కోర్టులు ఊర్లకొస్తయ్!

కోర్టులు ఊర్లకొస్తయ్!

వందమంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక నిర్దోషికైనా శిక్ష పడొద్దు. ఇది కోర్టు చెప్పే న్యాయ సూత్రం. బాధితుడికి భరోసా ఇవ్వాలి, తప్పు చేసిన వాడిని శిక్షించాలి. చట్టం చెప్పే మాటలివే. వ్యవస్ధలో ఎక్కడ న్యాయం జరగకపోయినా ‘కోర్టుల్లో తేల్చుకుందాం’ అనే భరోసా ఇప్పటికీ జనంలో ఉంది. అది తప్పుడు కేసులు పెట్టి బెదిరించే పోలీసులైనా, మాట వినకుండా పరపతికి, పైసలకి తలొగ్గే అధికారులనైనా మెడలు వంచే శక్తి ఒక న్యాయ వ్యవస్ధకే ఉందనేది ప్రజల నమ్మకం.

ఏటేటా పెరుగుతున్న జనాభాకి,వివాదాలకి,కేసులకి సరిపడా కోర్టులు మాత్రం అందుబాటులో లేవనేది కాదనలేని సత్యం. అందుబాటులో చాలా కోర్టులు ఉన్నా, వచ్చే కేసుల సంఖ్యతో కోర్టులు సతమతమవుతున్నాయన్నది న్యాయ నిపుణులు మాట. సాధారణంగా ప్రతీరోజు కోర్టుల్లో వందల ఫిర్యాదులు, పిటిషన్లు వస్తున్నా వాటి పరిష్కారం మాత్రం ఆయా కేసుల తీవ్రతని బట్టే ఉంటుంది. హాస్పిటళ్లలో ఎలాగైతే ఎమర్జెన్సీ కేసులకి హై–ప్రయారిటీ, సాధారణ కేసులకి లో–ప్రయారిటీ ఉంటుందో, అలానే కోర్టుల్లోనూ పిటిషన్లని బట్టి చాలా సందర్బాల్లో విచారణ జరుగుతుంది. చిన్నచిన్న వివాదాలకి కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేసినా ఆ పిటిషన్లు విచారణకి రావడానికి సమయం పడుతుంది.  కోర్టులకి ఎక్కువ పరిధి ఉండడం,పిటిషన్ల సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల కేసుల విచారణ, పరిష్కారానికి సమయం పడుతోందంటున్నారు న్యాయవాదులు.

అయితే చాలా గొడవలకు గ్రామస్ధాయిలోనే పరిష్కారం దొరికే అవకాశాలుంటాయి. కొన్నేళ్ళ కిందట ఏవైనా సమస్యలు, వివాదాలు తలెత్తితే గ్రామస్ధాయిలోనే తీర్మానం, గ్రామ తీర్పులు ఉండేవి. పెద్దమనుషుల పంచాయితీలు ఉండేవి. దీంతో గ్రామాల్లో జరిగే భూ వివాదాలు, గట్టు పంచాయితీలు, వ్యక్తిగత వివాదాలు, ఆస్తుల తగాదాలు గ్రామాల్లోని గ్రామపంచాయితీల్లోనో, గ్రామాల్లోని పెద్దల సమక్షంలోనో పరిష్కారమయ్యేవి కానీ, మారిన కాలంతో పాటు జనాల మైండ్ సెట్ చేంజ్ అయింది. అలాగే ఇప్పుడు అలాంటి పరిస్థితులు చాలా గ్రామాల్లో లేకపోవడంతో పోలీసుస్టేషన్లని ఆశ్రయించడం లేదంటే కోర్టు మెట్లెక్కడం కామన్ అయిపోయింది. దీంతో గతంలోకన్నా ఇప్పడు కోర్టుల్లో పిటిషన్ల సంఖ్య పెరిగందంటున్నారు ఉన్నతాధికారులు.

ఏ ప్రభుత్వ సిబ్బందికైనా, ఉన్నతాధికారికైనా నేతల పేర్లు, పై అధికారుల పేర్లు చెబితే భయపడతారో లేదో కానీ, కోర్టు ఒక్క కామెంట్ చేసినా, నోటీసులిచ్చినా, ఆర్డర్లిచ్చినా వణికిపోతారు, తూచా తప్పకుండా కోర్టు చెప్పింది అమలు చేస్తారు, న్యాయం చేస్తారు. కారణం చట్టానికి, జ్యుడీషియరీకి వ్యవస్దకి ఉన్న పవర్,పరిధి అలాంటిది. అందుకే ఎక్కడ న్యాయం దొరక్కపోయినా, వ్యవస్ధలో అవస్థలు పడ్డ ఏ బాధితుడైనా వెంటనే కోర్టు మెట్లెక్కుతాడు.

ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే… గ్రామ న్యాయాలయాలు (విలేజ్​ కోర్టులు) రావడం మంచి పరిణామం. బాధితులకి వెంటనే న్యాయం జరగడంతో పాటు కోర్టులు ఇంటి గడప దగ్గరికి వెళ్లినట్టవుతుంది. వ్యవస్దలో ఉన్న అధికారులపై కూడా కోర్టుల ప్రభావం పెరుగుతుంది. తద్వారా బాధితులకి భరోసా దొరుకుతుంది.

గ్రామీణ ప్రాంత ప్రజలకు సత్వర న్యాయాన్ని అందించి, పై కోర్టుల్లో పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించే ఉద్దేశంతో గ్రామ న్యాయాలయాలు ఏర్పాటు చేయాలని గతంలో కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకువచ్చింది. కానీ, ఈ చట్టాన్ని అమలు చేయడంలో కొన్ని రాష్ట్రాలు ఫెయిలయ్యాయి. వాటిలో తెలంగాణ రాష్ట్రం కూడా ఉంది. అయితే ఈ విషయం మీద సుప్రీంకోర్టు మండిపడింది. ఏర్పాటు చేయడంలో విఫలమైనందుకు సంజాయిషీ ఇస్తూనే, గ్రామ న్యాయాలయాలు సత్వరంగా ఏర్పాటు చేసే చర్యలు చేపట్టాలని ఆదేశించింది.

గ్రామ న్యాయాలయాలు అంటే ఏంటీ…

గ్రామీణ ప్రజలకు వెనువెంటనే న్యాయం అందించడానికి విలేజ్​ కోర్టులు ఏర్పాటు చేయాలని గ్రామ న్యాయాలయాల చట్టం 2008 చెబుతోంది. ఎలాంటి ఖర్చు, ఇబ్బంది లేకుండా ఎక్కడి సమస్యకు అక్కడే తీర్పు వచ్చేలా చేయడమే వీటి ఉద్దేశం. గాంధీ జయంతి అక్టోబర్ 2, 2009న ఈ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ కోర్టులకు సివిల్, క్రిమినల్ కోర్టులకు ఉండే అధికారాలు ఉంటాయి. వీటి ప్రధాన కేంద్రం మండలం లేదా బ్లాకు స్థాయిలో ఉన్నప్పటికీ ఏ గ్రామంలో సమస్య ఉంటే అక్కడికే ఈ మొబైల్ కోర్టు వెళ్లి న్యాయం చేయాల్సి ఉంటుంది. ఈ చట్టంలో పేర్కొన్న మొదటి, రెండవ షెడ్యూళ్ల ప్రకారం ఈ కోర్టుల్లో కుదిరిన తీర్పుల విషయంలో సివిల్, క్రిమినల్ కేసుల మీద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవచ్చు. వీలైనంత వరకు ఈ కోర్టులు వివాదాలను రాజీ పద్ధతిలో పరిష్కరించాల్సి ఉంటుంది. కౌన్సెలర్ల సాయం తీసుకోవచ్చు.

అధికారులెవరు ఎవరుంటారు…

ఈ కోర్టులు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్‌కి చెందినవి. వీటికి మెజిస్ట్రేట్​ స్థాయి అధికారి ఉంటారు. ఈయనను సంబంధిత రాష్ట్ర హైకోర్టు నియమిస్తుంది. హైకోర్టు కింద పనిచేసే అన్ని ఫస్ట్ క్లాస్  మెజిస్ట్రేట్​లకు ఉండే అధికారాలే ఈ కోర్టుల మెజిస్ట్రేట్​లకీ ఉండే అవకాశముంది. కోర్టుల నిర్మాణం కోసం ఒకోదానికి 18 లక్షలు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. ఇందులో 10 లక్షలు బిల్డింగ్ నిర్మాణానికి, 5 లక్షలు వెహికిల్స్ కోసం, 3 లక్షలు ఆఫీసు సామాగ్రి కోసం ఖర్చుచేయాలి.

అమలులో సమస్యలేంటి..

గ్రామ న్యాయాలయాలు పూర్తిస్థాయిలో పనిచేస్తే సబార్డినేట్ కోర్టుల్లో పెండింగ్ ఉన్న కేసులు 50 శాతం వరకు తగ్గుతాయి. కొత్త కేసులకు ఆరు నెలల్లోగా న్యాయం జరుగుతుంది.

