
- యూపీఎస్ ఎంచుకున్న ఉద్యోగులు ఎన్‌పీఎస్‌కు కెరీర్‌లో ఒకసారి మారొచ్చు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ పదవీ విరమణ భద్రత కోసం నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్), యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్) మధ్య ఎంపిక చేసుకునే సమయం దగ్గరపడుతోంది. యూపీఎస్ ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చినప్పటికీ, ఎంపికకు గడువు ఈ నెల 30 వరకు పొడిగించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, పెన్షన్ రెగ్యులేటరీ పీఎఫ్‌ఆర్‌డీఏ యూపీఎస్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు పలు మార్పులు తీసుకొచ్చింది.
సెప్టెంబర్ 30 లోపు యూపీఎస్‌ను ఎంచుకున్న ఉద్యోగులు తమ కెరీర్‌లో ఒకసారి ఎన్‌పీఎస్‌కి మారే అవకాశం ఉంటుంది. కానీ, తిరిగి యూపీఎస్‌కి మారే అవకాశం ఉండదు. ఈ మార్పును కనీసం పదవీ విరమణకు ఒక సంవత్సరం ముందు లేదా స్వచ్ఛంద పదవీ విరమణకు మూడు నెలల ముందు చేపట్టాలి.
ఫిజికల్ ఫారమ్ అనుమతి
ఆన్‌లైన్ వ్యవస్థపై ఒత్తిడి పెరగడంతో, పీఎఫ్‌ఆర్‌డీఏ ఫిజికల్ ఫారమ్‌లను సెప్టెంబర్ 30 వరకు సమర్పించేందుకు అనుమతించింది. నోడల్ ఆఫీసుల వద్ద ఫారమ్‌లను సమర్పించొచ్చు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 31 మధ్య ఎన్‌పీఎస్‌లో చేరిన కొత్త ఉద్యోగులు కూడా యూపీఎస్‌కి మారే అవకాశం ఉంది. వీరు ఫామ్‌ఏ1ను ఫిజికల్‌గా సమర్పించొచ్చు. ఒకసారి యూపీఎస్ ఎంచుకున్న తర్వాత తిరిగి ఎన్‌పీఎస్‌కి మారేందుకు కెరీర్ మొత్తంలో ఒక్కసారి మాత్రమే అవకాశం ఉంటుంది.
యూపీఎస్ పరిధిలోకి రాని సంస్థల్లో విదేశాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఫామ్ ఏ2ను ఫిజికల్‌గా తమ పాత సంస్థకు సమర్పించొచ్చు. ఇది ఈ నెల 30 లోపే చేయాలి. నేషనల్ పెన్షన్ ట్రస్ట్ ఈ ఏడాది మేలో క్యాలిక్యులేటర్ టూల్‌ను విడుదల చేసింది. ఉద్యోగులు తమ డేట్ ఆఫ్ బర్త్, జాయినింగ్ డేట్, సర్వీస్ సంవత్సరాలు, ఎన్‌పీఎస్ కార్పస్, బేసిక్ పే వంటి వివరాలు నమోదు చేసి యూపీఎస్–ఎన్‌పీఎస్ లంప్-సమ్, పింఛన్ లాభాలను పోల్చుకోవచ్చు.
ఎన్‌పీఎస్, యూపీఎస్ మధ్య తేడా
యూపీఎస్
ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రవేశపెట్టిన కొత్త మోడల్ ఇది. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్)తో దీనికి పోలికలు ఉన్నాయి. ఎన్‌పీఎస్ మాదిరే ఉద్యోగి, ప్రభుత్వ కంట్రిబ్యూషన్ 10శాతం + 10శాతం ఉంటుంది. లంప్-సమ్‌ను ప్రతి 6 నెలల సర్వీస్‌కు లెక్కిస్తారు. 60శాతం వరకు కార్పస్‌ను విత్‌డ్రా చేసుకోవచ్చు. పన్ను మినహాయింపు ఉంటుంది. 40శాతం పైన కార్పస్‌పై పన్ను ఉంటుంది.
ఇది కూడా బెంచ్‌మార్క్ కార్పస్ ( లిమిట్ కంటే ఎక్కువగా ఉన్న కార్పస్) ను మించిన అమౌంట్‌పైనే పన్ను పడుతుంది. పెన్షన్ నెలవారీగా వస్తుంది, కానీ ఎన్‌పీఎస్‌లోని యాన్యుటీ మాదిరిగా కాకుండా బెంచ్‌మార్క్ కార్పస్ ఆధారంగా వస్తుంది. యూపీఎస్‌ను ఎంచుకున్నవారు ఒక్కసారి మాత్రమే ఎన్‌పీఎస్‌కి మారే అవకాశం ఉంటుంది. ఎన్‌పీఎస్‌తో సమానంగా 80సీసీడీ(1), 80సీసీడీ(2), సెక్షన్ 10(12ఏ, 12బీ, 12ఏబీ) కింద మినహాయింపు పొందొచ్చు.
ఎన్‌పీఎస్
ప్రభుత్వం 2004లో ఈ స్కీమ్‌ను ప్రారంభించింది. ఉద్యోగి, ప్రభుత్వ కంట్రిబ్యూషన్‌తో కార్పస్ (నిధి) పెరుగుతుంది. నెలవారీ బేసిక్ + డీఏలో 10 శాతం చొప్పున ఉద్యోగి, ప్రభుత్వం కంట్రిబ్యూట్ చేయాలి. ఈ ఫండ్స్‌ను పీఎఫ్‌ఆర్‌డీఏ నియంత్రించే ఫండ్ మేనేజర్లు మార్కెట్‌లో పెట్టుబడి పెడతారు. పదవీ విరమణ సమయంలో 60శాతం కార్పస్ లంప్‌సమ్ (పెద్ద మొత్తంలో) ఉపసంహరించుకోవచ్చు. పన్ను మినహాయింపు ఉంటుంది.
మిగిలిన 40శాతంతో యాన్యుటీ కొనాలి. ఉద్యోగికి నెలవారీ పెన్షన్ దక్కుతుంది. ఉద్యోగి ఉద్యోగం మారినా, ఎన్‌పీఎస్ కొనసాగించొచ్చు. 80సీసీడీ(1), 80సీసీడీ(2) కింద ట్యాక్స్ డిడక్షన్స్ పొందొచ్చు.