
వాషింగ్టన్ డీసీ: ప్రపంచ దేశాలపై టారిఫ్ లు విధిస్తున్న అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో ఏడు దేశాలకూ టారిఫ్స్ లేఖలు పంపించారు. బ్రిక్స్ దేశాలకు, వాటికి సహకరించే దేశాలకు పది శాతం టారిఫ్ లు వడ్డించిన ట్రంప్.. ప్రస్తుతం శ్రీలంక, ఇరాక్, అల్జీరియా, లిబియాలకు 30 శాతం టారిఫ్ లు విధించారు. అదేవిధంగా, బ్రూనై, మాల్డోవాలపై 25 శాతం, ఫిలిప్పీన్స్ పై 20 శాతం పన్నులు విధిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఈ టారిఫ్ లకు సంబంధించి ఆయా దేశాలకు అధికారికంగా లేఖలు పంపామని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి.
టారిఫ్ లను ఆగస్టు 1 నుంచే అమలు చేస్తామని ట్రంప్ సర్కారు తేల్చిచెప్పింది. కాగా, ఈ టారిఫ్ ల విధింపునకు సంబంధించి ట్రంప్ మాట్లాడుతూ.. కొన్నేళ్లుగా టారిఫ్ ల విషయంలో అమెరికాకు జరుగుతున్న అన్యాయాన్ని, అసమానతలను సరిచేసేందుకే ప్రస్తుతం విదేశాలపై టారిఫ్ లు విధిస్తున్నామని స్పష్టం చేశారు. ట్రేడ్ డీల్స్ విషయంలో సమానత్వం, సమన్యాయం వర్తింపజేసే క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. టారిఫ్ ల విషయంలో ఎవరికీ మినహాయింపులు ఉండవని ట్రంప్ ఈ సందర్భంగా మరోమారు తేల్చిచెప్పారు.