
మంచిర్యాల, వెలుగు : కొడుకు చనిపోయాడన్న బాధ తట్టుకోలేక పదేండ్ల కూతురితో కలిసి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో వెలుగుచూసింది. టౌన్ సీఐ ప్రమోదరావు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల పట్టణంలోని రాజీవ్‌నగర్‌కు చెందిన చక్రపాణి (36), భార్య దివ్య (32), కొడుకు పవన్ (12), కూతురు దీక్షిత (10) ఉన్నారు.
చక్రపాణి ఆటోనడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. పవన్ జ్వరంతో బాధపడుతూ రెండు నెలల కింద చనిపోయాడు. దీంతో చక్రపాణి, దివ్య కొడుకునే తలుచుకుంటూ బాధపడేవారు. ఈ క్రమంలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న దంపతులు ఈ నెల 5న రాత్రి కూతురు దీక్షితతో కలిసి పురుగుల మందు తాగారు.
అస్వస్థతకు గురైన వారిని సమీపంలో ఉన్న కుటుంబ సభ్యులు గమనించి వెంటనే మంచిర్యాల హాస్పిటల్‌కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లగా... చికిత్స పొందుతూ 9న దీక్షిత, ఆ తర్వాత రెండు రోజులకు దివ్య చనిపోగా, బుధవారం చక్రపాణి సైతం తుదిశ్వాస విడిచాడు. కొడుకు చనిపోయాడన్న బాధతో మిగతా ముగ్గురు చనిపోవడంతో కుటుంబసభ్యులు, బంధువులు విషాదంలో మునిగిపోయారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రమోదరావు తెలిపారు.
అప్పుల బాధతో యువకుడు...
మల్లాపూర్, వెలుగు : అప్పుల బాధతో గోదావరి నదిలో దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామానికి చెందిన జోరిగ గంగాధర్ (35) నిర్మల్ జిల్లా కేంద్రంలో ఫుట్‌వేర్ షాప్ నడుపుతున్నాడు. షాప్ సరిగా నడవకపోవడంతో అప్పులపాలయ్యాడు. దీంతో మనస్తాపానికి గురైన గంగాధర్ ఈ నెల 8న ఇంట్లో నుంచి వెళ్లి 10న సోన్ బ్రిడ్జి వద్ద గోదావరిలో దూకాడు.
బుధవారం మల్లాపూర్ మండలంలోని కొత్తధామ్‌రాజ్‌పల్లి గ్రామశివారులోని గోదావరిలో గంగాధర్ మృతదేహం దొరికింది. మృతుడి భార్య మౌనిక ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.