- ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్
- 14 లోగా పూర్తి రిపోర్టివ్వాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు: డెంగీ నివారణకు తీసుకుంటున్న చర్యలపై నవంబర్ 14 లోగా పూర్తి వివరాలతో మరో నివేదిక ఇవ్వాలని హైకోర్టు డివిజన్ బెంచ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. డెంగీ నివారణకు తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ ప్రభుత్వం ఇచ్చిన నివేదికపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డితో కూడిన డివిజన్ బెంచ్ శనివారం అసంతృప్తి వ్యక్తం చేసింది. వ్యాధి నివారణకు కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు కానీ క్షేత్రస్థాయిలో వాటిని అమలు చేసినట్లు ఎలాంటి ఆధారాలు లేవని మండిపడింది. ‘ఫాగింగ్ యంత్రాలు, స్ప్రేయర్లు తదితర సామగ్రి సమకూర్చుకోవాలని ఆదేశించాం.. వాటిలో ఎన్ని కొనుగోలు చేశారు?’ అని కోర్టు ప్రశ్నించగా.. మరికొంత సమయం కావాలని ప్రభుత్వ లాయర్ కోరారు. 4 వారాల్లో పరిస్థితిని అదుపులోకి తేవాలని ఆదేశించాం.. ఇప్పటికే రెండు వారాలు గడిచిపోయాయి..ఇంకెప్పుడు కొనుగోలు చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆరు నెలలు గడిచిన తర్వాత కొంటారా అని ప్రశ్నిస్తూ ఈలోగా డెంగీ దోమల సీజన్ ముగిసిపోతుందని వ్యాఖ్యానించింది. కేసు విచారణ ఈ నెల 15 కు వాయిదా వేస్తూ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది.
కేంద్రం సూచనలు పాటిస్తున్నరా లేదా?
డెంగీ నివారణకు చర్యలు తీసుకోవడంతోపాటు ప్రజలను చైతన్యపరిచేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కోరుతూ డాక్టర్ ఎం.కరుణ దాఖలు చేసిన పిల్‌తో పాటు.. స్వైన్ ఫ్లూ, మలేరియా, డెంగీ జ్వరాల వ్యాప్తిపై లాయర్ ఆర్.భాస్కర్ రాసిన లేఖను సుమోటో పిల్‌గా తీసుకుని బెంచ్ ఇదివరకే విచారణ చేపట్టింది. ఈ రెండు వ్యాజ్యాలు శనివారం మరోసారి విచారణకు వచ్చాయి. గత విచారణ సందర్భంగా మౌంటెడ్ పొగ యంత్రాలను 10 నుంచి 60 కి, పవర్ స్ప్రేయర్స్ 50 నుంచి 1,000 కి, చేతితో పనిచేయించే స్ప్రేయర్లు 667 నుంచి వెయ్యికి పెంచాలని ఆదేశించాం.. ఎంతవరకు కొనుగోలు చేశారని ప్రభుత్వాన్ని బెంచ్ ప్రశ్నించింది. యంత్రాల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చామని, మంగళవారం వరకు కొన్ని చేరుకుంటాయని ఏజీపీ కోర్టుకు తెలిపారు. మరోసారి బెంచ్ కల్పించుకుని.. దోమకాటు వల్ల వ్యాప్తి చెందే రోగాలను నియంత్రించేందుకు కేంద్ర సంస్థల సూచనలు పాటిస్తున్నారా అని అడిగింది.
