మళ్లీ తీహార్​ జైలుకు కవిత.. 9 రోజుల జ్యుడీషియల్​ కస్టడీ​ విధించిన కోర్టు

మళ్లీ తీహార్​ జైలుకు కవిత.. 9 రోజుల జ్యుడీషియల్​ కస్టడీ​ విధించిన కోర్టు
  •     ఆమె బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారు: సీబీఐ
  •     విచారణకు సహకరించడం లేదని వెల్లడి
  •     సీబీఐ వాదనలతో ఏకీభవించి తీర్పుచెప్పిన జడ్జి
  •     ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలి.. బెయిలివ్వండి.. కోర్టులో కవిత పిటిషన్​ 

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్​ వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి రౌస్ ఎవెన్యూలోని సీబీఐ స్పెషల్​ కోర్టు జ్యుడీషియల్​ కస్టడీ విధించింది. సీబీఐ దాఖలు చేసిన ఈ కేసులో ఆమెకు తొమ్మిది రోజుల కస్టడీ విధిస్తున్నట్లు సోమవారం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇప్పటికే ఈడీ కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీ ఏప్రిల్ 23 వరకు ఉండటంతో అప్పటి దాకా తీహార్​ జైల్లో ఉండాలని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలతో పోలీసులు ఆమెను తిరిగి తీహార్​ జైలుకు తరలించారు. 

విచారణకు సహకరిస్తలే 

లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో మార్చి 15న అరెస్టయి తీహార్ ​జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవితను ఈ నెల 11న సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. 12న కోర్టులో ప్రొడ్యూస్ చేయగా.. మూడు రోజులు సీబీఐ కస్టడీకి కోర్టు అప్పగించింది. మూడు రోజులు తమ అదుపులోకి తీసుకొని విచారించిన సీబీఐ అధికారులు.. కస్టడీ ముగియడంతో సోమవారం స్పెషల్ కోర్టు జడ్జి కావేరి బవేజా ముందు హాజరుపరిచారు. సీబీఐ తరఫున సీనియర్ అడ్వకేట్ పంకజ్ కుమార్ వాదనలు వినిపిస్తూ... కవిత మూడు రోజుల విచారణతో పాటు, కేసు పూర్వాపరాలు, ఎవిడెన్స్, కేసు పురోగతి, ఇతర అంశాలతో మొత్తం 11 పేజీల రిమాండ్ కాపీని కోర్టుకు సమర్పించారు. 

విచారణ టైంలో లిక్కర్ స్కామ్​కు సంబంధించిన సాక్ష్యాలు, ఆధారాలను కవిత ముందు ఉంచి సీబీఐ ప్రశ్నించిందని తెలిపారు. కానీ, కవిత విచారణకు సహకరించలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. శరత్ చంద్రారెడ్డి నుంచి తీసుకున్న రూ.14 కోట్ల గురించి ఆమె సీబీఐ ప్రశ్నించిందని.. అదేవిధంగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి, శరత్ చంద్రారెడ్డి, బుచ్చిబాబు, విజయ్ నాయర్ సహా నిందితులతో జరిగిన సమావేశాల గురించి ఇంటరాగేషన్ చేసిందని చెప్పారు. నగదు బదిలీల గురించి కవిత సరైన సమాధానాలు ఇవ్వలేదని, ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించిందని అన్నారు. అడిగిన ప్రశ్నలకు కవిత సమాధానాలు ఇవ్వడం లేనందున సీబీఐ కస్టడీ పొడిగించాలని కోరడం లేదని చెప్పారు. 

అయితే,  రాజకీయాల్లో కవిత క్రియాశీలక నేత అని, చాలా ప్రభావితం చేయగల మహిళ అని.. అందువల్ల ఆమె బయట ఉంటే సాక్షులను, ఆధారాలను, కేసు దర్యాప్తును ప్రభావితం చేయగలరని.. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలుకు పంపాలని కోరారు. ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం... కవితకు 9 రోజుల జ్యుడీషియల్​ కస్టడీ విధిస్తూ తీర్పు వెలువరించింది. తదుపరి విచారణ ఈ నెల 23 వాయిదా పడింది.  

ఈడీ కేసులో బెయిల్ పిటిషన్​పై నేడు విచారణ

ఈడీ కేసులో కవిత దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్​పై మంగళవారం స్పెషల్​ కోర్టులో వాదనలు జరగనున్నాయి. లిక్కర్ స్కామ్​ మనీలాండరింగ్ కేసులో మార్చి 15న హైదరాబాద్​లోని కవిత నివాసంలో ఆమెను  ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. మరుసటి రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయగా.. రెండు దఫాలుగా మొత్తం 10 రోజుల ఈడీ కస్టడీకి కోర్టు అప్పగించింది. 

గత నెల 26న ఈడీ కస్టడీ ముగియడంతో కవితకు 14 రోజుల జ్యుడీషియల్​ కస్టడీని, ఆ తర్వాత మరో 14 రోజులు జ్యుడీషియల్​ కస్టడీని కోర్టు విధించింది. తన కొడుకు ఎగ్జామ్స్ నేపథ్యంలో మధ్యంతర బెయిల్, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని కవిత రెండు పిటిషన్లు దాఖలు చేశారు. అయితే ఇప్పటికే మధ్యంతర బెయిల్​పై విచారణ జరిపిన కోర్టు.. కొడుకు ఎగ్జామ్స్ కారణంతో మధ్యంతర రిలీఫ్ ఇవ్వలేమంటూ ఆ పిటిషన్​ను కొట్టివేసింది. రెగ్యులర్ బెయిల్​పై విచారణ వాయిదా వేయగా.. ఆ పిటిషన్​పై మంగళవారం విచారణ జరగనుంది. 

ఇది సీబీఐ కస్టడీ కాదు..బీజేపీ కస్టడీ


కోర్టు హాల్ నుంచి బయటకు వస్తూ కవిత కామెంట్స్​

‘‘ఇది సీబీఐ కస్టడీ కాదు.. బీజేపీ కస్టడీ. బయట బీజేపోళ్లు మాట్లాడేదే.. లోపల సీబీఐ వాళ్లు అడుగుతున్నరు. రెండేండ్ల నుంచి అడిగిందే అడుగుతున్నరు. నత్తింగ్ న్యూ’’ అని కవిత కామెంట్స్​ చేశారు. సోమవారం కోర్టు హాల్​ నుంచి బయటకు వస్తూ ఆమె పైవిధంగా స్పందించారు. కాగా, మరోసారి చేతికి జపమాలతో కవిత కనిపించారు.

కోర్టు ఆవరణలో మాటలేంది?..కవితపై జడ్జి సీరియస్​

కోర్టు ఆవరణలో మీడియాతో కవిత మాట్లాడటంపై సీబీఐ స్పెషల్​ కోర్టు జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై కవిత బెయిల్ పిటిషన్ సందర్భంగా ఆమె తరఫు అడ్వకేట్​ మోహిత్ రావును జడ్జి కావేరి బవేజా ప్రశ్నించారు. ‘‘కవిత ఏం చెప్పాలనుకున్నా.. విచారణ సమయంలో సీబీఐకి చెప్పాలి. కానీ, ఇట్ల కోర్టు ఆవరణలో మాట్లాడటం కరెక్ట్​ కాదు” అని హెచ్చరించారు. మీడియా అడిగితేనే కవిత మాట్లాడారని కోర్టుకు మోహిత్‌‌‌‌‌‌‌‌రావు నివేదించారు. ‘‘ఒకవేళ మాట్లాడాలి అనుకుంటే... కోర్టు బయట మాట్లాడాలి తప్ప కోర్టు ఆవరణలో, కారిడార్లలో మాట్లాడవద్దు” అని జడ్జి తేల్చి చెప్పారు. ఇదే విషయాన్ని కవితకు తెలియజేయాలని, అట్ల మాట్లాడకుండా చూడాలని అడ్వకేట్​కు స్పష్టం చేశారు.