
ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక వ్యవస్థలన్నీ ధ్వంసమవుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఇప్పటివరకు ఈడీ 3వేల దాడులు చేసిందన్న ఆయన... వాటిలో నిరూపితమైంది ఒకటి కూడా లేదని, రాజకీయ కక్షతో దాడులు చేస్తున్నారని ఆరోపించారు. భారతదేశాన్ని ఒక అటవిక రాజ్యాంగంగా మార్చుతున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రగతిశీల శక్తులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. మంత్రులు గంగుల కమలాకర్, మల్లారెడ్డిపై దాడులు జరుగుతున్నాయని, ప్రధాన నేరస్తుడు కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ అని ఆరోపించారు. బీజేపీ నాయకుల మీద ఎందుకు ఐటీ, ఈడీ దాడులు జరగడం లేదో తెలియదన్నారు. ఎమ్మెల్యేలను లొంగ తీసుకొనేందుకే వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నటనలో ఎవరూ సాటిరారని కూనంనేని సాంబశివరావు విమర్శించారు. బీఎల్ సంతోష్ కు నోటీసులు ఇస్తే బండి సంజయ్ ఎందుకు ఏడుస్తున్నారని ప్రశ్నించారు. 41A ప్రకారం అధికారులకు ప్రశ్నించే అధికారం ఉందన్న ఆయన.. సిట్ వాళ్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ను కూడా విచారించాలని డిమాండ్ చేశారు. కమ్యూనిస్టు పార్టీలు ఎవరితో పొత్తు పెట్టుకుంటే బండి సంజయ్ కు ఎందుకని ప్రశ్నించారు. బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకోకపోతే... తాము అంతే స్పీడ్ గా జవాబు ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరించారు.