కొప్పల్: కర్ణాటకలోని గంగావతి తాలూకాలో విషాద ఘటన జరిగింది. డిసెంబర్ 20న పెళ్లి పీటల మీద కూర్చోవాల్సిన జంట ప్రాణాలు కోల్పోయింది. యాక్సిడెంట్లో అబ్బాయి, అమ్మాయి ఇద్దరూ చనిపోయారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఈ విషాదానికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. కొప్పల్ తాలూకాలోని హనుమాన హట్టి గ్రామానికి చెందిన కరియప్ప అనే 26 ఏళ్ల యువకుడికి, కరతగి తాలూకాలోని ముస్తూరు గ్రామానికి చెందిన కవిత అనే యువతికి పెద్దలు పెళ్లి కుదిర్చారు. నిశ్చితార్థం కూడా జరిగింది. డిసెంబర్ 20న పెళ్లి ముహూర్తం. ఇద్దరి ఇండ్లలో పెళ్లి సందడి మొదలైంది. ఇంతలో ఈ రెండు కుటుంబాలను కారు మేఘాలు కమ్మేశాయి. శోక వర్షం కురిసింది. ఏ శాపం తగిలిందో గానీ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్కు సంతోషంగా వెళ్లిన కరియప్ప, కవిత శవాలై తిరిగి రావడంతో ఆ రెండు కుటుంబాలు శోక సంద్రంలో మునిగిపోయాయి.
►ALSO READ | ఇండిగో నెత్తిన పెద్ద బండ.. 5 శాతం రూట్లను కోల్పోక తప్పని పరిస్థితి
ఆదివారం రాత్రి ప్రీ వెడ్డింగ్ షూట్ ముగించుకుని తిరిగి బైక్పై ఇంటికి వెళుతుండగా లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో.. ఎదురుగా వచ్చిన మరో లారీ ఈ జంట ప్రయాణిస్తున్న బైక్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. రక్తం చాలా పోవడంతో.. కవిత స్పాట్లోనే చనిపోయింది. హాస్పిటల్కు తీసుకెళుతున్న క్రమంలో.. కరియప్ప ప్రాణం పోయింది. ఇలా ఇంచుమించు పది రోజుల్లో పెళ్లి పీటలపై కూర్చొని వైవాహిక బంధంలోకి అడుగు పెట్టాల్సిన ఈ జంటను ఇరు కుటుంబాలు స్మశానానికి సాగనంపాల్సిన పరిస్థితి రావడంతో రెండు గ్రామాల్లో పెను విషాదం నెలకొంది.

