- 2021 టీ20 వరల్డ్‌కప్‌ను లాంచ్ చేసిన ఐసీసీ, బీసీసీఐ
- మెగా టోర్నీని సక్సెస్ చేసి చూపిస్తాం: సౌరవ్, జై షా
కరోనాను జయిస్తూ ఐపీఎల్13ను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసిన బీసీసీఐ మరో టాస్క్‌కు రెడీ అయ్యింది. మెగా లీగ్ ఇచ్చిన జోష్‌తో 2021 మెన్స్ టీ20 వరల్డ్‌కప్ ప్రిపరేషన్స్ మొదలుపెట్టింది. ఇండియా వేదికగా సరిగ్గా ఏడాది తర్వాత ప్రారంభమయ్యే వరల్డ్‌కప్ కౌంట్‌డౌన్‌ను ఐసీసీతో కలిసి స్టార్ట్ చేసింది. ఈ ఇంటర్నేషనల్ ఈవెంట్‌లో 16 టీమ్స్ బరిలో ఉండగా.. ఫుల్ షెడ్యూల్‌ను ఖరారు చేయాల్సి ఉంది.
దుబాయ్: వచ్చే ఏడాది ఇండియా వేదికగా జరగబోయే ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్‌కప్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ టోర్నమెంట్ ప్రారంభానికి సరిగ్గా ఏడాది సమయం ఉండగా.. ఇందుకు సంబంధించిన కౌంట్‌డౌన్‌ను గురువారం ప్రారంభించారు. దుబాయ్ వేదికగా జరిగిన 2021 వరల్డ్ కప్ లాంచింగ్ కార్యక్రమంలో ఐసీసీ సీఈవో మనూ సావ్నే, బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జై షా తదితరులు పాల్గొన్నారు. వచ్చే ఏడాది అక్టోబర్–నవంబర్ విండోలో ఇండియా వేదికగా ఈ మెగా ఈవెంట్ జరగనుంది. నిజానికి కరోనా మహమ్మారి దెబ్బకు ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్ 2022కు పోస్ట్‌పోన్ అయ్యింది. కానీ 2021 ఈవెంట్ మాత్రం షెడ్యూల్ ప్రకారం ఇండియాలో జరగనుంది. ఆసీస్ వేదికగా ఈ ఏడాది జరిగిన మహిళల టీ20 వరల్డ్‌కప్ తర్వాత జరగబోయే ఐసీసీ తొలి ఈవెంట్ కూడా ఇదే కావడం విశేషం. ఈ మెగా టోర్నీలో మొత్తం 16 టీమ్స్ బరిలో ఉన్నాయి. ఇండియా చివరిగా 2016లో టీ20 వరల్డ్‌కప్‌కు ఆతిథ్యమిచ్చింది. అప్పుడు వెస్టిండీస్ చాంపియన్‌గా నిలిచింది. కాగా, బీసీసీఐతో కలిసి టీ20 వరల్డ్‌కప్‌ను సూపర్ హిట్ చేస్తామని ఐసీసీ సీఈవో మనూ సావ్నే అన్నారు. ‘ దీపావళికి రెండ్రోజులు ముందు ఇండియా వేదికగా జరిగే టోర్నమెంట్ కౌంట్‌డౌన్ మొదలైంది. దీపాల పండగను మరింత అద్భుతం చేసేందుకు ఇదో గొప్ప అవకాశంగా భావిస్తున్నాం. వరల్డ్ బెస్ట్ ప్లేయర్లను ఒక్కచోటుకు చేర్చి కరోనా బ్రేక్ తర్వాత జరుగనున్న ఈ తొలి ఐసీసీ టోర్నీని అద్భుతంగా నిర్వహిస్తాం. ఇందుకోసం బీసీసీఐతో కలిసి పని చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్‌కు ఆనందాన్ని అందిస్తూ సేఫ్‌గా, సెక్యూర్‌గా టోర్నీని పూర్తి చేయడంపైనే దృష్టి పెడతాం. ఐపీఎల్–13ని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసిన బీసీసీఐ, ఎమిరేట్స్ క్రికెట్ బోర్డులకు కంగ్రాట్స్. వరల్డ్‌కప్ నిర్వహణకు వారి అనుభవాలను పరిగణనలోకి తీసుకుంటాం. ఇతర సభ్యులను కూడా ప్లానింగ్‌లో భాగస్వాములను చేస్తాం’ అని మనూ పేర్కొన్నారు.
