
- లోక్ సభ ప్రతిపక్ష నేతరాహుల్ గాంధీ డిమాండ్
- మేక్ ఇన్ ఇండియాలో మార్పులు అవసరమని వెల్లడి
న్యూఢిల్లీ: ఇండియా, పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఘర్షణలను తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే చేస్తున్న కామెంట్లపై పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ క్లారిటీ ఇవ్వాలని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ విషయంలో నిజం ఏమిటో తెలుసుకునే హక్కు దేశ ప్రజలకు ఉందన్నారు.
ఈ మేరకు శనివారం ఎక్స్ వేదికగా రాహుల్ స్పందించారు. "మే నెలలో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన ఘర్షణలో ఐదు జెట్ విమానాలు కూలిపోయాయని.. ఇరుదేశాల మధ్య ఉద్రక్తతలను తానే తగ్గించానని ట్రంప్ పదే పదే చెప్తున్నారు.
మోదీజీ.. ట్రంప్ చేస్తున్న ఈ కామెంట్లపై స్పందించకుండా మీరు 70 రోజులుగా ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇది దేనికి సంకేతం.? మన దేశ ప్రజలకు సత్యం తెలుసుకునే హక్కు ఉంది! ట్రంప్ చెప్పిన విషయాలపై పార్లమెంట్‌లో స్పష్టమైన, సమగ్రమైన వివరణ ఇవ్వండి" అని రాహుల్ డిమాండ్ చేశారు.
‘మేక్ ఇన్ ఇండియా’ అసెంబ్లింగ్‌కే
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంపై కూడా రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఈ కార్యక్రమం కేవలం అసెంబ్లింగ్‌కే పరిమితమైందని ఆరోపించారు.
నిజమైన మ్యానుఫ్యాక్చరింగ్ జరగడంలేదని తెలిపారు. ఆయన ఆరోపించారు. ‘మేక్ ఇన్ ఇండియా’ ఉద్దేశాలైన భారత్ ఉత్పత్తిలో స్వావలంబన సాధించే వరకు ఉద్యోగాలు, వృద్ధి వంటి చర్చలు కేవలం ప్రసంగాలుగానే మిగిలిపోయాయని వివరిస్తూ ట్వీట్ చేశారు. చైనాతో సమానంగా పోటీపడేందుకు గ్రౌండ్- లెవెల్ లో మార్పులు అవసరమని రాహుల్ సూచించారు.
"భారత్‌లో తయారైన టీవీలలో 80% భాగాలు చైనా నుంచే వస్తాయని మీకు తెలుసా? ‘మేక్ ఇన్ ఇండియా’ పేరుతో మనం కేవలం అసెంబ్లింగ్ చేస్తున్నాం. తయారీ కాదు. ఐఫోన్‌ల నుంచి టీవీల వరకు భాగాలు విదేశాల నుంచే వస్తాయి. మనం ఆ భాగాలను కేవలం కలుపుతున్నాం. అంతే” అని రాహుల్ వెల్లడించారు.
చిన్న వ్యాపారులు ఏదో ఒకటి తయారీ చేయాలనుకుంటున్నారని.. కానీ వారికి మద్దతివ్వడం లేదని చెప్పారు. పైగా భారీ పన్నులు, కొందరు కార్పొరేట్‌ల గుత్తాధిపత్యం పరిశ్రమలను కమ్మేసిందని విమర్శించారు. గ్రేటర్ నోయిడాలో టీవీలను అసెంబుల్ చేసే ఒక యూనిట్‌ను సందర్శించిన 7 నిమిషాల వీడియోను రాహుల్ షేర్ చేశారు.