V6 News

రూల్స్ వ్యవస్థను మార్చడానికే.. ప్రజలను వేధించడానికి కాదు: ఇండిగో సంక్షోభంపై ప్రధాని మోదీ

రూల్స్ వ్యవస్థను మార్చడానికే.. ప్రజలను వేధించడానికి కాదు: ఇండిగో సంక్షోభంపై ప్రధాని మోదీ

ఇండిగో సంక్షోభంపై ప్రధాని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం (డిసెంబర్ 09) ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ అనంతరం.. ఇండిగో సంక్షోభంపై మాట్లాడిన ప్రధాని.. నిబంధనలు ఉన్నవి వ్యవస్థను మార్చడానికేనని.. ప్రజలను వేధించడానికి కాదని అన్నారు. 

పార్లమెంటరీ పార్టీ మీటింగ్  సందర్భంగా.. ప్రజలు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా చూడాలని ఎన్డీఏ ఎంపీలకు చెప్పారని పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ కిరెన్ రిజిజు చెప్పారు. 

ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యే సంస్కరణలపై దృష్టి పెట్టాలని మోదీ సూచించారు. ప్రభుత్వం నుంచి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా చూడాలని చెప్పారు. 

ఇండిగో సంక్షోభం 8వ రోజు కూడా కొనసాగుతుండటంపై ఆగ్రహించిన ప్రధాని మోదీ.. ఈ వ్యాఖ్యలు చేసినట్లు కిరెణ్ రిజిజు తెలిపారు. మంగళవారం (డిసెంబర్ 09) కూడా దేశ వ్యాప్తంగా 250 విమానాలు రద్దయ్యాయి. 

ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిట్ (FDTL) నిబంధనల  కారణంగా దేశ వ్యాప్తంగా విమానయాన రంగంలో సంక్షోభం తలెత్తింది. వారాంతపు సుదీర్ఘ పని గంటల నుంచి పైలట్లకు ఉపశమనం కల్పించాలని, నైట్ డ్యూటీ విషయంలో మరింత వెసులుబాటు, రెస్ట్ ఉండాల్సిందిగా పౌరవిమానయన శాఖ నిబంధనలు విధించింది. ప్రభుత్వ ఆదేశాలను అనుసరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇండిగో ఇప్పుడు సంక్షోభానికి కారణమైంది.