
- దంపతులు సహా 9 మందిపై కేసు, చెక్ రికవరీ
- ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు
యాదాద్రి, వెలుగు: కల్యాణలక్ష్మి కోసం మళ్లీ పెండ్లి చేసుకొని చెక్ తీసుకున్న ఘటనలో దంపతులు సహా 9 మందిపై చీటింగ్ కేసు నమోదైంది. వివరాలు ఇలా ఉన్నాయి. యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం పాలడుగుకు చెందిన వల్లపు రాధిక, వలిగొండకు చెందిన మర్ల మహేశ్‌తో 2011లో వివాహం జరిగింది. వారికి 13 ఏండ్ల కొడుకు, 9 ఏండ్ల కూతురు ఉన్నారు. కల్యాణలక్ష్మి కోసం 2023 సెప్టెంబర్ 10న తమ ఇంట్లోనే పెండ్లి జరిగినట్లు పత్రికలు ప్రింట్ చేయించారు. పాలడుగు గ్రామ కార్యదర్శి పెండ్లి అయినట్లు, ముగ్గురు సాక్షుల సంతకాలతో ఆర్ఐ శ్రీనివాసరావు ధ్రువీకరించారు. ఈ పత్రం ఆధారంగా మరో ముగ్గురు సాక్షులు సంతకాలు చేయగా, మోత్కూరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో మ్యారేజ్ సర్టిఫికెట్ ఇష్యూ చేశారు. అనంతరం కల్యాణలక్ష్మి స్కీమ్ కోసం రాధిక తల్లిదండ్రులు సోమ లక్షమ్మ, స్వామి అప్లై చేశారు.
ఇటీవలే కల్యాణలక్ష్మి కింద రూ.1,00,116 మంజూరు కావడం, ఆ చెక్‌ను సోమ లక్షమ్మకు అందించారు. 14 ఏండ్ల కింద పెండ్లి అయిన రాధికకు కల్యాణలక్ష్మి మంజూరు కావడం మండలంలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఉన్నతాధికారులకు స్థానికులు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపించారు. దీంతో సోమ లక్షమ్మ కల్యాణలక్ష్మి సొమ్ము వాపస్ చేశారు. డబ్బుల కోసం ప్రభుత్వాన్ని మోసం చేసినందుకు దంపతులు రాధిక, మహేశ్, సోమ లక్షమ్మతో పాటు సాక్షులుగా సంతకాలు చేసిన ఆరుగురిపై పోలీసులకు రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో వారిపై చీటింగ్ కేసు నమోదైంది. విచారణ చేయకుండా పెండ్లి జరిగినట్లు ధ్రువీకరించిన సెక్రటరీ, ఆర్ఐను సస్పెన్షన్ చేస్తూ కలెక్టర్ హనుమంతరావు ఆదేశాలు జారీ చేశారు.