
హైదరాబాద్, వెలుగు: ఇంతకాలం మంత్రులు, ఎమ్మెల్యేలు మీడియా సమావేశాల్లో మాత్రమే కేటీఆర్ సీఎం కావాలని మాట్లాడెటోళ్లు. మంత్రి గంగుల కమాలకర్ మాత్రం ఒక అడుగు ముందుకేసి కేటీఆర్ సమక్షంలోనే ‘కేసీఆర్ పీఎం.. కేటీఆర్ సీఎం’ కావాలని అన్నారు. గురువారం తెలంగాణ భవన్‌లో కొత్త మేయర్లు, చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో కేటీఆర్ మీటింగ్ పెట్టారు. దీనికి మంత్రి గంగుల కరీంనగర్ కార్పొరేషన్ పాలకమండలిని తీసుకొచ్చారు. మీటింగ్ స్టార్ట్ కాంగనే మంత్రి గంగుల మాట్లాడుతూ ‘కేసీఆర్ అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అవి చూసి దేశమంత మాకు కూడా అసోంటి స్కీమ్‌లు కావాలని కోరుకుంటోంది. దేశమంత సంతోషంగా ఉండాలంటే కేసీఆర్ ప్రధానమంత్రి కావాలి. కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలె’ అని గంగుల అన్నారు. గంగుల ప్రసంగం పూర్తి చేసుకుని చైర్‌లో కూర్చోగానే కేటీఆర్ గంగుల చేవిలో ఏదో చెప్పడం, వెంటనే ఇద్దరు నవ్వుకుంటూ కనిపించారు. తెలంగాణలో టీఆర్ఎస్ మరో 40 ఏండ్లు పాలిస్తుందని, ఎవరికీ అధికారం ఇవ్వమని గంగుల అన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు చూస్తే కేటీఆర్ తండ్రికి తగ్గ కొడుకని నిరూపించుకున్నారని అన్నారు. కరీంనగర్‌లో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు టీఆర్ఎస్ పెద్దపీట వేసిందని చెప్పారు.