V6 News

ఇండిగో నెత్తిన పెద్ద బండ.. 5 శాతం రూట్లను కోల్పోక తప్పని పరిస్థితి

ఇండిగో నెత్తిన పెద్ద బండ.. 5 శాతం రూట్లను కోల్పోక తప్పని పరిస్థితి

డీజీసీఏ ఆదేశాలు లెక్క చేయకుండా విమానయాన రంగంలో  ఓ పెద్ద సంక్షోభానికి కారణమైన ఇండిగో భారీ మూల్యం చెల్లించుకోక తప్పేలా లేదు. ఫ్లైట్ షేర్ లో దాదాపు 5 శాతం ఇతర ఎయిర్ లైన్స్ కు కోల్పోయే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇండిగో నిర్లక్ష్యంపై ఆగ్రహంతో ఉన్న కేంద్ర ప్రభుత్వం.. గట్టి బుద్ధిచెప్పేలా చర్యలు తీసుకునేందుకు రెడీ అయ్యింది. అందులో భాగంగా ఇండిగో శీతాకాల విమాన ప్రయాణాలను కట్ చేయనున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఇప్పటికే ప్రకటించారు. ఇండిగోకు చెందిన స్లాట్స్ ను వేరే ఎయిర్ లైన్స్ కు కేటాయించనున్నట్లు ఆయన తెలిపారు. 

మంగళవారం (డిసెంబర్ 09) ఫ్లైట్ షెడ్యూల్స్, ప్రయాణాలలో అంతరాయం పై విమానయాన మంత్రిత్వ శాఖ  అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న ఎయిర్ లైన్స్ రూట్స్ తదితర అంశాలపై చర్చలు జరపనున్నారు. ఈ మీటింగ్ తర్వాత ఇండిగో ఫ్లైట్ రూట్స్ తగ్గింపుపై ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. 

కొనసాగుతున్న విమానాల రద్దు:

ఇండిగో సంక్షోభం ముగిసిందని.. ఎలాంటి అతరాయం లేకుండా పూర్తి స్థాయిలో ఫ్లైట్స్ నడిపిస్తామని ప్రకటించినప్పటికీ.. విమానాల రద్దు కొనసాగుతూనే ఉంది.మంగళవారం లక్నో నుంచి 26 ఇండిగో ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. అదే క్రమంలో బెంగళూరు నుంచి 121, చెన్నై 81, హైదరాబాద్ 58, ముంబై 31, అహ్మదాబాద్ 16 విమానాలు రద్దయ్యాయి. అయితే ఢిల్లీ విమానాశ్రయం నుంచి విమానాలు రద్దు కాలేదు.

ఇటీవల పైలట్ల డ్యూటీ షెడ్యూల్ పై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)  కొత్త విమాన విధి విధానాలను  ప్రకటించింది.  అయితే సవరించిన కొత్త ప్రకారం..ఇండిగో సిబ్బందిని షెడ్యూల్ చేయడంలో విఫలమైంది. దీంతో డిసెంబర్ 1 నుంచి  7 వరకు  ప్రయాణికులు ఎయిర్ పోర్టులలో నిరీక్షించాల్సి వచ్చింది. ఇండిగో ఫ్లైట్ సంక్షోభం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే  DGCA కొత్త భద్రతా నిబంధనల అమలును తాత్కాలికంగా నిలిపివేసింది.