కుటుంబ రాజకీయాలతో దేశానికి నష్టం : మోదీ

కుటుంబ రాజకీయాలతో దేశానికి నష్టం : మోదీ
  •      దేశ అభివృద్ధికి యువశక్తే కీలకం.. నేటి తరానిది ఎంతో అదృష్టం
  •     డ్రగ్స్ కు దూరంగా ఉండాలని యువతకు ప్రధాని సూచన

నాసిక్/ముంబై: ఇరవై ఒకటో శతాబ్దంలోనే నేటి తరం యువత ఎంతో అదృష్టవంతులని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో ఇప్పుడు అనేక రంగాల్లో అభివృద్ధి ఊపందుకున్నదని, ఉపాధి అవకాశాలు కూడా విస్తృతంగా పెరిగాయన్నారు. దేశాన్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్లడంలో యువశక్తి పాత్ర చాలా కీలకమన్నారు. శుక్రవారం నాసిక్ లోని తపోవన్ మైదానంలో 27వ నేషనల్ యూత్ ఫెస్టివల్ ను ప్రధాని ప్రారంభించారు.

 ఈ సందర్భంగా ఆయన దేశ యువతను ఉద్దేశించి మాట్లాడారు. యువత ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడం ద్వారా కుటుంబ రాజకీయాల ప్రభావాన్ని తగ్గించాలన్నారు. దేశానికి కుటుంబ రాజకీయాలు ఎంతో నష్టం చేశాయని, యువత వీలైనంత త్వరగా ఓటు హక్కును నమోదు చేసుకోవాలని చెప్పారు. ఫస్ట్ టైం ఓటర్లు దేశ ప్రజాస్వామ్యానికి కొత్త శక్తిగా నిలుస్తారన్నారు.

 యువతీయువకులు డ్రగ్స్ కు దూరంగా ఉండాలని, తల్లులు, అక్కచెల్లెండ్ల పేరిట తిట్టడం మానుకోవాలని కోరారు. లోకల్ ప్రొడక్టులను ప్రమోట్ చేయాలని సూచించారు. అంతకుముందు స్వామి వివేకానంద, రాజమాత జీజాబాయి జయంతుల సందర్భంగా ప్రధాని వారి విగ్రహాలకు నివాళులు అర్పించారు.  స్వామి వివేకానంద, అరబిందో వంటి మహానుభావులను ప్రస్తావిస్తూ.. దేశ చరిత్రను మార్చే శక్తి యువతకు ఉందన్నారు. 

మహారాష్ట్ర నుంచి అహిల్యాబాయి హోల్కర్, రమాబాయి అంబేద్కర్, లోకమాన్య తిలక్, వీడీ సావర్కర్ వంటి ఎంతో మంది ఫ్రీడమ్ ఫైటర్లు ఆదర్శంగా నిలిచారన్నారు. అయోధ్య వేడుకల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని గుడుల్లోనూ శ్రమదానంతో శుభ్రం చేయాలని మోదీ పిలుపునిచ్చారు. కాగా, స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జనవరి 12 నుంచి 16 వరకూ ఈ ఫెస్టివల్ నిర్వహించనున్నారు.

నాసిక్ లో రోడ్ షో.. టెంపుల్ లో శ్రమదానం 

ప్రధాని మోదీ శుక్రవారం ఉదయం నేషనల్ యూత్ ఫెస్టివల్ ప్రారంభానికి ముందు నాసిక్​లో భారీ రోడ్ షో నిర్వహించారు. హోటల్ మిర్చీ చౌక్ నుంచి సంత్ జనార్దన్ స్వామి మహరాజ్ చౌక్ వరకూ 2 కి.మీ. పొడవునా రోడ్ షో సాగింది. మోదీ వెంట మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే, డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్, బీజేపీ నేతలు ఉన్నారు. రోడ్డుకు ఇరువైపులా వేలాది మంది ప్రజలు ప్రధానికి ఘనంగా స్వాగతం పలికారు. సంప్రదాయ కళల ప్రదర్శనతో కళాకారులు అలరించారు. అనంతరం ప్రధాని గోదావరి ఒడ్డున ఉన్న రామ్ కుండ్​కు చేరుకున్నారు.

 అక్కడ జల పూజ, హారతి నిర్వహించారు. ఆ తర్వాత ఆయన కాలారామ్ టెంపుల్​కు వెళ్లి అక్కడి ఫ్లోర్​ను శుభ్రం చేశారు. ఆలయంలో పూజారులతో కలిసి రామ భజనలో పాల్గొన్నారు. రామాయణంలో ని యుద్ధకాండలో శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చే ఘట్టానికి సంబంధించిన శ్లోకాలను పూజారులు పఠించగా, ప్రధాని శ్రద్ధగా విన్నారు.