ఫైనాన్స్ కంపెనీలను మోసగిస్తున్న దంపతులు అరెస్ట్

ఫైనాన్స్ కంపెనీలను మోసగిస్తున్న దంపతులు అరెస్ట్

సికింద్రాబాద్​, వెలుగు: బంగారం తాకట్టు పేరుతో ఫైనాన్స్​కంపెనీలను మోసగించి తప్పించుకు తిరుగుతున్న దంపతులను మల్కాజిగిరి పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వారి వద్ద రూ.20లక్షల విలువైన కారు స్వాధీనం చేసుకోవడమే కాకుండా బ్యాంకు ఖాతాలోని రూ.11లక్షల నగదు సీజ్​ చేశారు. పోలీసులు తెలిపిన ప్రకారం. మల్కాజిగిరికి చెందిన ఢీకొండ శ్యామ్​కుమార్(40), దాసరి రజనీ అలియాస్ ఢీకొండ వర్షిణి(35) భార్యాభర్తలు.  వీరు ఈజీ మనీ కోసం కొంత కాలంగా మోసాల బాట పట్టారు.  తమ బంగారు నగలు తాకట్టులో ఉన్నాయని, వాటిని విడిపించి తెస్తామని ప్రైవేటు ఫైనాన్స్​కంపెనీలను నమ్మిస్తున్నారు. 

తాకట్టుపెడతామని, అందుకు డబ్బులు ఇస్తే కట్టేసి తెచ్చి మీకు ఇస్తామని వాటి రసీదులను చూపిస్తూ రూ. లక్షలు తీసుకుని ఉడాయిస్తున్నారు. ఈనెల16న ఆనంద్​బాగ్​లోని కేఎల్ఎం ఫైనాన్స్​సంస్థ బ్రాంచ్​మేనేజర్​ లావణ్యను కూడా నమ్మించి రూ.14,85,551 తీసుకుని పారిపోయారు. నగలు తెచ్చి ఇవ్వకపోగా ఫోన్​కూడా స్విచాఫ్​ చేశారు. దీంతో ఫైనాన్స్​కంపెనీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దంపతులను   గురువారం అరెస్టు చేశారు. విచారణలో భాగంగా కుషాయిగూడ, కీసర పీఎస్ పరిధిలోనూ మోసాలకు పాల్పడినట్టు వెల్లడైంది. నాగారంలోని కొసమట్టం ఫైనాన్స్​కంపెనీ వద్ద రూ.14.70లక్షలు, ఏఎస్​రావునగర్​లోని ముత్తూట్​ఫైనాన్స్​సంస్థ వద్ద రూ.14.90 లక్షలు నగదు తీసుకుని మోసగించినట్టు నిందితులు అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు.