V6 News

రోస్టరింగ్ వైఫల్యమే కారణం: ఇండిగో సంక్షోభంపై లోక్ సభలో కేంద్రం కీలక ప్రకటన

రోస్టరింగ్ వైఫల్యమే కారణం: ఇండిగో సంక్షోభంపై లోక్ సభలో కేంద్రం కీలక ప్రకటన

న్యూఢిల్లీ: గత వారం రోజులుగా విమాన ప్రయాణికులకు నరకయాతన చూపిస్తోన్న ఇండిగో ఎయిర్ లైన్స్ సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇండిగో సంక్షోభానికి ఆ సంస్థ అంతర్గత రోస్టరింగ్ వైఫల్యమే ప్రధాన కారణమని స్పష్టం చేసింది. ఇండిగో సంక్షోభంపై లోక్ సభలో ప్రతిపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలకు మంగళవారం (డిసెంబర్ 9) కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండిగో సంక్షోభానికి ఆ సంస్థ అంతర్గత రోస్టరింగ్ విధానమే ప్రధాన కారణమని తెలిపారు.  

ఇండిగో సంస్థకు డీజీసీఏ నోటీసులు ఇచ్చిందని చెప్పారు. ఇండిగో సమస్యపై ఇప్పటికే విచారణకు ఆదేశించామని.. చట్ట ప్రకారం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రయాణికుల భద్రత విషయంలో రాజీ పడేది లేదని.. ప్రయాణికులు ఇబ్బంది పడితే యాజమాన్యాలే బాధ్యత వహించాలని ఖరాకండిగా చెప్పారు. 

ఇండిగో కార్యకలాపాలు వేగంగా స్థిరీకరించబడుతున్నాయని తెలిపారు. ఎంత పెద్ద ఎయిర్ లైన్స్ అయినా ప్రణాళిక వైఫల్యాలు, నిబంధనలను పాటించకుండా ప్రయాణీకులకు ఇబ్బందులు కలిగించడానికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబడదని తేల్చిచెప్పారు. డీజీసీఏ సవరించిన పైలట్, సిబ్బంది నూతన రోస్టరింగ్ నియమాలపై ఎలాంటి చర్చ ఉండదని చెప్పారు. 

ఇండిగో ఎయిర్ లైన్స్ సంక్షోభం వరుసగా 8వ రోజు కూడా కొనసాగుతుంది. మంగళవారం (డిసెంబర్ 09) కూడా దేశ వ్యాప్తంగా 250 విమానాలు రద్దయ్యాయి. ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిట్ (FDTL) నిబంధనల కారణంగా దేశ వ్యాప్తంగా విమానయాన రంగంలో సంక్షోభం తలెత్తింది. వారాంతపు సుదీర్ఘ పని గంటల నుంచి పైలట్లకు ఉపశమనం కల్పించాలని, నైట్ డ్యూటీ విషయంలో మరింత వెసులుబాటు, రెస్ట్ ఉండాల్సిందిగా పౌరవిమానయన శాఖ నిబంధనలు విధించింది. ప్రభుత్వ ఆదేశాలను అనుసరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇండిగో ఇప్పుడు సంక్షోభానికి కారణమైంది.