- సుప్రీం కోర్టు తీర్పులు అవే చెప్తున్నయ్
- పార్టీ ఫిరాయింపులపై హైకోర్టుకు ఏజీ వివరణ
- పిటిషన్లు పెండింగ్‌లో ఉంటే స్పీకర్ నిర్ణయం తీసుకోరా?
- ఏజీని ప్రశ్నించిన జడ్జి
హైదరాబాద్, వెలుగు: పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌కు కోర్టులు ఉత్తర్వులు జారీ చేయలేవని అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి హైకోర్టుకు తెలిపారు. ఈ మేరకు సుప్రీం కోర్టు తీర్పులు ఉన్నాయని వివరించారు. కోర్టులో పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నంత వరకు స్పీకర్ నిర్ణయం తీసుకోరా? అని ఏజీని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై ఆయన స్పందిస్తూ.. ఇవి రాజ్యాంగపరమైన విషయాలని, వీటిని కోర్టులు దాటవేయలేవని సమాధానం ఇచ్చారు. స్పీకర్‌కు పిటిషన్ ఇచ్చిన పది రోజులకే పిటిషనర్లు హైకోర్టులో సవాల్ చేశారని చెప్పారు.
స్పీకర్ నిర్ణయం తీసుకునేదాకా కూడా ఆగలేదని హైకోర్టుకు ఏజీ వివరించారు. రాజ్యాంగం ప్రకారం స్పీకర్పోస్టు ఎంతో అత్యున్నతమైందని తెలిపారు. స్పీకర్ నిర్ణయం తీసుకునే వరకు కోర్టులు జోక్యం చేసుకోరాదని చెప్పారు. ఈ మేరకు సుప్రీం కోర్టు తీర్పులు కూడా ఉన్నాయని గుర్తు చేశారు. స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై న్యాయ సమీక్ష చేసేందుకు వీలుందని అన్నారు.
కాగా, ఖైరతాబాద్, భద్రాచలం, స్టేషన్ ఘన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి బీఆర్‌ఎస్ పార్టీ తరఫున గెలిచిన దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై సోమవారం జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి విచారణ జరిపారు.
ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. హైకోర్టులో పిటిషన్ వేసి నెల రోజులు అవుతున్నదని, మరో మూడు నెలల వరకు విచారణ జరిగితే అప్పటి దాకా స్పీకర్ చర్యలు తీసుకోరా? అని ఏజీని జడ్జి ప్రశ్నించారు. స్పీకర్ నిర్ణయం వెలువరించాక దానిపై న్యాయ సమీక్షకు ఆస్కారం ఉంటుందని ఏజీ జవాబు చెప్పారు. దీంతో వాదనలు మంగళవారానికి వాయిదా పడ్డాయి.
