ఇయ్యాల నింగిలోకి 36 శాటిలైట్లు

ఇయ్యాల నింగిలోకి 36 శాటిలైట్లు
  •     ఇస్రో ‘ఎల్ వీఎం 3’ రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ షురూ

న్యూఢిల్లీ:  బ్రిటన్ కంపెనీ వన్ వెబ్ కు చెందిన మరో 36 శాటిలైట్లను ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ఆదివారం ఉదయం అంతరిక్షానికి పంపనుంది. ఏపీలోని శ్రీహరికోట నుంచి లాంచ్ వెహికల్ మార్క్ 3(ఎల్ వీఎం3) రాకెట్ ప్రయోగానికి ఈ మేరకు కౌంట్ డౌన్ శనివారం ప్రారంభమైంది. ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా కమ్యూనికేషన్ సేవలను అందించడం కోసం సునీల్ మిట్టల్ కు చెందిన భారతి ఎంటర్ ప్రైజెస్, వన్ వెబ్ కంపెనీలు కలిసి వన్ వెబ్ శాటిలైట్ల నెట్ వర్క్ ను ఏర్పాటు చేస్తున్నాయి. ఇందులో భాగంగా 72 శాటిలైట్లను నింగికి పంపేందుకు ఇస్రోతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. తొలి విడతగా పోయిన ఏడాది అక్టోబర్ లో ఇస్రో 36 వన్ వెబ్ శాటిలైట్లను నింగికి చేర్చింది. ఇప్పుడు మరో 36 ఉపగ్రహాలను దిగువ భూ కక్ష్యలోకి చేర్చనుంది. ఆదివారం నిర్వహించే  ప్రయోగంతో అంతరిక్షంలో వన్ వెబ్ నెట్ వర్క్ లోని ఉపగ్రహాల సంఖ్య 648కి చేరనుంది. దీంతో వన్ వెబ్ కమ్యూనికేషన్ సేవలు ప్రారంభం కానున్నాయి.