
- ఆలస్యంగా మొదలైన అగ్రి, టాస్క్ ఫోర్స్ దాడులు
- ఇప్పటివరకు 320 క్వింటాళ్ల నకిలీ విత్తనాలు సీజ్
- 21 క్రిమినల్ కేసులు..
- 34 మంది అరెస్ట్
- తీరు మారని వ్యాపారులు
- రీసైక్లింగ్, ఫేక్ సీడ్స్‌తో మోసపోతున్న రైతులు
హైదరాబాద్, వెలుగు: ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే నకిలీ విత్తనాలు మార్కెట్‌లోకి వచ్చేస్తున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా నకిలీ విత్తనాల అక్రమ దందా షురువైంది. వ్యవసాయ శాఖ, టాస్క్‌ఫోర్స్ సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో ఇప్పటికే భారీ ఎత్తున నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. మార్చి నెల నుంచే నకిలీలపై కొరడా ఝలిపించాల్సిన అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్ ఆలస్యంగా స్పందించింది. మార్కెట్‌లో నకిలీ కాటన్, మిర్చి విత్తనాలు భారీగా సరఫరా అవుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో 20 రోజుల క్రితం అగ్రికల్చర్ ఏడీఏలు, పోలీస్ ఇన్‌స్పెక్టర్లు, సీడ్ ఆఫీసర్లు9 ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలను రంగంలోకి దిగారు. సీడ్ కంపెనీలు, ప్రాసెసింగ్ యూనిట్లు, స్టోరేజీ, డీలర్స్, సేల్ పాయింట్లలో తనిఖీలు నిర్వహించారు. సీడ్ కంపెనీల లైసెన్స్‌లు, బ్యాచ్ నంబర్లు, ట్యాగ్‌లను తనిఖీ చేయగా నకిలీల బండారం బయటపడింది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 320 క్వింటాళ్ల విత్తనాల సీజ్ చేశారు. నకిలీ విత్తనాలను సరఫరా చేస్తున్న 34 మందిని టాస్క్‌ఫోర్స్ బృందాలు అరెస్టు చేశాయి. 21 క్రిమినల్ కేసులు నమోదు చేశారు. సీజ్ చేసిన కాటన్, మిర్చీ, ఇతర విత్తనాల విలువ దాదాపు రూ.1.20 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు.
దాడుల్లో తీవ్ర జాప్యం
ఈ ఏడాది మార్చి నుంచే నకిలీ విత్తనాల దందా షురువైంది. సీజన్‌కు మూడు నెలల ముందే తనిఖీలు చేయాల్సి ఉండగా మే13 వరకు టాస్క్‌ఫోర్స్ టీమ్‌లు దాడులే మొదలుపెట్టలేదు. దీంతో మార్కెట్లోకి భారీగా నకిలీ విత్తనాలు చేరిపోయాయని చెప్తున్నారు. ఇప్పటికే వ్యాపారులు పెద్ద మొత్తంలో నకిలీ విత్తనాలను రైతులకు అంటగట్టారని తెలుస్తోంది. నిరుడు మార్చి, ఏప్రిల్ నెలల్లో టాస్క్ ఫోర్స్ దాడుల్లో 200 మంది వ్యాపారులు దొరికారు. ఈ సారి దాడులు లేట్ చేయడంతో చాలా మంది తప్పించుకునేందుకు అవకాశం ఇచ్చినట్లయిందని పేర్కొంటున్నారు.
రీసైక్లింగ్ సీడ్స్‌తో మోసం
మహారాష్ట్ర, గుజరాత్ నుంచి పత్తి విత్తనాలను రాష్ట్రానికి తరలించి లూజ్ దందా సాగిస్తున్నారు. ప్రధానంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మహబూబ్‌నగర్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో ఈ దందా ఎక్కువగా సాగుతున్నట్లు తెలుస్తోంది. గడువు ముగిసిన విత్తనాలను రీసైక్లింగ్ చేసి రైతులకు అమ్ముతున్నారు. నాసి రకం విత్తనాలను సేకరించడం, లేబుళ్లు మార్చడం, స్టాక్ రిజిస్టర్లలో విత్తనాలను నమోదు చేయకపోవడం, అనధికారికంగా విత్తనాలను ప్యాక్ చేయడం లాంటి మార్గాల ద్వారా నకిలీ విత్తనాలను మార్కెట్‌లోకి పంపుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని కంపెనీలు కాలం చెల్లిన విత్తనాలను అంటగట్టి రైతులను మోసం చేస్తున్నాయి. ఎక్స్‌పైర్డ్ విత్తనాలను రీసైక్లింగ్ చేసి కొత్తవని చెప్పి రైతులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నాయి. పత్తి, వరి, మొక్కజొన్న, సోయాబీన్, తదితర పంటలన్నింటికీ రీసైక్లింగ్ విత్తనాలనే సరఫరా చేస్తూ కొన్ని కంపెనీలు రైతులను ముంచేస్తున్నాయి.
నిషేధిత విత్తనాలు అంటగడ్తున్నరు
రాష్ట్రంలో ఈ ఏడాది 75 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరగనుంది. దీన్ని ఆసరగా తీసుకుని కొందరు వ్యాపారులు నిషేధిత జన్యుమార్పిడి చేసిన బోల్‌గార్డ్–3 కాటన్ సీడ్స్ ను రైతులకు అంటగడుతున్నారు. విత్తన దళారులు నిషేధిత హెచ్ టీ కాటన్ (బీజీ–3) విత్తనాలను గుజరాత్, మహారాష్ట్ర నుంచి తెస్తున్నారు. కొన్ని సీడ్ కంపెనీలు జన్యుమార్పిడి పత్తి విత్తనాలను అనధికారిక డీలర్లు, ప్రత్యేక ఏజెంట్ల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. సీడ్ డీలర్లు నిబంధనల ప్రకారం పత్తి సీడ్ ప్యాకెట్ అమ్మితే లాభం రూ.50కి మించదు. అదే బీజీ–3 విత్తనాలను కిలో లూజ్ సీడ్ అమ్మితే పది నుంచి 20రెట్లకు పైగా లాభం వస్తుంది. దీంతో వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా రైతులకు విత్తనాలను అంటగడుతున్నారు.