కింద, ఒక తూము 135 అడుగులకు దిగువన, మరో 4 తూములు 150 అడుగులపైన ఉన్నాయి. పోలవరాన్ని 135 అడుగుల ఎత్తుతో నిర్మించినా.. ఆ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్‌తో భద్రాచలం టౌన్‌ను ముంచెత్తే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
కోర్టు కేసులు..
పోలవరం బ్యాక్ వాటర్‌తో కలిగే ముంపుపై 2019లో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసింది. ఇటు ఒడిశా, చత్తీస్‌గఢ్ కూడా సుప్రీంకోర్టుకు వెళ్లాయి. పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌తో కిన్నెరసాని, ముర్రేడువాగుల నీళ్లు వెనక్కు తన్ని పొలాలు మునుగుతున్నాయంటూ 2020లో పొంగులేటి సుధాకర్‌రెడ్డి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లోనూ కేసు వేశారు. ఈ బ్యాక్ వాటర్‌తో ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తున్నట్టు తేలిందని, దీనిపై సర్వే చేయించాలని ఎన్జీటీ అదే ఏడాది ఆదేశాలిచ్చింది.
ఈ క్రమంలోనే సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) సర్వే చేసి.. కిన్నెరసాని వద్ద 13 కిలోమీటర్ల మేర పోలవరం బ్యాక్‌వాటర్ ప్రభావం ఉందని నిర్ధారించింది. పోలవరం ప్రాజెక్టు విస్తరణతో ముంపు ఆందోళన ఉంది కాబట్టి.. అన్ని రాష్ట్రాలతో చర్చించి అనుమానాలు నివృత్తి చేసి రిపోర్టు ఇవ్వాలని 2022 సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో సెక్రటరీ స్థాయిలో ఒక మీటింగ్, 4 టెక్నికల్, 3 పీపీఏ లెవెల్ మీటింగులు జరిగాయి.
డీమార్కేషన్ చేయట్లే..
వివిధ స్థాయిల్లో జరిగిన మీటింగ్స్‌లో భాగంగా.. 45.72 మీటర్ల వద్ద తెలంగాణలో ముంపు ఉందని, జాయింట్ సర్వే చేయాలని తేల్చారు. దాంతోపాటు దుమ్ముగూడెం ఆనకట్ట, భద్రాచలం (కూనవరం) మధ్య 36 వాగులు కలుస్తున్నాయని, కాబట్టి వాటిపైనా సర్వే చేయాలని అభిప్రాయపడ్డారు. ఈ 36 నదులు, వాగుల్లో.. ప్రత్యేకించి ఆరు చిన్న నదులు, వాగుల డ్రైనేజీ వ్యవస్థపై సర్వే చేయించాలని నిర్ణయిం చారు. కిన్నెరసాని, ముర్రేడువాగులతో పడే ప్రభావాన్ని అంచనా వేయాలని స్పష్టం చేశారు.
అందులో భాగంగా కిన్నెరసాని, ముర్రేడువాగుపై 2021లోనే సర్వే చేసినా... గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఎంత మేర ముంపు ఉన్నదో తేల్చేలా డీమార్కేషన్ చేయడం లేదు. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 23న జరిగిన మీటింగ్‌లో డీమార్కేషన్ చేయడంతో పాటు ఆ 6 వాగుల ముంపు ప్రభావంపై సీడబ్ల్యూసీతో సర్వే చేయించాలని నిర్ణయించారు. అయితే, తాజాగా ఆ బాధ్యతలను కేజీబీవోకు అప్పగించారు. ఇది జరిగి నెలన్నరవుతున్నా ఆ సంస్థ కనీసం ఏజెన్సీలనూ నియమించుకోలేదు.