దేశానికి తాగునీటి గండం .. వాటర్​కమిషన్​ బులెటిన్​ వెల్లడి

దేశానికి తాగునీటి గండం .. వాటర్​కమిషన్​ బులెటిన్​ వెల్లడి
  • దేశ వ్యాప్తంగా 150 రిజర్వాయర్లలో  38 శాతం మాత్రమే నీటి నిల్వలు
  • పదేండ్ల కనిష్ఠానికి వాటర్​ లెవల్స్​

న్యూఢిల్లీ: దేశానికి తాగునీటి గండం పొంచి ఉన్నది. దేశవ్యాప్తంగా ఉన్న రిజర్వాయర్లలో నీటి నిల్వలు వేగంగా పడిపోవడం ఆందోళన కలిగిస్తున్నది. ఇప్పటికే తీవ్ర నీటి ఎద్దడితో సతమతమవుతున్న బెంగళూరు దుస్థితే దేశం మొత్తానికి రానున్నదా? అనే భయం నెలకొన్నది. నిరుడు వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలాలు కూడా అడుగంటిపోవడం ఇందుకు కారణమని సంబంధిత అధికారులు చెప్తున్నారు.

తాగునీటి అవసరాలు రోజురోజుకూ పెరుగుతుంటే.. అందుకు భిన్నంగా రిజర్వాయర్లలో నీటిమట్టం రోజురోజుకూ పడిపోతున్నదని అంటున్నారు. అసలు వేసవికాలం సమీపిస్తున్న తరుణంలో దేశవ్యాప్తంగా ఉన్న 150 రిజర్వాయర్లలో నీటిమట్టం  మొత్తం సామర్థ్యంలో 38 శాతం మాత్రమే ఉండటం ఆందోళన రేకెత్తిస్తున్నది. ఇది దశాబ్దపు సగటు కంటే తక్కువకావడం రాబోయే నీటిగండం ముప్పును సూచిస్తున్నది. 

దేశానికీ బెంగళూరు గతేనా?

ఇప్పటికే కర్నాటక రాజధాని బెంగళూరు తీవ్ర నీటి ఎద్దడితో సతమతమవుతున్నది.  రోజుకు 2,600 ఎంఎల్​డీ (మిలియన్స్​ ఆఫ్​ లీటర్​ పర్​ డే) డిమాండ్​ ఉండగా.. 500 మిలియన్​ లీటర్లకు నీటి కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో అక్కడ నీటివాడకంపై కఠిన నిబంధనలు విధించారు. నగరంలో తాగునీటి కొరతను అరికట్టేందుకు వాటర్​ బోర్డు అధికారులు కీలక ఆదేశాలు జారీచేశారు. సెంట్రల్​ వాటర్​ కమిషన్​ బులెటిన్​ ప్రకారం.. కర్నాటకతోపాటు మిగతా రాష్ట్రాల్లోనూ గత ఏడాదితో పోలిస్తే నీటి నిల్వ స్థాయిలు కనిష్టానికి పడిపోయాయి. హిమాచల్​ ప్రదేశ్​, పంజాబ్​, మధ్యప్రదేశ్​, త్రిపుర, రాజస్థాన్​, బిహార్​, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్​, గుజరాత్, చత్తీస్​గఢ్​, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లోని  ప్రాజెక్టుల్లోని స్టోరేజీ ఆందోళనకరంగా పడిపోయింది. 

రిజర్వాయర్లలో నీటి నిల్వ 67.591 బీసీఎం మాత్రమే

దేశంలోని 150 రిజర్వాయర్ల సామర్థ్యం 178.784 బీసీఎం (బిలియన్​ క్యూబిక్​ మీటర్స్​). దేశం మొత్తం సామర్థ్యం 257.812 బీసీఎంలలో ఇది  69.35శాతం. ప్రస్తుతం ఇది 38శాతానికి చేరుకొన్నది. అంటే రిజర్వాయర్లలో వాటర్​ స్టోరేజీ సగానికి పడిపోయింది. నిరుడు ఇదే సమయానికి ప్రాజెక్టుల్లో నిల్వసామర్థ్యం 80.557 బీసీఎంలు గత పదేండ్లలో సరాసరి 72.396 బీసీఎంలు.

దక్షిణాదిలో దారుణం

దక్షిణాది రాష్ట్రాల్లోని రిజర్వాయర్లలో వాటర్​ స్టోరీజీ దారుణంగా పడిపోతున్నట్టు సెంట్రల్​ వాటర్​ కమిషన్​ బులెటిన్​పేర్కొన్నది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ, కర్నాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో మొత్తం 42 ప్రాజెక్టులుండగా.. వీటి స్టోరేజీ కెపాసిటీ 53.334 బీసీఎం. అయితే,  ప్రస్తుతం ఈ రిజ్వరాయర్లలో నీటి నిల్వలు  12.287 బీసీఎంకు పడిపోయాయి.

అంటే మొత్తం స్టోరేజీ కెపాసిటీలో కేవలం 23 శాతం మాత్రమే నీటి నిల్వలు ఉన్నాయి.  నిరుడు ఇదే సమయానికి ఈ ప్రాజెక్టుల్లో 39 శాతం నీటినిల్వలు ఉండగా.. పదేండ్ల సగటు 32 శాతంగా ఉ న్నది.  అంటే దక్షిణాదిలోని రిజర్వాయర్లలో వాటర్​స్టోరేజీ పదేండ్ల కనిష్టానికి పడిపోయింది. దీంతో ఈ వేసవిలో బెంగళూరు తరహా నీటిఎద్దడి తప్పకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల వల్లే ఈ దుస్థితి నెలకొన్నదని చెబుతున్నారు.