గ్రామ న్యాయాలయాలు ఇండియన్​ ఎవిడెన్స్​ యాక్ట్​–1872కి కట్టుబడి ఉండాల్సిన పని లేదు. కానీ, హైకోర్టు సలహాలు, సూచనల పరిధిలో పనిచేయాలి. ఈ చట్టం కింద 5వేలకి పైగా విలేజ్​ కోర్టులు ఏర్పాటవుతాయని అనుకున్నారు. కానీ కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లో మాత్రమే ఇవి పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి. తెలంగాణతోపాటు గుజరాత్, పశ్చిమ బెంగాల్, హర్యానా, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలు వీటి ఏర్పాటుకై అసలు అఫిడవిట్లే దాఖలు చేయలేదు. కాబట్టి అఫిడవిట్లు దాఖలు చేసి, సంజాయిషీ ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ లెక్కన చూస్తే త్వరలోనే తెలంగాణలో విలేజ్​ కోర్టులు ఏర్పాటవబోతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.అలా రాష్ట్రానికి  సుమారు 55 కోర్టులు వచ్చే అవకాశముందంటున్నారు న్యాయ నిపుణులు.                                                    ‑ సంపత్ గంగ. క్రైమ్ బ్యూరో చీఫ్

జడ్జీల కొరత బాగా ఉంది

2002లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం దేశంలో 2007 నాటికి ప్రతి 10 లక్షల మందికి 50 మంది జడ్జీలు ఉండాలి. ఈ లెక్కన ఇప్పటి జనాభా ప్రకారం చూస్తే దేశవ్యాప్తంగా 50 వేల మంది జడ్జీలు ఉండాలి. ఇప్పుడున్న ది కేవలం 16 వేల మంది మాత్రమే.

ఇంటి గడపవద్దే న్యాయం అందించడమే ఈ చట్టం లక్ష్యం.
విలేజ్​ కోర్టులవల్ల కోర్టులపై భారం తగ్గుతుంది
భూ వివాదాలు, గట్టు తగాదాలపై అక్కడికక్కడే పరిష్కారం దొరికే అవకాశం.
రాష్ట్రంలో 55 విలేజ్ కోర్టులు వచ్చే అవకాశం
జూనియర్‌ సివిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జడ్జి లేదా ఫస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్లాస్‌ జ్యుడీషియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెజిస్ట్రేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నియమించే అవకాశం                          ‑ రవిందర్ రెడ్డి, మాజీ జడ్జి

జనం ముంగిట్లోకి న్యాయం

విలేజ్​ కోర్టులతో న్యాయం ముంగిట్లోకి వచ్చినట్టవుతుంది. ఈ కోర్టుల ఏర్పాటు ఎంత ముఖ్యమో, అమలు కూడా అంతే ముఖ్యం. గ్రామ స్థాయిలో అనేక పిటి కేసులకి , సమ్మరీ ట్రయల్ కేసులకి స్ధానికంగా పరిష్కారం దొరుకుతుంది. ఉదాహరణకి పబ్లిక్ రోడ్లపై మురుగు నీరు వదలడం నేరం. అలాంటి వాటిపై పిటిషన్లు వేస్తే కోర్టుల్లో జరిమానా కట్టాలి. అదే స్థానిక కోర్టులుంటే దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండానే స్థానికంగానే శిక్షల్ని అమలు చేయొచ్చు. చిన్నచిన్న తగాదాలకి స్థానికంగా పరిష్కారం దొరికితే పై కోర్టులపై భారం కూడా తగ్గుతుంది.    ‑ గాదెపాక శంకర్, అడ్వకేట్​

సెటిల్మెంట్లు ఆగుతయి

సాధారణంగా ఉళ్ళల్లో ఉండే జనాలకి అన్ని సమస్యలకు పరిష్కార కేంద్రాలు పోలీసు స్టేషన్లే అనే భావన ఉంటుంది. కోర్టులకు వెళ్లడం దేవుడెరుగు, అసలు ఆయా ప్రాంతాల పరిధిలో కోర్టులు ఎక్కడున్నయో కూడా జనాలకి తెలియదు.  ఫిర్యాదులు, పిటిషన్లు పోలీసు స్టేషన్లకొచ్చినా సెటిల్మెంట్లు చేసి డబ్బులు గుంజుతున్నారన్న ఆరోపణలున్నాయి. కొన్ని సందర్భాల్లోనయితే స్ధానిక నేతల అండదండలతో బాధితుల్ని పక్కన బెట్టి, అవతలివైపు వ్యక్తికి అండగా ఉండి సెటిల్మెంట్లు చేస్తున్నారు. అదే ఈ కోర్టులు వస్తే బాధితులకు  ఇబ్బందులు తగ్గే అవకాశముంటుంది.   ‑ లక్ష్మారెడ్డి, జాతీయ జ్యుడీషియల్ ఎంప్లాయిస్ అధ్యక్షుడు.

see also: సరోగసి కాదు.. సహజీవనం చేద్దమన్నడు

చాక్లెట్లు, పానీపూరి ఆశచూపి.. బాలికపై అత్యాచారం