హెల్త్, సెఫ్టీపై రాజీ లేదు: షా
కాగా.. హెల్త్ అండ్ సేఫ్టీకి ప్రాధాన్యమిస్తూ.. ఎలాంటి పొరపాటుకు తావులేకుండా ఐసీసీ ఈవెంట్‌ను పూర్తి చేస్తామని బీసీసీఐ సెక్రటరీ జైషా చెప్పాడు. ‘ టోర్నీలో భాగమైన ప్రతిఒక్కరి హెల్త్ అండ్ సేఫ్టీ అంశంలో రాజీపడకుండా మెగా ఈవెంట్‌ను సురక్షితంగా పూర్తి చేస్తామని భరోసా ఇస్తున్నా. అద్భుతమైన క్రికెట్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు మేమంతా కట్టుబడి ఉన్నాం. ఆతిథ్యం విషయంలో ఇండియాకు తిరుగులేదని ఐసీసీతోపాటు బోర్డు మెంబర్స్ అందరికీ అర్థమయ్యేలా చేస్తాం. టోర్నీకి వచ్చే ప్రతి ఒక్కరికీ సొంతింటిలో ఉన్న ఫీలింగ్ కల్పిస్తాం. కరోనా ముప్పు పొంచి ఉండడంతో అనేక రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. బీసీసీఐ వాటికి అనుగుణంగా పని చేస్తుంది. ఈ క్రమంలో ఎదురయ్యే సవాళ్లను కూడా అధిగమిస్తుందని నమ్మకంగా చెబుతున్నా’ అని జైషా వెల్లడించాడు. ఈ టోర్నీలో ఇండియాతోపాటు అఫ్గానిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, ఐర్లాండ్, నమీబియా, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, ఒమన్, పాకిస్తాన్, పపువా న్యూగునియా, స్కాట్లాండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్ జట్లు పాల్గొననున్నాయి.
కొత్త చాలెంజ్: దాదా
ఇండియాలో ఐసీసీ ఈవెంట్‌ను నిర్వహించనుండడం అడ్మినిస్ట్రేటర్‌గా తనకు ఓ కొత్త చాలెంజ్ అని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ అన్నాడు. ‘ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్‌కప్‌కు ఆతిథ్యమిచ్చే అవకాశం మాకు లభించిన గౌరవంగా భావిస్తున్నా.1987 నుంచి ఇండియా పలు ఐసీసీ ఈవెంట్లను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసింది. అంతేకాకుండా క్రికెట్‌ను ఆరాధించే మా దేశంలో ఆడేందుకు ప్రపంచంలోని ప్రతీ క్రికెటర్ ఇష్టపడతాడని నమ్మకంగా చెప్పగలను. ఒక ప్లేయర్‌గా ఐసీసీ ఈవెంట్లలో పాల్గొన్న అనుభవంతో చెబుతున్నా. ప్రతీ మ్యాచ్‌ను వరల్డ్ వైడ్‌గా కోట్ల మంది చూస్తారు. దాంతో ఈ గ్లోబల్ ఈవెంట్‌లో ఏర్పడే ప్రత్యేక వాతావరణం మరే టోర్నీలో ఉండదు. ఈ ప్రతిష్టాత్మక టోర్నీ హోస్టింగ్‌లో ఈసారి అడ్మినిస్ట్రేటర్‌గా నావంతు బాధ్యత నిర్వర్తించేందుకు ఎదురుచూస్తున్నా’ అని దాదా పేర్కొన్నాడు.
